Home Unknown facts చదువు, తెలివితేటలు ప్రసాదించే సరస్వతీదేవి ఆలయం గురించి తెలుసా?

చదువు, తెలివితేటలు ప్రసాదించే సరస్వతీదేవి ఆలయం గురించి తెలుసా?

0
1238

సరస్వతీ దేవీ సకల విద్యాస్వరూపిణి. ఈ దేవిని ఒక్క హిందువులు మాత్రమే కాకుండా జైనులు, బుద్దులు కూడా ఆరాధిస్తారు. కంబోడియా, థాయిలాండ్ వంటి దేశాల్లో కూడా సరస్వతీదేవిని చదువుల తల్లిగా కొలుస్తారు. సరస్వతీదేవి కొలువై ఉన్న ప్రముఖ దేవాలయంలో ఇది కూడా ఒకటిగా చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

saraswathi deviతెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేటకి దగ్గరలో ఉన్న వర్గల్ అనే గ్రామంలో ఒక కొండపైన శ్రీ విద్య సరస్వతీదేవి ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రదేశంలో 400 సంవత్సరాల క్రితం శంబు దేవాలయం ఉండేదట. ఈ ఆలయం భూమి నుండి రెండు అడుగుల లోతులో ఉండగా, అందులో నుండి పాక్కుంటూ శంబు స్వామిని దర్శనం చేసుకునేవారట. ఇంకా ఇక్కడ ఒక రాతి జయస్తంబం ఉండగా, ఆ ధ్వజస్తంభం పైన సీతారామ, లక్ష్మణ, లక్ష్మీదేవి విగ్రహాలతో పాటు పెనవేసుకొని ఉన్న రెండు జంట సర్ప విగ్రహాలు కూడా ఉన్నవి. ఇలా ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న ఈ ప్రదేశంలో సరస్వతీదేవి ఆలయాన్ని నిర్మించాలని భావించి 1989 సంవత్సరంలో వసంత పంచమి నాడు ఆలయ శంకుస్థాపన చేయగా, 1992 సంవత్సరంలో మాఘ శుద్ధ త్రయోదశినాడు పుష్పగిరి పీఠాదిపతులు శ్రీ శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి ఈ ఆలయం లో  శ్రీ విద్యా సరస్వతి , శ్రీ  శనైశ్చర విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ తరువాత కంచి పీఠానికి చెందిన శ్రీ శ్రీ శంకర విజయ సరస్వతీ స్వామి వారు ఇక్కడ ఒక వేదపాఠశాలని ప్రారంభించారు.

saraswathi deviఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయానికి ఎక్కువగా భక్తులు పిల్లలకి అక్షరాబ్యాసం చేయించడానికి వస్తుంటారు. ఇంకా ఈ ఆలయంలో నిత్యం తామరపూలతో అష్టోత్తర పూజ ఉంటుంది. ఇక్కడ సరస్వతి దేవి ఆలయంతో పాటు శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం, శనీశ్వరుని దేవాలయం కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న శనీశ్వరుని ఆలయంలో ప్రతి నెల త్రయోదశి నాడు శనీశ్వర పూజ నిర్వహిస్తారు.

saraswathi deviఈవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం సరస్వతి అమ్మవారి జన్మదినమైన వసంత పంచమి రోజున ప్రత్యేక పూజలతో పాటు విశేష కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా దసరా సందర్బంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు.