వీరభద్రుని అవతారంగా భక్తులు భద్రేశ్వరస్వామిని కొలుస్తారు. ఈ ఆలయం ఎంతో మహిమ కలదని చెబుతారు. ఇది చాలా ప్రాచీన దేవాలయం. ఇక్కడ వెలసిన ఈ స్వామి కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ నిత్య పూజలందుకుంటున్నాడు. అయితే 200 వందల సంవత్సరాల క్రితం మహిమగల శరణు బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చి అదృశ్యమైన ప్రదేశంగా దీనిని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, తాండూర్ మండలం నందు భావిగి భద్రేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఉత్సవాలు భారీ ఎత్తున భక్తజన సందోహంలో జరుగుతాయి. శని, ఆది వారాల్లో జరిగే రథోత్సవం, లంకా దహనం కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అత్యుత్సాహంతో అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వేచిఉంటారు. శనివారం అర్థరాత్రి జ జరిగే రథోత్సవంలో 50 అడుగులు ఎత్తు గల రథాన్ని వందలాది భక్తులు తాళ్ళతో లాగుతూ బసవన్న కట్ట వరకు తీసుకువెళ్ళి మరలా యధాస్థానానికి చేరుస్తారు. ఆదివారం అర్థరాత్రి జరిగే లంకాదహన కార్యక్రమంలో రకరకాల ఆకారాలు, డిజైన్లు ఉన్న బాణాసంచా కాలుస్తారు. ఇది చూడముచ్చటగా ఉంటుంది.మళ్లీ మళ్లీ చూడాలనిపించే కన్నుల విందైన వేడుకగా జరుగుతుంది.
ఈ ఆలయాన్ని మహిమ గల ఆలయం అని ఎందుకు అంటారంటే, కర్ణాటకలోని భావిగిలో ఒకసారి సామూహిక భోజనాలు జరిగుతుండగా నెయ్యి అయిపోయింది. స్వామివారికి ఈ విషయం తెలిసి నీటిగుండం నుంచి కడివెడు నీటిని తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆ నీటిని స్వామివారు నెయ్యిగా మార్చివేశాడు. భోజనాల అనంతరం మొక్కుబడి కలవారు స్వామివారికి 5 కడవల నెయ్యి సమర్పిస్తారు. అందులో బదులుగా తీసుకున్న ఒక కడివెడి నెయ్యిని నీటిగుండంలో కలపమని ఆదేశిస్తాడు. ఇప్పటికీ ఆ గుండాన్ని నెయ్యి గుండంగా పిలుస్తున్నారు. స్వామివారు నీటిలో దీపం వెలిగించినట్లు, మరణించినవారిని మహిమశక్తితో బతికించినట్లు పూర్వీకుల నుంచి చెప్పుకొనే కథలు బహుళ ప్రచారంలో ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రం లోని బీదర్ జిల్లాకు చెందిన భావిగి అనే గ్రామలో సుమారు 200 సంవత్సరాల క్రితం భద్రప్ప జన్మించినట్లు భక్తుల నమ్మకం. ఈయన వీరభద్రుని అవతారమని చెబుతారు. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగిలో కూడ ఉత్సవాలు జరుగుతాయి. తాండూరు నివాసి పటేల్ బసన్న బీదర్ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న భావిగి గ్రామములో జరిగే శ్రీ భద్రేశ్వరస్వామి మఠం ఉత్సవాలకు ఏటా ఎడ్లబండిపై వెళ్ళి దర్శించుకొని వచ్చేవాడు. ఒక సంవత్సరం స్వామిని కలిసి వెళ్ళిపోతున్నానని చెప్పి బండిపై తిరుగు వస్తుండగా ఆ భద్రేశ్వరస్వామి బండి వెంబడి రాసాగాడు.
ఇది గమనించిన బసప్ప స్వామివారిని బండి ఎక్కమని ప్రార్థించగా అందుకు నిరాకరించి అలాగే బండి వెంబడి నడక సాగించి చివరికి ప్రస్తుతం దేవాలయం ఉన్న స్థలంలో అదృశ్యమయ్యాడు. అదే రోజు రాత్రి బసన్నకు భద్రప్ప కలలో కన్పించి తన పాదుకలను భావిగి మఠం నుంచి తీసుకువచ్చి వీటిని తాండూరు లో ప్రతిష్టించి, ఆలయాన్ని ఏర్పాటు చేయాలని, జాతర జరిగేలా చూడమని అజ్ఞాపించినట్లు ఒక కథ చాలాకాలంగా ప్రచారంలో ఉంది. గర్భగుడి ప్రక్కనే శివపార్వతుల ఆలయాన్ని కూడా నిర్మించారు.
ఇలా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ఉత్సవ సమయంలో చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడ తరలివస్తుంటారు.
Home Unknown facts Veerabhadruni avathaaram ani cheppey Shri Bhavigi Bhadreshwaraswamy aalayam gurinchi thelusa?