ఈ ఆలయంలో విశేషం ఏంటంటే నవరాత్రి ఉత్సవాల సందర్భంలో అమ్మవారిని రోజుకొక రూపంలో అలంకరిస్తారు. భక్తుల కోరికలు నెరవేర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రము, మెదక్ జిల్లా, సంగారెడ్డికి 8 కీ.మీ. దూరంలో ఈశ్వరపురం అనే గ్రామంలో భవాని అమ్మవారి ఆలయం ఉంది. ఇది చాలా పురాతన ఆలయంగా భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది. భక్తుల కోర్కెలు నెరవేర్చే కల్పవల్లిగా ఈ తల్లిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మింపబడినట్లు తెలియుచున్నది. కొంతకాలం తరువాత బసవకల్యాణ పీఠం – కర్ణాటక పీఠాధిపతి అయినా స్వామిమదనానందసరస్వతి పునర్నిర్మించారు.
ఈ ఆలయం శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణామ్నాయా వారి ఆధీనంలో ఉంది. ఈ ఆలయంలోని భవాని మాత విగ్రహం 15 అడుగుల ఎత్తు కలిగిన, ఏకశిలా విగ్రహం. దేశంలోనే అతి పెద్ద అమ్మవారి విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా ఒకటి. నిత్యం భక్తులతో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణ లక్షదీపోత్సవం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో మూడు రోజుల పాటు దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు లక్షదీపోత్సవం నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ దీపాలను వెలిగిస్తారు. భాద్రపద అమావాస్యనాడు 50 కిలోల పసుపును విగ్రహానికి పూసి ప్రత్యేక పూజలు చేస్తారు. విజయదశమికి నవరాత్రి ఉత్సవాలను కూడా ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇంకా ఇక్కడ ప్రతిరోజు శ్రీ చక్రభిషేకం నిర్వహింపబడును. ఇక్కడి దేవాలయంలోని ఆవరణలో ఉండే చెట్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.
ఈ ఆలయానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక,మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.