7 Of The Oldest Forts Of Telangana & Their Complete History

మన దేశంలో ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు అనేవి ఉన్నవి.  పురాతన కాలం నాటి ఎన్నో అధ్బుతమైన కట్టడాలు కాలగర్భంలో కలసిపోయాయి. యుద్ధాలకు, యుద్దతంత్రాలకు, శిల్ప సౌదర్యానికి, ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు కొన్ని కోటలు వేదికలుగా నిలిచాయి. అయితే అప్పటి కట్టడాలు, వారి శిల్ప కళానైపుణ్యం ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పురాతన ఘన చరిత్ర కలిగిన కొన్ని కోటలు ఏంటి? వాటి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం

  1. రాయగిరి కోట:

oldest forts of telangana

తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, రాయగిరి గ్రామంలో రాయగిరి కోట ఉంది. రాయగిరి కోట సుమారు 28 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. కోట చుట్టూ రెండు వరుసల్లో 2 అడుగుల వెడల్పుతో 18 అడుగుల ఎత్తులో రాతి గోడలు నిర్మించిన ఆనవాళ్లు మనకు కనిపిస్తాయి. ఇక్కడ వందలాది ఆదిమానవుల సమాధులు బయటపడ్డాయి. వాటిలో బృహత్‌ శిలాయుగానికి చెందిన సమాధులెక్కువగా బయటపడ్డాయి. ఇక్కడ దొరికిన మట్టిపాత్రలు గోధుమ, ఎరుపు రంగులలో వున్నాయి. వీటి మీద ఈజిప్టు పాత్రల మీద వున్నట్టుగా క గుర్తులున్నాయి. అయితే ఒకప్పుడు జరిపిన పరిశోధనలో  సింధునాగరికతతో సరిపోలిన సంస్కృతి అక్కడి సమాధులలో బయటపడింది. ఇక్కడ రెండు వేల ఏండ్ల క్రితం నాటి ఇటుకలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. సైనికులు, మంత్రులు, ఇతర రాజ పరివారపు నివాస కట్టడాల తాలూకు ఆనవాళ్లు మనకు కోటలోపల అక్కడక్కడా కనిపిస్తాయి.

2. ఖమ్మం ఖిల్లా:

oldest forts of telangana

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం నగరంలోని సంబాద్రి కొండపైన ఈ కోట ఉన్నది. క్రీ.శ 957వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఖమ్మం ఖిల్లా ఇప్పటికి చెక్కు చెదరకుండా అందరిని ఆకట్టుకుంటుంది. ఖిల్లా వైశాల్యం 4 చదరపు మైళ్లు. దీని ప్రహరీ ఎత్తు 40 నుంచి 80 అడుగులు. వెడల్పు 15 నుంచి 20 అడుగులు. మొత్తం10 ద్వారాలు. పశ్చిమం వైపున దిగువ కోట ప్రధాన ద్వారం. తూర్పువైపు ద్వారాన్ని రాతి దర్వాజా అంటారు. దీన్నే పోతదర్వాజ అని కూడా పిలుస్తారు. కోట చుట్టూ 60 ఫిరంగులు మోహరించే వీలుంది. కోట లోపల జాఫర్‌దౌలా కాలంలో నిర్మించిన ఒక పాత మసీదు, మహల్ ఉన్నాయి. ప్రతి గోడ పైనా రెండు ఫిరంగులున్నాయి. ఒక నీటి కుండ కూడా ఉంది. సింహద్వారం సమీపంలో ఆరు అడుగుల ఫిరంగి ఉంది. ఫిరంగి గుండు తగిలినా చెక్కుచెదరని పటిష్ఠతతో నిర్మించారు ఈ రాతి కట్టడాన్ని.  అయితే వీటిని ఇటుకలు, సున్నంతో కట్టారు.  కొండపై కట్టిన ఈ ఖిల్లా విస్తీర్ణం మూడు చదరపు మైళ్లు. 15 బురుజులు శత్రుసైన్యం దాడులను తట్టుకునే విధంగా ఒకదానివెంట మరొకటి రెండు గోడలు నిర్మించారు. పెద్దపెద్ద రాళ్లను కోట నిర్మాణంలో నిలువుగా పేర్చి తాటికొయ్య ప్రమాణంలో నిర్మించారు. పక్కరాళ్లు అతకడానికి ఎలాంటి సున్నమూ వాడకపోవడం గమనార్హం. వాటి చుట్టూ లోతైన కందకం తీశారు. కాకతీయ పట్టణం ఓరుగల్లు నుంచి ఖమ్మం ఖిల్లా కోటకు సొరంగ మార్గం ఉందని, దాని ద్వారానే రాకపోకలు సాగేవని కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.  ఈవిధంగా కట్టిన ఈ అధ్బుత కట్టడం అప్పటి రాజుల నిర్మాణ చాతుర్యాన్ని తెలియచేస్తున్నాయి.

3. గద్వాల్ కోట:

oldest forts of telangana

మహబూబ్‌నగర్ జిల్లా గుండా ప్రవహిస్తున్న కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య విస్తరించి ఉన్న గొప్ప కోట, జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యత కలిగిన సంస్థానం ఇది. గద్వాల, సింగప్ప, సిద్ధావురం, అహోబిలం, బండి ఆత్మకూరు, సిరిసిల్ల ప్రాంతాలు సహా 100 గ్రామాలు గద్వాల సంస్థానంలో ఆనాడు వుండేవి. 1663వ సంవత్సరంలో పెద్దసామ భూపాలుడు ఈ విశాలమైన శత్రు దుర్భేద్యమైన కోటను కట్టించాడు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ కోట చుట్టూ ప్రహరి గోడ మట్టితో కట్టబడి వుంది. మట్టితో చేసిన నిర్మాణమే అయినా అత్యంత పటిష్ఠంగా నిర్మించినందువల్ల 400 సంవత్సరాలు అయినా ఈ కోట ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంతులేని సంపదను కాపాడుకోవడానికి ఈ గడిరాజులు జాగ్రత్తగా సంస్థానాన్ని పాలిస్తూ వచ్చారు.  అయితే ఒకసారి జరిగిన యుద్ధంలో సోమనాద్రి చనిపోవటంతో గద్వాల సంస్థానం నిజాం వశమైంది. 400 ఏళ్ళ చరిత్ర గత గద్వాల సంస్థానానికి ఎంతోమంది కళాకారులను పోషించిన చరిత్ర వుంది. సంస్థానం ఏర్పడిన తొలినాళ్ళ నుండే ఇక్కడ పండితులకు, బ్రాహ్మణులకు, కవులకు మంచి గౌరవ మర్యాదలతో కూడిన ఆదరణ వుండేది. నాటి రాజులు బ్రాహ్మణుల పట్ల భక్తిశ్రద్దలు ప్రదర్శించేవారు ఇక్కడి సంస్తానాదీశులు. అందుకే ఈ సంస్థానానికి విద్వత్‌ గద్వాల అనే పేరు కూడా వచ్చింది. ప్రతి యేటా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు గద్వాల జాతర అత్యంత వైభవంగా జరిగేది. వేలమంది పాల్గొనే ఈ జాతరలో కళాకారులను ఘనంగా సన్మానించేవారు.

4. ఎలగందుల కోట:

oldest forts of telangana

కరీంనగర్ జిల్లాలోని ఎలగందులకోటను కాకతీయుల కాలంలో ఎలిగందులగా పిలువబడింది. కరీంనగర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. కాకతీయుల అనంతరం నిజాం నవాబు అసఫ్ జా ఎల్గందల్ కోటను ఆక్రమించాడు. కరీంనగర్ కంటే ముందు ఎలగందుల జిల్లాగా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు. అసఫ్ జా ఆక్రమించిన తర్వాత కరీంనగర్ జిల్లాగా 1905లో పేరు మార్చారు. కాకతీయుల కాలంలో ఈ గ్రామాన్ని తెల్లకందుల, ఎలగందులగా పిలిచేవారని చింతామణి చెరువు దగ్గర ఉన్న శాసనంలో ఉంది. కాకతీయులు పాలనా కేంద్రంగా నిర్మించుకున్న కోట ఇది. ఎత్తయిన గోడలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులతో ఈ కోట నిర్మాణం అత్యంత దృఢంగా ఉండేది. ఆ తర్వాత అసఫ్ జా టర్కీ, ఫ్రెంచి ఇంజినీర్ల ప్రభావంతో మధ్యయుగపు ఐరోపా ఖండాల కట్టడాలను పోలి ఉంటుంది. శత్రువులు లోపలికి రాకుండా కోటగోడ చుట్టూ 15 మీటర్ల వెడల్పు, నాలుగు మీటర్ల లోతైన నీటి కందకాలు ఏర్పాటు చేసి అందులో మొసళ్లను వదిలేవారు. కాకతీయుల తర్వాత ముస్లిం రాజులు కోటను వశపరుచుకున్నారు.

5. దేవరకొండ కోట:

oldest forts of telangana

నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌కు వెళ్లే దారిలో మల్లేపల్లి సెంటర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో అక్కంపల్లి ప్రాజెక్టుకు చేరువలో దేవరకొండలో ఈ దుర్గం ఉంది. దీన్ని సురగిరి అంటే దేవతల కొండగా కూడా చెబుతారు. ఈ కోట విస్తీర్ణం దాదాపుగా పది కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఆనాటి రాజుల దర్పానికి, సాహసానికి ప్రతీకగా ఈ కోట కనిపిస్తుంది. బలానికి ప్రతీకగా సింహరూపాలను, ధర్మ రక్షణకు ప్రతీకగా ధర్మచక్రాన్ని దుర్గం ద్వారాలపై చెక్క బడి ఉంది. అయితే ఈ దుర్గపు సింహద్వారంపై చెక్కించబడిన పూర్ణ కలశం చిహ్నాన్ని ఆనాటి నుండి నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంగా తెలుగు వాచకాలపై ఈ చిహ్నాన్ని ముద్రించబడటం జరిగింది. అయితే ఈ కోట చుట్టూ 8 చోట్ల ఆంజనేయ స్వామి రూపాన్ని శిలల్లో చెక్కి అష్టదిగ్బంధనం చేశారని, అందుకే ఈ కొండని దేవరకొండ అని పిలుస్తున్నారని చెబుతారు. మొత్తం 7 గుట్టలని చుట్టి ఉన్న ఆ శిలా ప్రాకారంలో సుమారు 360 బురుజులు, తొమ్మిది మహా ద్వారాలు, పెద్ద బావులు, కోనేర్లు, కొలనులు, 13 ధాన్యాగారాలతో పాటు శిలా నిర్మితమైన సైనికావాసాలు, అధికారుల భవనాలు, రాజమందిరం, అంతఃపురం, సభా వేదికలు ఉన్నాయి అంతేకాకుండా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి.

6. ఖిలా వరంగల్:

oldest forts of telangana

వరంగల్ జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖిలా వరంగల్ అని పిలువబడే చారిత్రాత్మక ప్రదేశం ఉంది. ఓరుగల్లు కోటని 11 వ శతాబ్దంలో కాకతీయ రాజైన గణపతి దేవుడు నిర్మాణం మొదలుపెట్టగా అయన కుమార్తె అయినా రాణి రుద్రమదేవి కోట నిర్మాణాన్ని పూర్తీ చేసింది. 8 నుంచి 13వ శతాబ్దం వరకు వరంగల్ రాజధానిగా తెలంగాణను పరిపాలించిన కాకతీయులు ఈ గడ్డ చరిత్రకు వన్నె తెచ్చారు. 15 మంది కాకతీయ రాజులు పాలించిన వరంగల్ కోట ఏడుకోట గోడలతో శత్రు దుర్భేద్యమై వందల ఏళ్ల పాటు వైభవంగా కొనసాగింది. వరంగల్ చుట్టూ నిర్మితమై 8 కి.మీ. మట్టికోట, 5 కి.మీ. రాతికోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. కోటగోడ చుట్టూ 18 అడుగుల లోతైన కందకాలు శత్రువులను కోట లోపలికి రాకుండా ఆపేవి.  ఇక్కడ కాకతీయ తోరణాలు, ఏకశిలా గుట్ట, గుండు చెరువు వంటి దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. ఈ కోటికి మొత్తం మూడు ప్రాకారాలు ఉండగా, ఇక్కడి రాతి కోటకు ఏకశిలా నిర్మితమైన 30 అడుగుల ఎత్తు ఉండే రాతి ద్వారాలు ఉన్నాయి. ఇక్కడి కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి.  ఈ కీర్తి తోరణాలు తెలంగాణ రాష్ట్ర ఆధికారిక చిహ్నం . ఇంకా గణపతి దేవుడు ఇక్కడ ఒక శివాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయ గర్భగుడిలోని శివలింగం ఇతర ఆలయాలలోని శివలింగం కంటే భిన్నంగా ఉంటుంది. ఈ ఆలయం భూభాగం నుండి పుష్పాకారం, పైకప్పు నక్షత్ర ఆకారం పోలినట్లు రాతితో నిర్మించబడింది.

7. గోల్కొండ కోట – హైదరాబాద్:

oldest forts of telangana

హైదరాబాద్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ కోట ఉంది. ఈ కోట మొత్తాన్ని కూడా 120 మీటర్ల ఎత్తయిన నల్లరాతి కొండపైన నిర్మించారు. అప్పట్లో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతగానో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ద కోహినూరు వజ్రం కూడా ఇక్కడి నుండే వచ్చినదని చెబుతుంటారు. మొదటగా ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించారు. గోల్కొండ కోటని మొదట్లో గొల్ల కొండ అని పిలిచేవారు. అయితే పూర్వం ఒకసారి ఈ ప్రాంతంలో ఒక గొల్ల కాపరికి ఈ కొండపైన దేవత విగ్రహం కనబడింది. ఇదే విషయాన్ని అప్పటి కాకతీయ రోజులకి చెప్పగా వారు ఇక్కడ మట్టితో ఒక కట్టడాన్ని నిర్మించారు అదే కాలక్రమేణా ప్రస్తుతం గోల్కొండగా మారిందని చెబుతారు. శత్రువుల నుండి రక్షించుకోవడానికి గోల్కొండ చుట్టూ పెద్దబురుజును నిర్మించారు. ఇది 87 అర్దచంద్రకార బురుజులతో 10 కిలోమీటర్లు కొట చుట్టూ నిర్మించారు. ఇక కోటలోకి శత్రువులు ప్రవేశిస్తే పైవారికి సమాచారం చేరవేయుటకు శబ్ద శాస్రం ఆధారంగా ఈ కోటని అధ్భూతంగా నిర్మించారు. ఇంకా ఈ కోట నుండి చార్మినార్ వెళ్ళడానికి గుర్రం పట్టేంత స్వరంగ మార్గం కూడా ఉందని చెబుతుంటారు. మొదట కాకతీయుల పాలనలో ఉన్న ఈ ప్రాంతం ఆ తరువాత యుద్ధం లో సంధి కారణంగా మహమ్మదీయుల చేతిలోకి వెళ్ళింది. ఇక 15 వ శతాబ్దంలో కుతుబ్ షాహీ ఈ కోటను కట్టించారు. ఆ తరువాత కుతుబ్ షాహీ వంశస్తులను ఔరంగజేబు జయించి ఈకోటను కొంతభాగం వరకూ నాశనం చేశాడు.

ఈవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఈ కొన్ని కోటలు చారిత్రక ఘట్టాలకు, రాజరికపు వైభవానికి అద్దంపడుతూ  పెద్ద పెద్ద రాళ్లతో టర్కీ, ప్రెంచ్‌ ఆర్కిటెక్చర్‌తో శత్రుదుర్భేద్యంగా నిర్మించిన ఈ కోటలు అద్భుతమైన శిల్పా సంపదను, చాతుర్యాన్ని కలిగి ఉన్నాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR