Home Unknown facts 9 వేల సంవత్సరాల క్రితమే వెలసిన తొలి తిరుపతి ఎక్కడ ఉంది?

9 వేల సంవత్సరాల క్రితమే వెలసిన తొలి తిరుపతి ఎక్కడ ఉంది?

0

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. అయితే శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరస్వామి గా దర్శనమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు ప్రపంచ నలుమూలల నుండి వస్తుంటారు. తిరుపతి అనగానే మనందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమల క్షేత్రం గుర్తుకు వస్తుంది. కానీ 15 వందల సంవత్సరాల నాటి తిరుమల తిరుపతి కంటే ముందే దాదాపుగా 9 వేల సంవత్సరాల క్రితమే వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తొలి తిరుపతి ఉంది. మరి ఆ వేంకటేశ్వరస్వామి 9 వేల సంవత్సరాల క్రితమే వెలసిన తొలి తిరుపతి ఎక్కడ ఉంది? స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tholi Tirupathi Yekada

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం, తిరుపతి అనే గ్రామంలో శ్రీ శృంగార వల్లభస్వామి ఆలయం ఉంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెలసిన ఈ ఆలయం తొలి తిరుపతి గా పూజలందుకొంటుంది. ఈ ఆలయానికి 9 వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా స్థల పురాణం. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న గచ్చు మీద ఉన్న పువ్వు గుర్తు మీద నిలబడి స్వామివారిని చూస్తే మనం ఎత్తులో ఉంటె మనకు అంతే సమానమైన ఎత్తులోనే స్వామివారి విగ్రహం మనకి కనిపిస్తుంది.

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, ధ్రువుని తండ్రి ఉత్తాన మహారాజు. తల్లి సునీతి. ధ్రువుని తండ్రికి మరో భార్య కూడా ఉంది. అలా ద్రువునికి ఉత్తముడు అనే మారుటి తమ్ముడు ఉన్నాడు. ధ్రువునికప్పుడు అయిదేళ్ళ వయసు. తన తండ్రి ఉత్తాన పాదుడు నిండుకొలువులో కూర్చొని ఉన్నాడు. తమ్ముడు ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చొని ఉన్నాడు. తనకీ కూర్చోవాలని అనిపించింది. ఆ ఆశతోనే తండ్రి దగ్గరికి చేరి చేతులు చాచాడు. పెద్దవాడేకాని ఉత్తమునికీ ధ్రువునికీ వయసులో పెద్ద తేడా లేదు. అయితే అప్పుడు అయన సవతి తల్లి, నాకొడుకు కూర్చున్న చోట నువ్వు కూర్చో తగవు నా కడుపున మళ్ళీ పుడితే తప్పనీకు కూర్చొనే హక్కు లేదు పో అవతలికి అని ధ్రువుణ్ణి చెయ్యి పట్టుకు ఈడ్చి కసిరి కొట్టింది.

అప్పుడు ధ్రువుడు ఏడుస్తూ తల్లి దగ్గరకు వెళ్లి చెప్పుకొని కుమిలిపోయాడు. అప్పుడు అతని తల్లి బాధని దిగమింగి దేవుణి మీద మనసు పెట్టమంది. ధ్యానంతో మనశ్శాంతి వస్తుందని, కష్ట సుఖాలను సమదృష్టితో చూడడం వస్తుందనీ చెప్పింది ఆ తల్లి. అప్పుడు తండ్రి దగ్గర దొరకని స్థానాన్ని మించిన స్థానం సంపాదిస్తానన్నాడు ధ్రువుడు. దేవుని ధ్యానంలో ఉండడానికి తపస్సు చేసుకోవడానికి తల్లి అనుమతి కోరాడు. వయసుకు మించిన లక్ష్యం గనుక వద్దంది. అయినా ధృడ సంకల్పంతో ఎవరైనా సాధించవచ్చన్న తల్లి మాటను తల్లికి చెప్పి అనుమతి తీసుకొని అడవి మార్గం పట్టాడు.

అలా బయలుదేరిన ధృవుడు, ఈ కీకారణ్య ప్రదేశమునకు చేరుకున్నడు. ఇచ్చట శాండిల్య మహాముని ఆశ్రమం ఉన్నది. ఆ మునీశ్వరుని దర్శనం చేసుకున్న ధృవుని చూచి, అతని మనసులోని కోరిక తెలిసినవాడై, ముని అతన్ని పిలిచి నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్య మంగళ రూపం తలుచుకొంటూ తపస్సు చెయ్యి. స్వామి ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాడు అని చెప్పినారు. మునీశ్వరులు చెప్పినట్లుగా తపమాచరించుట మొదలుపెట్టినాడు. అలా కొంతకాలం గడిచిన తర్వాత, ధృవుని తపస్సుకి మెచ్చిన వాడై విష్ణుమూర్తి దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న విష్ణుమూర్తిని చూచి ధృవుడు భయపడ్డాడు. అంతట విష్ణువు బాలక భయమెందుకు తత్తరపాటు చెందకు నేను నీ అంతే కదా ఉన్నాను అని నవ్వుతూ పలుకటయే కాకుండా చెక్కిళ్ళు ఒత్తి భయము లేకుండా చేసి వరాన్ని ప్రసాదించి స్వామి అక్కడే శిలారూపంలో వెలిశాడని స్థల పురాణం. ఇలా విష్ణుమూర్తి వరం ప్రభావంతో ధ్రువుడు మరణానంతరం ధ్రువనక్షత్రంగా మారాడు. ఆకాశంలో ఇప్పటికీ ధ్రువనక్షత్రం మనకి కనిపిస్తుంది.

ఇక ఇక్కడ వెలసిన ఆ దివ్యమంగళ సుందరమూర్తియే శ్రీ శృంగార వల్లభస్వామిగా పేరుగాంచాడు. అయితే నీ అంతే ఉన్నాను కదా అన్ని చెప్పిన కారణంగా చూసే భక్తులు ఎంత ఎత్తు ఉంటే అంతే ఉన్నట్లుగా దర్శనమిస్తాడు స్వామి. ఇంకా చెక్కిళ్ళు ఒత్తిన కారణంగా కుడి ఎడమలకు ఉండవలసిన శంఖు చక్రములు ఎడమ, కుడిలకు ఉంటాయి. స్వామి వారు వెలిసిన కొంతకాలానికి స్వయంగా దేవతలు వచ్చి స్వామి వారికి ఆలయ నిర్మాణం చేసినారు. ఆ తరువాత లక్ష్మీదేవిని నారదుడు ప్రతిష్టించగా, ఈ యుగమున శ్రీ కృష్ణదేవరాయలు వారు భూదేవి అమ్మవారి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు శిలాశాసనములు ద్వారా తెలియచున్నది. భోజమహారాజు, భట్టివిక్రమార్కులు, రుద్రమదేవి, పెద్దాపురం సంస్థాన మహారాణులు ఈ స్వామిని దర్శించుకొన్నవారిలో కొందరు.

ఇంకా విక్టోరియా మహారాణి స్వామిని దర్శించి వెండి కవచము చేయించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో నిత్య దీపధూప నైవేద్యాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం దివ్యంగా జరుగుతుంది.

ఈవిధంగా విష్ణుమూర్తి శిలారూపములో ఇక్కడే మొదటిసారిగా వెలసినందున ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు.

Exit mobile version