ఒంటరిగా ఉండాలంటే భయపడుతున్నారా? కానీ అదే మంచిదట!

చిన్ననాటి నుండి మనం ఎప్పుడయినా ఖాళీగా కూర్చుంటే, అమ్మో, నాన్నో అలా ఖాళీగా కూర్చోకపోతే చదువుకోవచ్చు కదా అని తిట్టడం వినే ఉంటాం. ఇక చదువయ్యాక ఖాళీగా ఉంటే, అలా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కానీ అని అనడం దాదాపు ప్రతీ ఒక్కరి జీవితంలో జరిగే ఉంటుంది. ఖాళీగా కూర్చొని సమయాన్ని వృథా చేయకూడదనేది వాళ్ళ ఉద్దేశం. అదీకాక ఖాళీగా ఉంటే మనసును పాడుచేసే ఆలోచనలు వస్తాయని అలా చెబుతుంటారు. అయితే కానీ ఖాళీగా కూర్చోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
  • ఖాళీగా కూర్చోవడం అంటే ఎలాంటి ఉద్యోగం లేకుండా ఇంట్లో వంటపని, ఇంటిపని చూసుకుంటూ కాలక్షేపం చేయడం కాదు. ఎలాంటి పనులు లేకుండా సెల్ ఫోన్ కూడా చేత పట్టుకోకుండా ఖాళీగా కూర్చోవడం వల్ల మాత్రమే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అర్థం కాలేదా…? ఖాళీగా కూర్చోవడం అంటే ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా సైట్లలో మునిగిపోవడమో, టీవీ చూస్తూ పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా లీనమైపోవడమో కాదు. అసలు ఏ పని చేయకుండా, నిశ్శబ్దంలో మనం ఒంటరిగా ఉండడం.
  • ఎప్పుడైనా మీరు బాధలో ఉన్నప్పుడో లేదా దేని గురించైనా దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు ఒంటరిగా, ఖాళీగా కుర్చున్నారా? నిజానికి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఒంటరిగా ఉండి ఆలోచించాలి అంటే ఎంతో ధైర్యం కావాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎక్కువ ఆలోచనలు చేయకుండా ఫోన్ చూడటం లేదా ఫోన్ లో కాలక్షేపం చేస్తూ మనం ఒంటరిగా ఉన్నామనే భావనను పోగొట్టుకుంటాము. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా ఒక విషయం గురించి స్వతంత్రంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతారట.
  • ఒంటరిగా ఉండటం వల్ల మనలో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటి గురించి చక్కటి పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తాము. దీని ద్వారా మనపై మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే పనిపై ఎంతో ఏకాగ్రతను చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎవరు లేకుండా ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు మన ఆలోచనలు, భావోద్వేగాల పై దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితమైన ఆలోచనలను చేయగలుగుతాము. మనలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీయడానికి ఈ సమయం ఎంత ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
  • అలాగే ఎటువంటి పని లేకుండా ఖాళీగా ఉన్న సమయంలో గతంలో జరిగినటువంటి కొన్ని సంతోషకరమైన విషయాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడపవచ్చు. అయితే ఇన్ని ఆలోచనలు చేయాలంటే ఖాళీగా ఉండి మన మనసుకు ఎంతో ప్రశాంతత కలిగినప్పుడు మాత్రమే మనలో ఆనందం, మనోధైర్యం, ఏకాగ్రత, సృజనాత్మకత వంటి లక్షణాలు పెంపొందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా ఉండే టైం దొరకడమే అదృష్టం ఈ రోజుల్లో.
  • అయితే ఇక్కడ ఒంటరిగా ఉండడానికి ఒంటరితనంగా భావించడానికి చాలా తేడా ఉంది. కష్టంగా అనిపిస్తే ఒంటరితనం, ఇష్టంగా అనిపిస్తే ఏకాంతం. ఒంటరిగా ఉండడం అనేది మనిషి శారీరక ఏకాంతం. నిజానికి ఒంటరిగా ఉన్నప్పుడే మనల్ని మనం తెలుసుకోగలం. మనసారా ఆనందించగలిగే విలువైన సమయమది. మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఆ టైంని ‘ఏకాంతం’ అంటారు. ​ఒంటరిగా అనిపించడమనేది పూర్తిగా మనసుకి, మన ఆలోచనలకు సంబంధించింది. ఒక్కోసారి అందరూ చుట్టూ ఉన్నా ఒంటరితనం అనుభవిస్తుంటారు కొంతమంది.
  • ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కొందరు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్​తో, రిలెటివ్స్​తో ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్లు లైఫ్​ని​ ఎంజాయ్​ చేస్తుంటే… ఒంటరివాళ్లకి అది చూసి బాధ కలుగుతుంది. నేను ఒంటరిని. నాకెవరూ లేరు. నా జీవితంలో సంతోషం లేదు అనుకుంటూ డిప్రెషన్​లోకి వెళ్లిపోతుంటారు. భాధలో, డిప్రెషన్ లో ఉన్నవాళ్లు ఇలా ఒంటరిగా గడిపితే ఆ భాధ మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్నంత మాత్రాన డిప్రెషన్​ బారిన పడాల్సిన అవసరం లేనే లేదు. ఒంటరిగానే ఈ లైఫ్​ని హ్యాపీగా గడపొచ్చు అంటున్నారు నిపుణులు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR