ఐనవోలు మల్లన స్వామి ఆలయం విశేషాలు

తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ పురాతన శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న క్షేత్రం ఐనవోలు మల్లన్న ఆలయం. ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి రూపం ఎంతో అపురూపం. కాకతీయుల శిల్పకళాచాతుర్యం నుంచి స్వామికి జరిగే ఉత్సవాలవరకూ ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకమే. ప్రకృతి రమణీయత, అద్భుత శిల్పసంపదతో సువిశాల ప్రాంగణంలో వందల ఏళ్ల క్రితం ఈ ఆలయం నిర్మితమైంది.

Ainavolu Mallana Swamy Temple Highlightsవరంగల్‌ నగరానికి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామి మల్లన్న, మల్లికార్జునస్వామి, ఖండేల్‌ రాయుడు అనే నామాలతోపూజలందుకుంటున్నాడు. సంక్రాంతి పర్వదినం నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాల్లో మల్లన్న జాతర జరుగుతుంది. ‘బోనం’ అనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నైవేద్యం పెడతారు. తరువాత కురుమ పూజారులు, ఢమరుకాన్ని వాయిస్తూ, నేలపై రంగురంగుల ముగ్గులనువేసి, జానపద బాణీలో స్వామి కథను చెబుతారు. ఇలా రంగులతో ముగ్గులు వేయడాన్ని పట్నం వేయడం అని అంటారు. దీన్నే స్వామివారి కళ్యాణం అని కూడా పిలుస్తారు.

Ainavolu Mallana Swamy Temple Highlightsఅంతే కాకుండా ఈ ఆలయంలో ప్రతీ మాసశివరాత్రి రోజున నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం కార్యక్రమాలను ఒగ్గు పూజారీలు నిర్వహిస్తారు. దాంతో పాటుగానే ఈ ఆలయంలో ప్రతియేటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఐదు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అశ్వవాహనం, నందివాహనం, పర్వతవాహనం, రావణవాహనాలను అధిరోహించి చివరిరోజున రథంపైన భక్తులకు దర్శనమిస్తాడు.

Ainavolu Mallana Swamy Temple Highlightsఈ సందర్భంగానే ఉత్సవాల్లో చివరి రోజున సాయంకాలంలో అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ అగ్ని గుండంలో నడిస్తే పాపాలు తొలిగిపోతాయని భక్తుల ప్రగాఢనమ్మకం. తరువాత వసంతోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించి, శ్రీ పుష్పయాగం కార్యక్రమంతో ఉత్సవాలను ముగిస్తారు. ప్రతీ మాసశివరాత్రి రోజున మహాన్యాసపూర్వకరుద్రాభిశేకం, శాంతికల్యాణం, రుద్రహోమం నిర్వహిస్తారు.

Ainavolu Mallana Swamy Temple Highlightsఓరుగల్లులోని ఐనవోలు గ్రామంలో ఉన్న ఈ క్షేత్రాన్ని కాకతీయుల కాలంలో నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఓరుగల్లు రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయులు ఐనవోలు గ్రామంలో శిలలతో అబ్బురపరిచేలా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని నిర్మించారు. అప్పట్లో ఆయుధాలు భద్రపరిచేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారనే కథనం కూడా ప్రచారంలో ఉంది. పశ్చిమ చాళుక్య చక్రవర్తి, త్రిభువన మల్ల బిరుదాంకితుడైన ఆరవ విక్రమాదిత్యుని మంత్రి అయిన అయ్యనదేవుడు ఈ ఆలయాన్ని కట్టించాడని అంటారు. అందుకే ఆయన పేరిట అయ్యన-ప్రోలుగా పిలువబడి కాలాంతరంలో అయినవోలు, ఐనవోలుగా పిలువబడుతుంది. సువిశాల రాతి ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మించబడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో కనువిందు చేస్తుంది. ఇది చాళుక్యుల నిర్మాణం అనడానికి గుర్తుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉంది.

Ainavolu Mallana Swamy Temple Highlightsఇటువంటి నిర్మాణం, చాళుక్య కాలానికే చెందిన వరంగల్లు భద్రకాళి దేవాలయంలో కూడా కనిపిస్తుంది. ఈ ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తితోరణాలు ఉన్నాయి. తన తండ్రిని చంపిన దోష పరిహారార్థమై కాకతీయ రుద్రదేవుడు వీటిని నిర్మింపజేశాడు. ముందుభాగంలో సువిశాలమైన రంగ మండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు ప్రాత:కాల నృత్యం చేసేవారు. ఆలయంలో మల్లన్న (మల్లికార్జున స్వామి) యొక్క భీకరమైన విగ్రహం నాలుగు చేతులలో, ఖడ్గం, ఢమరుకం, పాన పాత్ర ధరించి కనిపిస్తుంది. ఆయనకు ఇరుప్రక్కలా భార్యలు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మల విగ్రహాలుంటాయి. వీటి ముందు భాగంలో అర్థ పానవట్టం పై శ్వేత శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారు దేవుడు, ఖండేల రాయుడు అని కూడా పిలుస్తారు. ప్రతీ ఏటా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,630,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR