ప్రకృతి లో ఎన్నో మొక్కలు.. వాటి వలన ఎన్నో ప్రయోజనాలు.. ఏ మొక్క ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకొని దానిని ఉపయోగిస్తే వాటి ప్రయోజనాలు పొందడం సులువే.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన వాటిలో అక్కల కర్ర ఒకటి. ఈ అక్కల కర్ర అనే మూలిక కొంచెం ఖరీదైనదే గాని మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది. ఇది ఉప్పగా, పుల్లగా, వగరు రుచులతో కలిగి ఉంటుంది. దీన్ని బాగా మెత్తగా దంచి, 1/4 చెంచా పొడివరకు రెండుపూటలా తేనెతో కలిపి తినిపిస్తే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.
అక్కలకర్ర వేరురసము గాని, చూర్ణముగాని మిరియాలతో కలిపి తేనెతో వాడితే మూర్చలు తగ్గును. లేదా అక్కలకర్ర, తెల్లమద్ది చూర్ణల మిశ్రమాన్ని అరస్పూన్ తేనెతో రోజు రెండుసార్లు తీసుకోవాలి. అక్కలకర్ర చూర్ణమును తేనెతో కలిపి నాకిస్తే మాటలు సరిగా వస్తాయి. అక్కలకర్ర కషాయము ఒకస్పూన్ తాగితే పడిశము, గొంతు నొప్పి, నాలుకజిగురు తగ్గును. అక్కలకర్ర చూర్ణమును పంటిలో పెడితే పంటి బాధ తగ్గుతుంది.
అక్కలకర్ర చూర్ణము, చందనము సమభాగాలుగా తీసుకోని నెయ్యి, పంచదారతో కలిపి ఇస్తే ఋతుదోషాలు తగ్గుతాయి. అక్కలకర్రను గంధముతీసి పైన లేపముచేసి పూస్తే వాపులు తగ్గుతాయి. పగలని గడ్డలకు పట్టువేస్తే గడ్డలు పగులుతాయి. అక్కలకర్ర, తక్కోలము, శొంటి, పిప్పళ్ళు, జాజికాయ, కుంకుమపువ్వు, మంచిగంధము, చూర్ణించిన దాన్ని తేనెతో కలిపి గురివింద మోతాదులో వీర్యస్తంభనమవుతుంది. రోజు అక్కల కర్ర వేరు ముక్కను కొద్దిగా గంధం తీసి నాలుక పైన కొద్దిగా రాస్తుంటే నత్తి తగ్గుతుంది. అయితే ఎక్కువ రాస్తే పుండు పడుతుంది జాగ్రత్త.
ఇక ప్రకృతిలోని మరో అద్భుతమైన మూలిక గాడిదగడిపాకు. ఇది క్రిమినాశనానికి, చర్మరోగాలకి చాలా భాగా పనిచేస్తుంది. తామర, గజ్జి, చిడుము, గడ్డలు, పొక్కులు, క్రిమిరొగము వున్నప్పుడు ఈ ఆకును కొద్దిగా నీరు వేసి నూరి చర్మసమస్యలపైన వాడితే సమస్యలు తీరుతాయి. కడుపులో పిల్లలకి పురుగులు వున్నప్పుడు ఈ ఆకులు 50గ్రాలు పాతబెల్లము 25గ్రాలు రెండూ నూరి బటాని గింజల పరిమాణం చేసి ఉదయం ఒకటి రాత్రి ఒకటి నీటితో ఇస్తే క్రిములు, కడుపులోని నులిపురుగులు చనిపొతాయి.
సోరియాసిస్ వున్నవారు ఈ ఆకుల రసం పైకి లేపనం వాడి రోజు 5 ఆకులు రెండు పూటల తెల్లవారి మరియు రాత్రి తీసుకొంటే చాలా వరకూ తగ్గుతుంది. గాయాలలొ వ్రణాలు కుళ్ళు వ్రణాల సమయంలో ఆకురసం కొద్దిగా తీసి ఆ వ్రణాలపైన వేస్తే పుండ్లు గాయాలు తగ్గుతాయి. పుండ్లలో వుండే పురుగులు చనిపోతాయి.