తెలంగాణ ఊటీ గా పేరుగాంచిన అనంతగిరి విశేషాలు

హైదరాబాద్ నగరంలో తెల్లవారితే ఉరుకులు పరుగులు. గంటల కొద్దీ ట్రాఫిక్‌ తిప్పలు.. ఆఫీసులో సమస్యలు.. ఇంట్లో ఇబ్బందులు.. మానసిక బాధలు.. ఇవన్నీ వదిలి ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్లాలనే కోరిక. అంతలోనే ఖర్చులకు భయపడి విరమణ. అయినా ఏదో పోగొట్టుకుంటున్నామనే వేదన. కాస్త సేదతీరి మనసుని ఆహ్లాదపరుచుకోవాలనే ఆలోచన. ఇది సగటు మనిషి తపన.. వాస్తవమే… ప్రజలకు విశ్రాంతి కావాలంటే ఏదైనా టూర్‌కు వెళ్లాలి మరి. అది ఎక్కడో దూరాన ఉన్న ఊటి, కోడైకెనాల్‌, వైజాగ్‌, అరకు వెళ్తేనే దొరుకుతుందనేది పాత మాట.

Ananthagiriఇప్పుడు సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో మనల్ని కనువిందు చేసే ప్రాంతం తెలంగాణ లో హైదరాబాద్‌కు అతి దగ్గర్లోనే ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. కాస్త ఆధ్యాత్మికం ఇంకాస్త ఆహ్లాదం ఈ రెండింటి కలయికే అనంతగిరి. వికారాబాద్‌ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. 3,763 ఎకరాల 15 గుంటల విస్తీర్ణంలో విస్తరించిన ఈ అడవి అందాలతో అబ్బుర పరుస్తోంది.

Ananthagiriఅక్కడి చెట్ల కొమ్మల గలగలలు, పక్షుల కిలకిల రావాలు, రయిమనిపించే రహదారులు, దూరం నుంచే హత్తుకునే కొండలు, కళ్ళకు కనువిందు కనిపించే సేలయేటిధారలు, రమ్మని పిలిచేలా రాతి కట్టడాలు,సేద తీర్చుకొమ్మనే గుహలు ప్రకృతి ప్రేమికుల మనసును నిలువునా దోచేస్తున్నాయి. సరిగ్గా సాయంత్రం స్కూల్ బెల్ కొట్టినట్టు 4 మరియు 5 గంటల సమయమప్పుడు సూర్యాస్తమయ సమయం కావడం వల్ల సూర్యుని బంగారపు కిరణాలు పచ్చని ప్రకృతి తో కలిసి అద్భుతమైన దృశ్యంగా పర్యాటకులకి కనువిందు కలిగిస్తుంది. అలాగే ఇక్కడ ఉదయాన్నే సూర్యోదయం చూడటం ఒక మరుపురాని జ్ఞాపకం.

Ananthagiriదట్టమైన అనంతగిరి హిల్స్ లోని మరొక ప్రధాన ఆకర్షణ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మనం వినే ఉంటాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మన అనంతగిరినే చెప్పుకోవచ్చు. ఈ క్షేత్రానికి పురాణ ప్రసిద్ధి కూడా ఉంది. విష్ణు పురాణంలో ఈ క్షేత్రం ప్రస్తావన ఉంది. అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం దాదాపు 400 ఏళ్ళ క్రితానికి చెందినది. మహారుషి ముచికుందునికి శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభుని రూపంలో దర్శన మిచ్చిన ప్రదేశమిది. పద్మనాభుడు లింగాకృతిలో ఉన్న దేవాలయం జగత్తులో ఇదొక్కటేనని పండితులు చెబుతుంటారు. ఆలయ సమీపం లో ప్రాచీనమైన గుండాలు ఉంటాయి. కొన్ని చోట్ల గుహలు కనిపిస్తాయి. ఇందులో మహర్షులు తపస్సు చేసుకునేవారని చెబుతారు. మూసీ నది ఈ దేవాలయానికి సమీపంలోనే పుట్టింది. చాలా మంది మొదటగా ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత ట్రెక్కింగ్ కి బయలుదేరతారు.

Ananthagiriసహజసిద్ధంగా ఏర్పడిన రాతి గుహల్లో స్వామి రూపం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి కిలోమీటరున్నర దూరంలో బుగ్గరామ లింగేశ్వర ఆలయం ఉంది. అక్కడ అందమైన జలపాతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా వర్షాకాలంలో సందర్శకులు వస్తుంటారు. చాలా మంది మొదటగా ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత ట్రెక్కింగ్ కి బయలుదేరతారు. ఇంకో విషయేమంటే తాండూరు వాసులు ఈ అడవిని దాటుకుంటూ వారి గ్రామాలకు వెళ్తుంటారు. అడవిని అభివృద్ధి చేసేందుకు ఈ ప్రాంతంలోనే 10 ఎకరాల్లో రీ ప్లాంటేషన్‌ కింద యూకలిప్టస్‌ చెట్లను ప్రభుత్వం పెంచుతోంది. అనంతగిరి కొండల పైన వ్యూ పాయింట్‌ ఒకటి ఉంది. అక్కడినుంచి చూస్తే దగ్గర గ్రామాలతో పాటు చుట్టూ ప్రాంతం ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం సుమారు 100 రకాల పక్షులు ఉన్నాయి.

Ananthagiriఅనంతగిరిలో ఏడాదిలో రెండు పర్యాయాలు జాతర జరుగుతుంది. కార్తీక మాసంలో 11 రోజుల పాటు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు. ఆషాఢమాసంలో 5 రోజుల పాటు జరుగు తుంది. ఈ జాతరకు రాష్ర్టంలోని అన్ని జిల్లాల నుంచేకాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. వారాంతాలలో సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులతో వచ్చి అందమైన నేచర్‌లో ఆనందగా గడపడానికి అనువైన ప్రాంతమిది. అనంతగిరి హిల్స్ కి చేరే రోడ్డు మార్గం చక్కగా ఉండడం వల్ల 100 కిలోమీటర్ల ప్రయాణంలో అలసట అస్సలు తెలియదు. కేవలం రెండు గంటల సమయం లో నే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. అదే సొంత వాహనం ద్వారా లేదా ప్రైవేటు ట్రావెలర్స్ వాహనాల్లో చేరుకోవడం మరింత సౌకర్యం. పబ్లిక్ రవాణా సౌకర్యం అంతగా అందుబాటులో లేకపోవడం ఒక కారణం. ఆహారాన్ని ఇంటి నుండి తీసుకువెళ్ళడం మంచిది. ట్రెక్కింగ్ సమయం లో కూడా తినే అవకాశం ఉంటుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR