Home Unknown facts బ్రిటిష్ పరిపాలనలో వెలసిన అద్భుత ఆలయం గురించి తెలుసా?

బ్రిటిష్ పరిపాలనలో వెలసిన అద్భుత ఆలయం గురించి తెలుసా?

0

హిందువుల ఆరాధ్య దైవం గణపతి. దేవతలందరికి అధిపతి గణపతి అని చెబుతుంటారు. శివపార్వతుల పెద్ద కొడుకు గణపతి. ఈ స్వామిని వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు అంటూ ఎన్నో రకాలుగా భక్తులు పిలుస్తుంటారు. అయితే ఇక్కడ వెలసిన వినాయకుడు బ్రిటిష్ వారి పరిపాలన కాలంలో వెలిశాడని స్థల పురాణం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ganapathi aalayamతెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో శ్రీ గణపతి దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారంపైన రాజగోపురం, గోపుర శిఖరాన ఐదు కలశాలు, మధ్యన వినాయక విగ్రహం, క్రింది భాగాన ద్వారపాలకులు, ఓంకారం దర్శనమిస్తాయి. ఈ ఆలయానికి విశాలమైన ముఖ మంటపం ఉంటుంది. ఒకే ముఖమండపంతో ఈ ఆలయం వేర్వేరు గర్భాలయాలుగా ఉంది.

ప్రధానాలయంలో వెలసిన చతుర్భుజ గణేశుడు పాశాంకుశామోదకాలను ధరించి, కిరీటం, వివిధ ఆభరణాలతో భక్తులకి దర్శనమిస్తాడు. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మరికొన్ని దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ లింగరూపంలో దర్శనం ఇచ్చే శివుడికి నిత్యాభిషేకాలతో పాటు పంచామృతాభిషేకాలు జరుగుతాయి. ఇంకా ఇక్కడ వెలసిన పార్వతిదేవికి దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు వివిధ అలంకరణలు, పూజలు జరుగుతాయి.


ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, 1824 వ సంవత్సరంలో బ్రిటీష్ సైనిక సిపాయిలు నీటికోసం దిగుడు బావిని త్రవ్వుతుండగా, గణపతి విగ్రహం కనబడింది. అప్పుడు ఆనాటి భక్తులు ఆలయ నిర్మాణానికి పూనుకోగా బ్రిటీష్ అధికారులు అందుకు అభ్యంతరం తెలుపగా, అధికారులకు స్వప్నంలో స్వామివారు దర్శనమిచ్చి ఆలయ నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం తెలుప వద్దని ఆదేశించాడని, అప్పుడు ఆలయ నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్ట ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తయ్యాయి.

ఇలా ఇక్కడ వెలసిన గణపతి అత్యంత మహిమాన్వితులు, వేదాలలో చెప్పినవిధంగా ప్రతి రోజు స్వామివారిని పంచామృతాలతో అభిషేకిస్తారు. ఈ ఆలయంలో నిత్యం సత్య గణపతి వ్రతం జరుగును. ఇక్కడ భక్తులు వారి కోర్కెలు అనుసరించి కొబ్బరి కాయ మొక్కుబడిగా కట్టి 41 రోజులు పూజాదికములు నిర్వహించి వారి వారి కోర్కెలు నెరవేర్చుకుంటారు.

ఇక ప్రతి సంవత్సరం వినాయకచవితి రోజున మహాన్యాస పూర్వకంగా స్వామివారి పూజ జరుగుతుంది. ఆ తరువాత గణపతి నవరాత్రి ఉత్సవాలను అతివైభవంగా నిర్వహిస్తారు.

Exit mobile version