Annavaramlo Velisina Shri Veeravenkata Satyanarayana Swamy

0
3195

శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి కొలువై ఉన్న ఈ స్వామిని సత్యదేవుడు అని కూడా అంటారు. ఇక్కడ ఒకేసారి వందలాది మంది దంపతులు కూర్చొని శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని చేసుకోవడం ఒక ప్రత్యేకత. ఈ ఆలయంలో సత్యనారయణస్వామికి కుడి పక్కన ఈశ్వరుడు, ఎడమపక్కన అనంతలక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. ఇలా ఒకే పీఠం పై ముగ్గురు మూర్తులు కొలువుండే దేవాలయం మరెక్కడా లేదు. మరి ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. Satyanarayana Swamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలానికి చెందిన అన్నవరం గ్రామంలో పంపానది తీరమున గల రత్నగిరి కొండపైన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారి దివ్యక్షేత్రం కలదు. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారిని సత్యదేవుడు అని కూడా అంటారు. Satyanarayana Swamyఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, శ్రీ మహావిష్ణువు రామావతారంలో రత్నాకరుడు అనే భక్తుని తపస్సుకి మెచ్చి వరం కోరుకోమనగా, దేవా నిన్ను నా శిరముపై మోసే భాగ్యాన్ని ప్రసాదించు అని అడిగాడట. అయితే కలియుగంలో భక్త సంరక్షణార్థం త్రిమూర్తుల ఏకస్వరూపంగా సత్యరజోతమోరూప త్రిగుణాత్మకుడైన వీరవెంకట సత్యనారాయణ అను పేరుతో అర్చామూర్తిగా ఆవిర్బావించిన సుముహూర్తమున నీవు రత్నగిరి రూపంలో నీ శిరస్సున నన్ను వహిస్తావు అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రత్నాకరునికి వరమిచ్చాడు. ఆ ప్రకారమే రత్నగిరి తన శిరస్సుపైన సత్యదేవుని మోస్తున్న పరమపావన దివ్యక్షేత్రం కలియుగ వైకుంఠంగా భక్తుల కోరికలు నిరంతరం తీరుస్తుంది. Satyanarayana Swamy
శ్రీ సత్యనారాయణస్వామి విగ్రహం అంకుడు చెట్టు కింద పొదలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలసి ఉన్న త్రిమూర్తి స్వరూపం ఉన్న విగ్రహం ఖరనామ సంవత్సరం శ్రావణ శుద్ధ విదియ క్రీ.శ. 1891 సంవత్సరంలో ఆగస్టు నెల 6 తేదీన దొరికింది. ఈ విగ్రహం ఈరంకి ప్రకాశం అనే బ్రాహ్మణునికి కనిపించింది. ఈ ఆలయంలో స్వామివారిని ప్రతిష్టించిన పీఠంలో విఘ్నేశ్వర, భాస్కర, కాత్యాయనీ, శివ, విష్ణు అనే పంచాయతన పూర్వకంగా మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని కాశి నుండి తెప్పించి దానిపైన విగ్రహాలను ప్రతిష్టించారు. Satyanarayana Swamyఈ ఆలయంలో స్వామివారి విగ్రహమూర్తి రెండు నిలువుల ఎత్తు ఉంటుంది. అందువల్ల గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఈ స్వామి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ముగ్గురి రూపాలను తనయందు నింపుకొని ఉత్భవించి, శ్రీ వీరవెంకట సత్యనారాయణుడిగా పూజింపబడుతున్నాడు. ఇక్కడ అమ్మవారు అనంతలక్ష్మి సత్యవతి దేవి. ఈశాన్యమున ఈశ్వరుడు మధ్యభాగమున యంత్ర వేదికపై మధ్య లింగాకృతిలో బిందు స్థానంలో పవిత్ర పంచాయతనంగా స్వామిని ప్రతిష్టించి తీరు అపూర్వంగా ఉంది. రెండతస్తులుగా ఉండే స్వామివారి ప్రధాన ఆలయం క్రింది భాగంలో యంత్రాలయం, పై భాగంలో స్వామివారి దివ్య మంగళ రూపం దర్శనమిస్తాయి. ఈ రెండిటికి మధ్య పానివట్టము వంటి నిర్మాణం, అందు పీఠములు బీజాక్షర సంపుటి యంత్రం ఉంది. Satyanarayana Swamyఈ వాస్తు నిర్మాణంలోని క్రింది భాగంలో వృత్తాకారమైన శిలాయంత్రం బ్రహ్మ స్వరూపమని, నడుమనున్న లింగాకార స్థంభం శివస్వరూపమని, ఊర్ద్వమందలి విగ్రహం నారాయణ స్వరూపమని పండితుల అభిప్రాయం. ఈ ఆలయ మండపానికి ఎదురుగా ఒక ఎండా గడియారం ఉంది. ఇది అధ్భూతమైన యంత్ర నిర్మాణం. ఈ గడియారం సూర్యకాంతితో పనిచేస్తుంది. దీనిని ఫలభా యంత్రం అని కూడా అంటారు. దీనిమీద గడియారంలో ఉన్నట్లు గంటలు, నిముషాలు తెలిపే గీతలు ఉన్నాయి. సూర్యుని కిరణాలూ ఈ గీతల మీద పడినప్పుడు సూర్యకిరణం పడిన కోణాన్ని బట్టి అప్పుడు సమయం ఎంత అయిందనేది తెలుస్తుంది. Satyanarayana Swamyఇలా వెలసిన ఈ స్వామివారి ఆలయంలో ప్రతిరోజు సామూహిక దంపతులు శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతాలు, కల్యాణ , మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి ప్రతినిత్యం వేలసంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి, పూజించి తరిస్తారు.Satyanarayana Swamy

SHARE