ఒకప్పుడంటే చాలా మంది బావుల్లో, చెరువుల్లో, నదుల్లో నీటిని తాగేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. అందుకని చాలా మంది ప్రస్తుతం మినరల్ వాటర్‌ను తాగేందుకే ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలకు అతి సమీపంలో కొందరు మినరల్ వాటర్ ప్లాంట్లను పెట్టి వ్యాపారం చేస్తున్నారు.
కొందరు ప్యాకెట్లు, సీసాలు, క్యాన్ల రూపంలో నీటిని విక్రయిస్తున్నారు. లీటరు నీరు అరలీటరు పాలధరతో సమానంగా అమ్మడవుతోంది. మినరల్ వాటర్‌లో నాణ్యత ఉంటుందని ప్రజలు అదనంగా డబ్బులు వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం మినరల్ వాటర్ మోజులో ప్రజలు చిక్కుకుని అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. బడా కంపెనీలు సైతం మంచినీటి వ్యాపారాలు చేస్తున్నాయంటే అది ఎంత లాభసాటి వ్యాపారమో తెలుస్తోంది.
అదీకాక ప్రజల జీవన శైలి మారడంతో అధిక శాతం మంది క్యాన్‌వాటర్‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపు తున్నారు. ఇక కొనుగోలు చేసిన నీటిని తాగడం కొందరికి హోదాగా మారింది. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని వ్యాపారులు మినరల్ పేర జనరల్ నీటిని సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
అయితే మార్కెట్‌లో లభ్యమవుతున్న మినరల్ వాటర్‌ను తాగడం ద్వారా భవిష్యత్తులో జనం రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఇటీవల జరిపిన వివిధ సర్వేలలో తేలింది. ప్రధానంగా శరీరంలో కాల్షియం తగ్గి ఎముకలు బలహీనపడతాయని వెల్లడైంది. శరీరానికి కావాల్సిన ఉప్పు, సోడియం, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ కొనుగోలు చేసిన నీటిలో లభ్యం కావు. మార్కెట్‌లో దొరికే నీటిలో ఖనిజాలు లేకపోవడంతో ఆ నీరు శరీరానికి ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదు.
వీటిని తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతాయట. అంతేకాకుండా కిడ్నీల్లో రాళ్లు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిజానికి ఏ మంచినీరైనా సరే దానిని కాచి చల్లార్చి రాగి పాత్రల్లో కానీ, కుండలో కానీ పోసి ఆ నీరు తాగితే మంచిదని చెబుతున్నారు. ఇక కుండనీరు తాగితే… ఎముకలకి అందాల్సిన కాల్షియం సరిగ్గా అందుతుందన్నారు.