పూర్వం విష్ణువు అంశతో పుట్టిన నరనారాయణులు అనే మునీంద్రులు బదరిక ఆశ్రమంలో తపము చేసుకుంటూ వుండేవారు. వారు చేస్తున్న తపస్సును చూసిన మహేంద్రుడు భయపడిపోయి వారి తపస్సును భంగం కలిగించడానికి కొందరు అప్సరస స్త్రీలను పంపిస్తాడు. ఆ అస్పరసలు తమ నృత్యగీతాలతో నరనరాయణుల తపమును పాడుచేసి, వశ పరుచుకోవడానికి చాలా ప్రయత్నించారు. కానీ మునులు ఏమాత్రం వారికి లోనవ్వలేదు. పైగా వారందరికంటే అందమైన ఒక సౌందర్యవతిని తమ తొడల నుంచి సృష్టించారు. ఈ విధంగా ఊరువుల నుంచి పుట్టింది కాబట్టి ఆమెకు ఊర్వశి అనే పేరు పెట్టి.. తమ తపస్సును భంగం కలిగించడానికి అప్సరసలను పంపించిన ఇంద్రునికే కానుకగా ఆమెను పంపించారు.
ఊర్వశి ఇంద్రుని వద్దకు వెళుతుండగా సూర్యుడు ఆమెను చూసి మోహిస్తాడు. అతడు ఆమెను పలకరించి, తన వాంఛను తెలియజేస్తాడు. ఆమె కూడా సూర్యుని అందచందాలకు ముగ్ధురాలయిపోయి.. అతడు పిలిచిన సంకేత స్థలానికి బయలుదేరుతుంది. ఆమె సూర్యుడు పిలిచిన చోటుకు వెళుతుండగా మార్గమధ్యంలో వరుణుడు ఆమెను చూసి మోహనపరవశుడైపోతాడు. ఆమె దగ్గరకు వెళ్లి తన వాంఛను తీర్చమని అడుగుతాడు.
అప్పుడు ఊర్వశి.. ‘‘నేను ముందు సూర్యుని వద్దకు వెళ్తాను. ఎందుకంటే మొదట నన్ను అతను కోరుకున్నాడు. కాబట్టి ధర్మం ప్రకారం అతని దగ్గరికే వెళతాను’’ అని అంటుంది. అప్పుడు వరణుడు.. ‘‘నువ్వు సూర్యునితో సంగమించేటప్పుడు నన్నే తలచుకుంటుండాలి. అలా అయితే వెళ్లు’’ అని ఆమెను విడిచిపెట్టి వెళతాడు.
ఊర్వశి సూర్యునితో వున్నప్పుడు ఆమె పరధ్యానం (వరుణుని) మీద ఉండటం గమనించి ‘‘నీవు వేశ్యగా మారిపోవాలి’’ అని శపించి, మధ్యలోనే లేచిపోతాడు. కానీ అతని రేతస్సు పతనమైపోతుంది. అలాగే వరుణుడు కూడా ఊర్వశినే తలచుకొంటుండడంతో అతనికి రేతస్సు పతనమవుతుంది. దీని తేజస్సు భూమి మీద పడటం వల్ల దోషం కలుగుతుందని భావించి, సూర్యావరణులు తమ వీర్యాలను ఒక భాండములో వేసి, వుంచుతారు.
ఇదిలా వుండగా ఒకనాడు నిమి అనే విదేహదేశపు రాజు, వరుణుడు ఇద్దరు కలిసి నిమి ఇంట్లో కాలక్షేపం కోసం జూదమాడుకుంటూ వుండేవారు. వారి ఆట ఆడుకుంటుండగా వశిష్ట మహర్షి అక్కడికి చేరుకుంటాడు. మహర్షి నిమి రాజును చూసి.. ‘‘నేను నీ ఇంటిముందు వచ్చినా కూడా అతిథి మర్యాదలు చేయకుండా ఊరికే వున్నావు కాబట్టి నువ్వు విదేహుడు (శరీరం లేనివాడు)గా మారిపోతావు’’ అని శపిస్తాడు. నిమి కూడా తానున్న పరిస్థితిని గమనించకుండా వశిష్టుడు శపించినందుకు రోషంతో ‘‘నువ్వు కూడా నావల్ల విదేహుడిగా మారిపోవుగాక’’ అని శపిస్తాడు. అలాగే నిమిరాజు.. ‘‘నేను శరీరం లేని వాడినైనా.. ప్రాణులకంటి రెప్పలను అంటుకుని వుంటాను’’ అని చెబుతాడు. అందువల్ల కన్నురెప్పపాటును నిమిషం అంటారు.
నిమి రాజు శపించడం వల్ల వశిష్టుడు తన దేహాన్ని కోల్పోతాడు. తన ఆత్మ ఎక్కడ నిలవవుండాలని ఆలోచిస్తుండగా వరుణుడు, వశిష్టునితో.. ‘‘సూర్యావరణులు తమ వీర్యాలను దాచిన కుండిలోకి వెళితే మళ్లీ శరీరంతో జన్మిస్తావు’’ అని సూచిస్తాడు.
దాంతో వశిష్టుడు కూడా ఇదే సరైన పని అని భావించి అతని ఆత్మ ఆ భాండంలో చేరిపోతుంది. కొంతకాలం తరువాత ఆ భాండంలో నుంచి వశిష్టుడు, అగస్త్యుడు అనే ఇద్దరు కవల పిల్లలు జన్మించారు.