వేసవిలో ఎండ బారినుండి చర్మాన్ని కాపాడుకోవాలంటే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిందే. అప్పుడే యూవీ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. మరి ఎలాంటి సన్ స్క్రీన్ వాడితే మీ చర్మం అందంగా, కాంతివంతంగా ఉంటుంది? అసలు దాన్నెందుకు వాడాలి? సన్ స్క్రీన్ వాడటం వల్ల ఉపయోగాలేంటి అనే విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా సన్ స్క్రీన్ లోషన్ ఎలా రాసుకోవాలో తెలుసుకుందాం. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కనీసం అరగంట ముందు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ రాయాలి. ముఖ్యంగా ఎండ ప్రభావానికి గురయ్యే భాగాలైన ముఖం, మెడ చేతులకు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ముఖమంతా చిన్న చిన్న చుక్కలుగా పెట్టుకొని ఆ తర్వాత సమానంగా పరుచుకొనేలా రాసుకోవాలి. మీది పొడిచర్మం అయితే సన్ స్క్రీన్ లోషన్ రాసిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు. బయటకు వెళ్లినప్పుడు చెమట ఎక్కువ పట్టినా లేదా స్విమ్మింగ్ చేసినా రెండు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది.
సన్ స్క్రీన్ లోషన్ రాయడం వల్ల ఉపయోగాలు:
1.సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. కాబట్టి యంగ్ గా కనిపిస్తారు.
2.వేసవిలో అందరినీ ఇబ్బంది పెట్టే సమస్య ట్యానింగ్. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల చర్మంపై ట్యాన్ ఏర్పడదు.
3.సన్ స్క్రీన్ లోషన్లో కొల్లాజెన్, కెరాటిన్, ఎలాస్టిన్ వంటి చర్మానికి అవసరమైన ముఖ్యమైన పదార్థాలుంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉండేలా చేస్తాయి.
4.సన్ స్క్రీన్ లోషన్ యూవీ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చూస్తుంది. కాబట్టి చర్మ కాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.