ఇక్కడి ఆలయంలోని పాపహరేశ్వరుడు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ విశేష ఆదరణ పొందుతున్నాడు. ఈ స్వామి ఆలయంలో ఎలా వెలిసాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా అత్తా కోడలిని కలిపే ఆలయం అని ఈ ఆలయాన్ని ఎందుకు అంటారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్- బాసర రహదారిపైనా మాటెగాంవ్ గ్రామానికి దగ్గరలో కదిలి గ్రామం ఉంది. ఇక్కడ పాపహరేశ్వరలయం అనే అతి పురాతనమైన దేవాలయం ఉంది. ఇక్కడ పరమశివుడు కొలువై ఉన్నాడు. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇది కాకతీయుల శిల్ప సంపదకు నిలయం. ఇక స్థల పురాణానికి వస్తే, తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు కన్నతల్లైన రేణుకామాత తలను తెగనరికాడు పరశురాముడు. తర్వాత మాతృహత్యా పాతకానికి ఒడిగట్టానన్న అపరాధ భావన పీడించడంతో దాని నుంచి విముక్తిని కోరుతూ పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. ఇందులో భాగంగానే దేశం మొత్తం తిరిగి 32 లింగాలను ప్రతిష్ఠించి పూజిస్తాననీ, తనకు పాపవిమోచనం కలిగించాలనీ శంకరుడిని వేడుకున్నాడు. ఆ ప్రకారమే వివిధ పవిత్ర ప్రదేశాల్లో 31 లింగాలను ప్రతిష్ఠించి చివరగా దిలావర్‌పూర్‌లోని ఎల్లమ్మను దర్శించి అమ్మవారి గుడికి ఉత్తరదిశలో ఉన్న కొండలపైకి ఎక్కి లోయలోకి దిగి అక్కడ 32వ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అతడి పట్టుదలనూ, దీక్షనూ మెచ్చిన పరమశివుడు ఆ 32వ లింగంలో కదిలాడు. ఆ దృశ్యాన్ని చూసి పరుశురాముడు శివుడు కదిలే.. శివుడు కదిలే అంటూ స్తుతిస్తూ తన్మయత్వంతో నర్తించాడట. అప్పటినుంచే ఈ ఆలయాన్ని కదిలే పాపన్న ఆలయంగా పిలిచేవారు. కాలక్రమేణా అదే కదిలి పాపహరేశ్వరాలయంగా ప్రఖ్యాతి గాంచింది.సాధారణంగా దేవాలయాలు తూర్పు, ఉత్తర ముఖాలు కలిగి ఉంటాయి. ఈ ఆలయం అందుకు భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది. శివాలయపు గర్భగుడికి వెనుక భాగంలో దక్షిణ దిశగా పార్వతీమాత అన్నపూర్ణేశ్వరి అవతారంగా వెలిసింది. ఆ పక్కగా ఓ గుండంలోకి కరవూ కాటకాలతో సంబంధం లేకుండా నిరంతరం ఓ జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోని వటవృక్షంలో మర్రి, వేప, రావి, జీడి, మద్ది, టేకు తదితర 18రకాల వృక్షాలన్నీ ఒకే కాండంలో మిళితమై ఉన్నాయి. ఈ వృక్షంమీద వెయ్యేళ్ల వయస్సు ఉన్న నాగుపాము ప్రతి అమావాస్య, పౌర్ణమి ఘడియల్లో దర్శనమిచ్చేదని గ్రామస్థులు చెబుతారు. అంతేకాదు యాగంటిలో నందీశ్వరుడు ప్రతి ఏడాదీ పెరిగిన రోజున కదిలి ఆలయంలోని నంది నుంచి ఏవో శ్వాసపరమైన శబ్దాలు వెలువడతాయనీ ఓ నమ్మకం.
ఆలయానికి తూర్పున శివార్చన కోసం పాల గుండం ఉంది. ఉత్తర ఈశాన్యంలో శివతీర్థ గుండం, దానికి ఉత్తరాన సూర్యచంద్ర గుండాలు ఉన్నాయి. ఉత్తరాన తీర్థ గుండం, జీడిగుండాలున్నాయి. వీటిని అత్తా కోడళ్ల గుండాలుగా పిలుస్తారు. అత్తా కోడళ్లు ఈ రెండు గుండాల్లో స్నానమాచరిస్తే అన్యోన్యంగా ఉంటారని నమ్మకం. దాదాపు ఒకే చోట ఉన్నా వివిధ గుండాల్లోని నీరు చూసేందుకు వివిధ రకాలుగా కనిపించడం ఓ ప్రత్యేకత. అంతేకాదు ఇక్కడి సూర్య గుండంలోని నీళ్లు వేడిగానూ, చంద్రగుండంలోని నీళ్లు చల్లగానూ ఉంటాయి.
ఈ విధంగా పరమశివుడు ఇక్కడ భక్తుల పాపాలను పోగొడుతూ పాపహరేశ్వరుడిగా పూజలనందుకొనుచున్నాడు.