Home Unknown facts Bhummida velisina tholi Vaishnavalayam

Bhummida velisina tholi Vaishnavalayam

0

శ్రీమహావిష్ణువు వెలసిన ఈ ఆలయం భూమ్మీద వెలసిన తొలి వైష్ణవాలయం అని మన పురాణాలూ చెబుతున్నాయి. ఈ ఆలయంలో నారదుడు ఆ స్వామికి కోసం తపస్సు చేసాడని, ఈ ఆలయానికి వచ్చి శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి పొందాడని స్థల పురాణం చెబుతుంది. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. vaishnavalayamఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ధవళేశ్వరం లో శ్రీ లక్ష్మి జనార్దనస్వామి వారి ఆలయం ఉంది. గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా ఈ ఆలయం నిర్మించబడింది. గర్భాలయం లో శ్రీ లక్ష్మి జనార్దనస్వామి వారు వేంచేసి ఉన్నారు. ఈ ఆలయం ఒక చిన్న గుట్టపైన వెలసింది. కృతయుగంలో ఏర్పడిన ఈకొండ మీద తూర్పుచాళుక్యుల కాలంలో పూర్తి స్థాయిలో జనార్దనుడి ఆలయాన్ని నిర్మించారు.ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం నారద మహర్షి ధవళగిరి గుహలో శ్రీ మహావిష్ణువు దర్శనార్ధమై తపస్సు చేసి తరువాత నారాయుని ఆజ్ఞతో విశ్వ మానవ కళ్యాణం కోసం గోదావరి నది పరివాహక ప్రాంతం నందు నవజనార్థములను ప్రతిష్టించాడు. వీటిలో మొదటిది ధవళేశ్వరం. మన పురాణాల ప్రకారం, వ్యాస మహర్షి వేదాల అంతరార్థం తెలుపమంటూ ఘోరతపస్సు చేశాడు. జనార్దనుడు ప్రత్యక్షమై ఈ పర్వతం నుంచి నాలుగు పిడికిళ్ల మట్టిని తీసి వ్యాసుడికి అందించాడు. అతను వాటిని చతుర్వేదాలుగా విభజించాడు. అవే రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంగా వెలుగులోకి వచ్చాయి. మరో కథనం ప్రకారం, ఆదిలో బ్రహ్మ నాలుగు ముఖాల నుంచీ నాలుగు వేదాలూ కోటిసూర్య ప్రచండ కాంతులతో బయటకు వచ్చాయి. మహర్షులూ దేవతలూ ఆ వేద కాంతినీ, కాంతి కారణంగా ఉద్భవించిన వేడినీ తట్టుకోలేక శ్రీమన్నారాయణుడిని ప్రార్థించారు. అప్పుడే, దేవదేవుడైన నారాయణుడు వేయిబాహువులతో వేదాల్ని ఒడిసి పట్టుకుని, భూమిపై ఒక పర్వతంగా నిలిపాడు. ఆ వేదరాశియే జనార్దన పర్వతంగా ఏర్పడింది అని చెబుతారు. ఈ కొండపైన సీతారాముల పాదముద్రలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సొరంగం ద్వారా ఒకప్పుడు కాశి వరకు మార్గం ఉండేదని స్థానికులు చెబుతారు. ఇక్కడ ఉన్న ప్రధానాలయంకి ఉత్తరవైపున గల కొండ గుహలలో శ్రీ సంతాన వేణుగోపాలస్వామి వారు కొలువై ఉన్నారు. ఈ స్వామిని సంతానం లేని వారు దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇలా ఎంతో పురాతన వైభవం కలిగిన ఈ ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాలు మహాశుద్ధ సప్తమి నుండి ఐదురోజులపాటు వైభవంగా జరుగుతాయి. ఇక భీష్మ ఏకాదశి నాడు రథోత్సవం అతి వైభవముగా జరుగుతుంది. ఈ సమయాలలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version