తెల్లగా చక్కగా కనిపిస్తుందని కొనేస్తున్నారా… బెల్లం కల్తీ అయినట్టే!

ప్రపంచమంతా కల్తీమయం అయిపోయింది. చంటి పిల్లలు తాగే పాల పౌడర్ నుంచి టీపొడి, కారం, నూనె ఇలా అది,ఇది అన్న తేడా లేకుండా ప్రతిదీ కల్తీ చేసేస్తున్నారు కొంతమంది వ్యాపారస్తులు. వారి జేబులు నింపుకునేందుకు ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. కల్తీ ఆహారం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు, దీర్ఘకాలిక జబ్బులు కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు ఈ కల్తీ జాబితాలోకి బెల్లం కూడా చేరింది. బెల్లం తీసుకోవడం వల్ల ఇనుమును అందించడమే కాకుండా శరీరంలోని వ్యర్ధాలను కూడా తొలగిస్తుంది. చక్కెరకు బదులుగా బెల్లం వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, బెల్లంలోని పోషకాలు శరీరానికి మంచివని ఎంతో మంది ఆరోగ్య నిపుణులు చెబుతారు.
అయితే, ఇంత మంచి లక్షణాలున్నా బెల్లం కల్తీ అయితే? సహజసిద్ధమైనది కాకుండా అందులో రసాయనాలు కలిపి తయారుచేసిందయితే? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మీ శరీరానికి ఎంతో నష్టం చేస్తుంది. ఇలాంటి కల్తీ బెల్లం వల్ల తరచుగా అలెర్జీలు, ఆరోగ్యసమస్యలు తలెత్తుతుంటాయి.  అయితే ఈ కల్తీ ఉన్న ఆహారాన్ని గుర్తించడం ఎలానో చాలా మందికి తెలియకపోవచ్చు.
మార్కెట్లో రకరకాల బెల్లం దొరుకుతుంది. నల్లబెల్లం, తెల్లబెల్లం, అరిసెల బెల్లం, పాకం బెల్లం, ఉప్పు బెల్లం అని.. రకరకాలుగా దొరుకుతుంది. అయితే ఈ బెల్లాలన్నీ సహజసిద్ధంగా తయారు చేసినవే. కానీ.. ఏ రకం బెల్లం మీరు వాడుతున్నా.. అందులో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఎలా.. అంటే దానికి ఒక ఉపాయం ఉంది.
మామూలుగానే బెల్లం తయారీలో కొంత మొత్తంలో రసాయనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. “బెల్లం శుభ్రం చేయడానికి, సోడాతో పాటు కొన్ని రసాయనాలు ఉపయోగిస్తారు. మామూలుగా బెల్లం ముదురు రంగులో ఉండాలి. బెల్లం తెల్లగా ఉండడం లేదా పసుపు రంగులో ఉంటే వాటిని రసాయనాలు కలిపినట్టు గుర్తించాలి.
బెల్లం క్యూబ్స్‌లో కాల్షియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ ఉండొచ్చు. బెల్లం బరువును పెంచడానికి ప్రాసెస్ చేసేటప్పుడు కాల్షియం కార్బోనేట్ జోడించబడుతుంది, అయితే సోడియం బైకార్బోనేట్ బెల్లానికి మంచి పాలిష్ లుక్ ఇస్తుంది. ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండే బెల్లం ఎక్కువగా రసాయనాలు ఉండవు. ముదురు రంగు బెల్లం సహజసిద్ధమైనది. ఎలాగంటే బెల్లం తయారీ కోసం చెరకు రసం ఉడకబెట్టినప్పుడు అది ముదురు గోధుమ మిశ్రమంలోకి మారుతుంది. దీనిని బెల్లం తయారీకి ఉపయోగిస్తారు. ఈ మిశ్రమానికి రసాయనాలు జోడించడం వల్ల బెల్లం తెల్లగా కనిపిస్తుంది.
బెల్లాన్ని కొని ఇంటికి తీసుకు రాగానే అది నిజమైనదో కాదో తెలుసుకోవాలంటే.. ముందుగా తెచ్చిన బెల్లం లో ఒక చిన్న ముక్క తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. మంచి బెల్లం అయితే ఇట్టే నీళ్ళలో కరిగిపోతుంది. అదే కల్తీ బెల్లం అయితే ఆ గ్లాస్ నీటి అడుగున వ్యర్థాలు పేరుకుపోయి ఉంటాయి.
బెల్లం కొనేటప్పుడు కొంచెం తుంచి నోట్లో వేసుకుంటే… చిరు చేదు, లేదా ఉప్పుగా ఉంటే అది మంచి బెల్లం కాదని తెలుసుకోవాలి. అంతేకాదు బెల్లంలో చక్కెర స్పటికాలు కనిపిస్తే కూడా కల్తీ అని గుర్తుంచుకోవాలి. బెల్లంలో తీపి రుచిని పెంచడానికి స్ఫటికీకరణ జరుగుతుంది.
 ఈ చిట్కాలు పాటించి చక్కెరలో కల్తీ కలిసింది లేదా కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా చక్కెరలో సుద్ధ ముక్కల పొడి, బొంబాయిరవ్వ వంటివి కలిపి కల్తీ చేస్తుంటారు. పంచదార నీళ్ళలో వేస్తే కరుగుతుంది. అడుగున రవ్వ కనిపించినా,నీరు తెల్లగా మారిన కల్తీ జరిగినట్లు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR