Home Unknown facts చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి ఆలయ రహస్యాలు

చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి ఆలయ రహస్యాలు

0

మనం దేవాలయం వెళ్ళినప్పుడు దేవుడిని చూసి నమస్కరించి మనసులో కోరికలు కోరుకొని, టెంకాయ సమర్పించి పూజారి ఇచ్చే హారతి తీసుకుంటాము. కానీ ఈ ఆలయం లో విశేషం ఏంటంటే, నేరుగా భక్తులు స్వామివారి పాదాలను తాకీ పూజించేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. మరి ఇంతటి విశేషం ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీ పాండురంగ స్వామిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్నం, చిలకల పూడిలో శ్రీ పాండురంగ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఆ స్వామి స్వయంభువుగా వెలిశారు. అయితే మహారాష్ట్ర లోని పండరీపురం తరువాత అతడి మహిమగల గొప్ప పుణ్యక్షేత్రం చిలకపూడి లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయం.

ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శ్రీ పండరిపురంలో నరసింహుడు అనే భక్తుడు నిత్యం ఆ పాండురంగ స్వామిని సేవిస్తూ ఉండేవాడు. అయితే ఇతను మహీపతి మహారాజు వద్ద తారకమంత్రం, విఠల్ మంత్రాలను జపిస్తూ ఉండేవాడు. ఇక 1905 లో చిలకలపూడి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని, జ్ఞానేశ్వర తుకారాం అనే ఒక మఠాన్ని స్థాపించి పాండురంగానికి భజనలు చేస్తుండేవాడు. ఒకరోజు ఆ స్వామి ఇతడి కలలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మిస్తే స్వయంభువుగా అవతరిస్తానని చెప్పాడు. అప్పుడు స్వామి ఆదేశాల మేరకు అతడు ఐదు ఎకరాలలో ఆలయాన్ని నిర్మించాడు.

ఇక అప్పుడు పాండురంగ స్వామి స్వయంభువుగా వెలుస్తునట్లు అందరికి వార్త అందడంతో కొన్ని వేలమంది ప్రజలు ఆలయం చుట్టూ చేరారు. అప్పుడు బ్రిటీష్ అధికారులు ఆలయానికి సీలు వేయగా, ఆ పాండురంగ స్వామి స్వయంభువుగా అవతరించకపోతే స్వామివారిలో లీనమైపోతానని ప్రతిజ్ఞ చేసాడు. ఆ తరువాత కొద్దిసేపటికి ఆలయంలో పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే ఆలయం తలుపులు తెరుచుకోగా కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినాన పాండురంగడు భక్తుల సమక్షంలో ఇక్కడ వెలిశారు.

ఇక అప్పటినుండి ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుపుతూనే ఉన్నారు. ఈ స్వామివారికి పటిక బెల్లం అంటే చాలా ఇష్టం. ఇంకా భజనలు అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఈ ఆలయానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తూ భక్తి భావంతో భజనలు చేస్తూ స్వామివారిని అర్చించి స్వామివారి అపార కృపకు పాత్రులవుతారు.

Exit mobile version