కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తోంది. తొలి దశ కంటే సెకెండ్ వేవ్ ఇంకాస్త వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య రెట్టింపు అవుతోంది. అయితే కరోనా వైరస్ లక్షణాల జాబితా కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ సామాన్యానికి బాగా తెలిసిన లక్షణాలకు మరికొన్ని జత చేరాయి. కొత్తగా నమోదైన కేసుల్లో కొత్త రకం లక్షణాలు కనిపిస్తుండడం కాస్త ఆందోళన పెంచుతోంది అంటున్నారు వైద్య నిపుణులు.
తొలి దశలో కనిపించని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇవి చాలా శక్తివంతమైనవని గత కొన్నాళ్లుగా నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకూ జ్వరం, దగ్గు, వాసన, రుచి కోల్పోవడం పాత స్ట్రెయిన్ లక్షణాలుగా ఉండేవి. అయితే వీటితోపాటు ఒళ్ళు నొప్పులు, కండ్ల కలక, కళ్ళు ఎర్రగా మారడం, గొంతు మంట , శరీరంపై దద్దుర్లు, అతిసారం, తలనొప్పి, కాళ్ళు చేతులు పాలిపోయినట్లు కనిపించడం స్ట్రెయిన్ కొత్త లక్షణాలని నిపుణులు చెప్పారు.
వీటిల్లో ఏ రెండు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్ష చేయించుకోవడం బెటర్ అని చెప్పారు. రిజల్ట్ వచ్చే వరకూ ఐసొలేట్ అవ్వడం మంచిదని బయటకు వెళ్లడం కూడా మానేయాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఊపిరితిత్తుల మీద దాడి చేసే కొవిడ్ వైరస్ మూత్రపిండాలు, కాలేయం, జీర్ణవ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తోంది అంటున్నారు. విరేచనాలు లాంటి లక్షణాలను కూడా కొవిడ్ లక్షణాలుగానే అనుమానించాలంటున్నారు వైద్యులు.
చాలా మందిలో నీరసం, తీవ్ర ఇన్‌ఫెక్షన్ సమయాల్లో నిస్సత్తువ వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వాపు, కళ్లళ్లో నీరు కారడం లాంటి లక్షణాలు గుర్తించినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే కోవిడ్19 నిబంధనలు కచ్చితంగా పాటించారు. ఇతరుల నుంచి భౌతిక దూరం, ఇంటి నుంచి బయటకు వెళితే మాస్కులు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైన సమయంలో శానిటైజర్ వినియోగించడం చేస్తే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. మాస్కులను ముక్కు, నోరు, దవడ భాగాలను సరిగ్గా కప్పి ఉంచేలా ధరించాల్సి ఉంటుంది.