Home Unknown facts దక్షుడు తన అల్లుడైన పరమేశ్వరుడిని శపించడానికి గల కారణం

దక్షుడు తన అల్లుడైన పరమేశ్వరుడిని శపించడానికి గల కారణం

0

దక్ష ప్రజాపతి కూతురు సతీదేవిని మహాశివుడు వివాహం చేసుకున్నాడు. అంటే దక్షుడు, పరమేశ్వరుడికి మామ అన్నమాట! అయితే దక్షునికి వున్న అల్లుళ్లలో శివుడు తప్ప మిగతావారందరూ కూడా మహా సంపన్నులు. కానీ శివుడు మాత్రం స్మశానంలో ధ్యానం చేసుకుంటూ, ఆవుని తన వాహనంగా చేసుకుని తిరుగుతుండేవాడు. దాంతో దక్షునికి అల్లుడైన శివుడు అంటే చాలా చిన్నచూపు. అందుకే శివుడిని ఏ శుభకార్యానికిగానీ, ఇతర కార్యక్రమాలకుగానీ ఆహ్వానించేవాడు కూడా కాదు.

దక్షప్రజాపతిఇదిలా వుండగా… ఒకరోజు అంటుకోకుండా పరమేశ్వరుడు తన మామగారైన దక్షునికి ఎదురుపడతాడు. ఆ సందర్భంలో తనను సరిగ్గా పలకరించకపోవడం, పెద్దరికం చూపించకపోవడం, గౌరవించకపోవడంతో దక్షుడు మరింత కోపాద్రిక్తుడైపోతాడు. ‘‘ఎందరో మహానుభావులు, రాజులు, దేవతలు నన్ను గౌరవిస్తారు. ఆదరిస్తూ ఆహ్వానాలకు పిలుస్తారు. అటువంటి నన్ను ఈ పేదవాడు.. భిక్షం ఎత్తుకుని ఆరగించేవాడు.. ఎప్పుడూ స్మశానంలోనే కూర్చొని ధ్యానం చేసుకునేవాడు.. కనీసం నన్ను పలకరించకుండా ఇంత మౌనంగా వుంటాడా..! ఇంత పొగరా’’ అంటూ మనసులో ఆందోళన చెందుతాడు.

‘‘పశువు మీదెక్కి తిరగడమే కాకుండా.. పశువులా ప్రవర్తించడం మొదలుపెట్టేశాడు. అసలు అతనికి తెలివి లేకపోయినా.. కనీసం ఇతరులను గౌరవించాలన్న సంస్కారం కూడా లేదా? ఇటువంటి వాడిని నమ్మి నా కూతురిని ఇచ్చినందుకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది’’ అంటూ దక్షుడు తనలో తానే కుమిలిపోతాడు. చివరికి తన లోపల వున్న ఆవేశాన్ని ఆపుకోలేక పరమశివుడిని అనరాని మాటలతో దూషిస్తాడు. తనలో వున్న కోపాన్ని శివుడి మీద వెళ్లగక్కుతాడు. అయినా కూడా శివుడు మామగారి పరువుని కాపాడటం కోసం నోరు మెదపకుండా అలాగే వుండిపోయాడు.

కానీ అల్లుడు సమాధానం ఇవ్వడం లేదన్న ఆలోచన దక్షునికి మరింత ఆవేశం తెప్పించింది. తనలో వున్న మొత్తం కోపాన్ని వెళ్లగక్కుతూ… ‘‘నేను ఇంతలా మాట్లాడుతుంటే నన్ను లెక్కచేయకుండా పరాభావిస్తావా? నువ్వు చాలా తప్పు చేసేశావు. ఇందుకు నువ్వు శిక్షను అనుభవించాల్సిందే..! ఇకపై నుంచి యజ్ఞయాగాదులలో నీకు హవిస్సులు లేకుండా పోతాయి. ఇది నా శాపం. ఇదే నేను జీవితాంతం నీకిచ్చే శిక్ష’’ అంటూ దక్షుడు తన అల్లుడైన పరమేశ్వరుడిని శపిస్తాడు.

 

Exit mobile version