ప్రపంచంలోనే ఎక్కువ కాలం జీవించి గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన ఆ ఏనుగు పేరు దాక్షాయణి. ఈ ఏనుగుకి గజ ముతస్సీ అంటే ఏనుగు బామ్మా అనే బిరుదు కూడా ఉంది. అయితే 88 సంవత్సరాల వయసు ఉన్న దాక్షాయణి ఈ నెల 5 వ తేదీన మరణించింది. మరి దాక్షాయణి ఎవరు? ఏంటి అనే మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రం, త్రివేండ్రం లో చెంగునూర్ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ ఆలయానికి భగవతి ఆలయం అనే మరొక పేరు కూడా ఉంది. ఈ ఆలయంలో భద్రకాళి అమ్మవారు పూజలందుకుంటున్నారు. ఇక్కడ వెలసిన భద్రకాళి మాతను చెట్టి కులంగార భగవతి అనే పేరుతో భక్తులు పిలుస్తుంటారు. ఈ ఆలయంలో 4 మిలియన్ ల మంది ఆడవారు పొంగల్ పండుగ జరిపి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. ఈ పండుగలో కేవలం ఆడవారు మాత్రమే పాల్గొనాలి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం, శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్న తరువాత మొదటిసారిగా ఈ ప్రదేశానికి వచ్చారని చెబుతారు. ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి నెల ఇక్కడి అమ్మవారు రుతుస్రావాన్ని ఆచరిస్తుంది. అందుకే ప్రతి నెల మూడురోజులు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలోనికి వెళ్ళడానికి అనుమతి అనేది ఉంటుంది.
కేరళకు చెందిన ట్రావన్‌కోర్ దేవస్థాన బోర్డు దగ్గర ఈ ఏనుగు ఉండేది. ట్రావెర్ కోర్ రాజకుటుంబికులు 1949లో ట్రావన్‌కోర్ బోర్డు ఏర్పాటైన తరువాత దాక్షాయణి ఈ బోర్డు ఆధీనంలోనే ఉండేది. అయితే ట్రావన్‌కోర్ బోర్డు ఆధీనంలో మొత్తం 33 ఏనుగులు, 1250 ఆలయాలు ఉండగా ఆ 33 ఏనుగులలో దాక్షాయణి ఒకటి. ఇక ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు ఈ ఏనుగులను వినియోగించేవారు.
దాక్షాయణి అనే ఏనుగు కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం లోని చెంగలూర్ మహాదేవ్ ఆలయంలో ఉండేది. అయితే తైవాన్ లోని ఒక ఏనుగు 2003 లో 85 సంవత్సరాల వయసులో మరణించగా, ప్రపంచంలోనే ఎక్కువ కాలం బ్రతికిన ఏనుగుగా దాక్షాయణి గిన్నిస్ రికార్డ్ సృష్టించింది. మరణించేనాటికి ఈ ఏనుగు వయసు 88 సంవత్సరాలు. అయితే మహాదేవ్ ఆలయంలో ఉంటున్న ఈ ఏనుగు ఫిబ్రవరి 5 వ తేదీన వయసు పైబడి మరణించింది.
ఇక ఈ గజరాణి పేరు దాక్షాయణి. పురాణాల ప్రకారం, దాక్షాయణి అంటే దక్ష ప్రజాపతి కూతురు అని అర్ధం. దక్షప్రజాపతి కూతురు సతీదేవి. శివుడి భార్య సతీదేవి. సతీదేవి తన తండ్రి చేస్తున్న దక్ష యజ్ఞానికి వెళ్లగా అక్కడ తన భర్తైనా శివుడికి అవమానం జరుగగా ఆ అవమాన భారాన్ని తట్టుకోలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకొని మరణించింది. ఆ తరువాత ఆమె పర్వత రాజు కూతురు పార్వతీదేవిగా జన్మించిందని పురాణం.