This Detailed Write-Up About Chandrasekhar Yeleti Explains Why He Is The Most Underrated Director Of Tollywood

Written By: ప్రవీణ్ యజ్జల

తెలుగులో ‘అనుకోకుండా’ ఒక దర్శకుడు.!

గొర్రెల మధ్య సింహం బతకడం చాలా ఈజీ.! కానీ కొన్నాళ్ళకు ఆ సింహానికి గొర్రెల మందకు పెద్ద తేడా తెలియకుండా పోతుంది.! ఎందుకంటే సింహం తన వేటని వదిలి అందుబాటులో ఉన్న గొర్రెలతో సర్దుకుపోవడమే సింహం చేసిన పొరపాటు.! అలా తెలుగు సినిమాల్లో తన వేటను మర్చిపోయాడేమో అనే అనుమానం కలిగించే దర్శకులు రామ్ గోపాల్ వర్మ అయితే వేటనే తన ఉనికిగా ఊపిరిగా ప్రతీ సినిమాతో నిరూపించే దర్శకులు చంద్రశేఖర్ యేలేటి.! ఎందుకీ మాట అనాల్సివస్తుందంటే ఆయన తీసిన సినిమాలు తెలుగులో అంత ప్రత్యేకంగా కనిపిస్తాయి.! పదిహేడు సంవత్సరాల సినీ ప్రయాణంలో ఇప్పటి వరకూ ఆయన తీసిన సినిమాలు ఆరు.! ఏడో సినిమా ‘చెక్’ విడుదలకు ముస్తాబవుతుంది.! కానీ ఆయన సినీ సేధ్యంలో పండించిన పంటంతా ఆర్గానిక్, ఆరోగ్యం.! అంతేగానీ పురుగుల మందులతో పండించిన పంటకాదని మనం స్పష్టంగా గమనించాలి.! అదేమిటో ఆ రైటింగ్ అండ్ డైరెక్షన్ ప్రత్యేకత ఏమిటో ఒకసారి చర్చిద్దాం.!

అది రెండు వేల మూడు అప్పటి వరకూ ఉన్న తెలుగు సినిమా మూస ధోరణి చెంప చెల్లు మనిపించి అన్నీ సినిమాలు ఒకేలా ఉండవ్? ‘ఐతే’! ఏంటీ? అని రుబాబు చేసి మరీ ఫైట్లు లేకుండా ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న సైలెంట్ సూపర్ హిట్ సినిమా ఐతే.! అక్కడితో ఆగకుండా బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు; బెస్ట్ స్టోరి రైటర్ గా స్టేట్ నంది అవార్డు అందుకున్నారు.! తెలుగు సినిమా అంటే? పాటలు, ఫైట్లు, హీరో ఎలివేషన్స్ మధ్య చిక్కి శల్యమైపోయిన కథను సినిమాలుగా తీస్తున్న రోజులు బలంగా వీస్తున్న వేళ న్యూఏజ్ సినిమా; కథాబలం; సృజనాత్మకత ఈ మూడింటి కలగలుపు తెలుగు సినిమా అంటే ఏమిటో చూపించిన ఘనత చంద్రశేఖర్ యేలేటికి దక్కుతుంది.! ఇప్పుడొస్తున్న తరుణ్ భాస్కర్ లాంటి యంగ్ ఫిల్మేకర్స్ కు ప్రయోగాత్మక; ఆల్టర్నేటివ్; బడ్జెట్ కంట్రోల్ సినిమా అంటే ఏమిటో ‘ఐతే’ లాంటి సినిమాతో చూపించిన సినీ మార్గదర్శి అంటే చంద్రశేఖర్ యేలేటి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.! ఇలాంటి ఒక క్రియేటర్ని గుర్తించి తెలుగు సినిమాకు పరిచయం చేసిన గౌరవం ‘గుణ్ణం గంగరాజు’గారికి దక్కుతుంది.!

నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడి దగ్గర్నుండి రెండో సినిమా ఎలాంటిది వస్తుందని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ముందుకు రెండు వేల ఐదులో ‘అనుకోకుండా ఒక రోజు’ తో కనిపించారు.! అప్పటి వరకూ తెలుగు సినిమా అనుకోని, అందుకోని సినిమాగా ప్రేక్షకులు ఒక కొత్త థ్రిలింగ్ అనుభూతికి లోనయ్యారు.! చంద్రశేఖర్ యేలేటి చూడ్డానికి మెడలో దేవుడి దండ; చేతికి దేవుళ్ళ తాళ్ళతో పరమ చాదస్తపు భక్తుడిలా కనిపిస్తారు.! కానీ ఈ సినిమా మొత్తం డ్రగ్సుకు, మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా విజ్ఞానవంతంగా తీశారు.! తెలుగు సినిమాల్లో స్టోరీ టెల్లింగ్ లో కలర్సును ఉపయోగించిన జీనియస్ ఫిల్మ్ మేకర్ చంద్రశేఖర్ యేలేటి.! ఆడియన్స్ ఆలోచనలకు పదును పెట్టే ఇలాంటి ఎన్నో డీటేయిల్స్ ఆయన సినిమాల్లో చాలా సహజంగా ఒదిగిపోతాయి.! ఈ సినిమాలో యేలేటి జగపతిబాబుతో క్లైమాక్స్ లో ఒకమాట చెప్పిస్తారు.! ‘మూఢ నమ్మకాలకు డ్రగ్స్ కు పెద్ద తేడా లేదు. రెండూ మత్తే.!’ అని అంటారు. ఈ మాటకు కార్మికుల కష్టానికి ఎలాంటి నష్టం కలగకూడదని ఇష్టపడి పోరాడిన కార్మిక వీరుడు ‘కారల్ మార్క్స్’ చెప్పిన ‘మతం మత్తులాంటిది’ అనే వాక్యం ప్రేరణ కూడా కావచ్చు.!

Whatsapp Image 2020 10 21 At 12.27.53 Pm (2)ఇలా మాటల ద్వారా ఆలోచనాత్మక గుళికల్ని ప్రేక్షకుల చేత మింగించాలంటే ఆధ్యాత్మికతకు, అంధవిశ్వాసాలకు మధ్య తేడా యేలేటికి స్పష్టంగా తెలుసని మనం గమనించవచ్చు.! అదే స్పష్టత ఇతర దర్శకుల విషయంలో ఇలా ఉంది.!
‘మురారి’ లో మూఢ విశ్వాసాల్ని వెదజల్లడం, ‘ఖడ్గం’లో ముస్లిం వ్యతిరేకత చూపించడం.! పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ లో పిల్లలు పుట్టగానే పెళ్ళిళ్ళు నిర్ణయమైపోతాయని చెప్పడం.! ‘మృగరాజు’ లో వంతెన కట్టడం అపచారం అనే గిరిజనుల విశ్వాసం దాదాపు నిజమై కూర్చోడం.! ‘బాబా’ లో రజనీకాంత్ దైవానుగ్రహంతో పుట్టినట్లు చూపించడం.! ‘ఇంద్ర’ లో యాగం చేస్తే వాన కురవడం.! ఇలా చెప్పుకుంటూ పోతే అప్పటి సినిమాల నుండి ఇప్పటి సినిమాల వరకూ చాలా కనిపిస్తాయి.! కానీ ఈ దర్శకులెవ్వరూ యేలేటిలా మెడలో దండ, చేతికి తాడు కట్టుకోకపోవచ్చు కానీ వీళ్ళ సినిమాల నిండా మూఢత్వం విలయ తాండవం చేస్తుంటుంది.! శాస్త్రీయ, సామాజిక దృక్పథంతో కొత్త, కొత్త కథలు, సన్నివేశాలు రాయలేని చేతకానితనం మూఢ విశ్వాసాల్ని, కులమతాల్ని పెంచిపోషిస్తుంది.! సినిమా అంటే వినోదంతో పాటు ఎంతో కొంత విజ్ఞానాన్ని కూడా పంచగల్గాలి.! కానీ ఇలాంటి మూస దర్శకుల వల్ల ప్రేక్షకుల్లో మానసిక వైకల్యం పెరిగి మనుషుల మధ్య రకరకాల విద్వేషాలు చలరేగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.! అందుకే నమ్మకాల యందు మూఢ నమ్మకాలు వేరయా.! సినీ దర్శకుల యందు చంద్రశేఖర్ యేలేటి భేషయా.! అని మనం ఘంటాపథంగా ఢంకా కొట్టి మరీ చాటి చెప్పవచ్చు.!

రెండువేల ఏడు ఈ సారి మాస్ హీరో గోపిచంద్ తో క్లాస్ టచ్ ఇస్తూ తీసిన సినిమా ‘ఒక్కడున్నాడు’.! బాంబే బ్లెడ్ గ్రూప్ అనే సరికొత్త అంశాన్ని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ తీశారు.! మాస్ హీరోతో ఇంత ఇంటెన్స్ డ్రామా తీయడం వల్ల రిజల్ట్ కొంచెం తేడా వచ్చినా సినీ ప్రేమికులు మాత్రం యేలేటి ఇంటిలిజెన్స్ స్టోరీ టెల్లింగ్ కు ఫిదా అయ్యారు.! విమర్శకుల
ప్రశంసలందుకున్నారు.! కిరణ్ తన ఎమోషన్తో విలన్ తాలూకా రౌడీలను పరిగెత్తించి, పరిగెత్తించి కొడుతుంటే ఆడియన్స్ కొడుతున్న అనుభూతి పొందుతారు.! తీసుకున్న విభిన్నమైన కథాంశానికి యాక్షన్ సీక్వెన్సెస్ ప్రాణం పోశాయి.! ఈ సినిమాని ప్రేరణగా తీసుకుని 2013 లో ‘ది ప్యాకేజ్’ పేరుతో హాలివుడ్ వాళ్ళు సినిమా తీశారు.! ఇప్పటి వరకూ మనం వాళ్ళ సినిమాల నుండి ప్రేరణ పొందడం తప్పా వాళ్ళు మన దగ్గర్నుండి స్పూర్తి పొందడం మన తెలుగు సినిమా చరిత్రలో చాలా అరుదుగా జరిగే విషయం.! ఈ క్రెడిట్ యేలేటితో పాటు ఆ సినిమా నిర్మాత ‘చెర్రీ’గారికి కూడా దక్కుతుంది.!

Whatsapp Image 2020 10 21 At 12.27.53 Pm (1)యేలేటిలో ఉన్న ప్రేమికుడు నిద్రలేచి ప్రేక్షకులకు రాసిన రొమాంటిక్ ప్రేమలేఖ ‘ప్రయాణం’! ఇది ప్రేమికులకు ఆయన ఇచ్చిన క్రియేటివ్ లవ్ గిఫ్ట్.! అప్పటి వరకూ వచ్చిన తెలుగు సినిమాల్లో సినిమా అంతా ఒకే లొకేషన్; హీరో, హీరోయిన్లకు సింగిల్ కాస్టూమ్; రెండు గంటల వ్యవధిలో నడిచే ప్రయోగాత్మక కథ.! ఇలాంటి వినూత్నమైన అంశాల్ని జత చేసి, ప్రేమ శృతి ఇంకాస్త పెంచి తీసిన రొమాంటిక్, హ్యూమర్ లవ్ స్టోరి ప్రయాణం! అది ప్రేక్షకులకు ఒక కొత్త ఫ్రెష్ వాచింగ్ ఫీల్ ఇచ్చిందనడంలో అనుమానం లేదు.! ఈ సినిమా తరువాత తెలుగులో రొమాంటిక్ కామిడీల వరవడి బలపడిందనుకోవచ్చు!

Whatsapp Image 2020 10 21 At 12.27.53 Pmయేలేటి సినిమాల్లో సమాజం దాని తాలూక సమస్యలు మేకప్ లేకుండా రియాలిటీగా కనిపిస్తాయి.! గోపీచంద్ తో మరోసారి చేసిన ‘సాహసం’ లో కూడా ఇదే కనిపిస్తుంది.! మిడిల్ క్లాస్ ఆలోచనలతో ఆకాశాన్ని అందుకోవాలనే కోరికలతో సతమతమయ్యే పాత్ర గౌతంది.! యేలేటి సినిమాలన్నీ చాలెంజింగా ఉంటాయి.! ఎవ్వరూ స్పృశించని అంశాల్ని తీసుకుని సినిమాలు చేయడంలో యేలేటి సిద్ధహస్తుడు.! ‘నేషనల్ ట్రెజర్; ‘మెకన్నాస్ గోల్డ్’ లాంటి ఎడ్వెంచర్ సినిమాలు ఇప్పుడు బాగా అరుదైపోయాయి.! అలాంటి సమయంలో సాహసం తీసిన ‘సాహసి’ యేలేటి.! మనకు తెలిసి ఆయన సినీ కెరియర్లో ‘సాహసం’ ఒక్కటే ఎండ్వెంచర్ మూవీ అనుకుంటాం.! కానీ క్లోజ్గా గమనిస్తే తెలుగు సినీ దర్శకుల సినిమాలతో, యేలేటి సినిమాల్ని పోల్చి చూసినప్పుడు ఆయన సినిమాలన్నీ ఎండ్వెంచర్ సినిమాలే అవుతాయి.! సినీ వృద్ధులు సెట్ చేసిన పాటలు, ఫైట్లు, హీరో ఎలివేషన్స్ మధ్య నలిగిపోయిన కథతో ఎప్పుడైతే సినిమా తీస్తారో అప్పుడవుతుంది నిజమైన యేలేటి ఎండ్వెంచర్ మూవీ.!

కొన్ని సినిమాలు రాయాలన్నా డబ్బు ఖర్చుపెట్టి తీయాలన్నా సహృదయం కావాలి.! ఈ విషయంలో తమిళ సినిమా మనకంటే ఎన్నో ఏళ్ళు ముందున్న సంగతి వారి సినిమాల ద్వారా నిరూపిస్తూనే వస్తున్నారు.! అలా మరొకసారి మన భుజాలు తడుముకోవాల్సిన సినిమా ‘కా/పే రణసింగం’ ఈ సినిమాతో విజయ్ సేతుపతి ఇంకా నటుడే! సో కాల్డ్ హీరో అవ్వలేదని నిరూపించాడు.! తమిళ సినిమాల్ని మెచ్చుకున్నంత మనస్పూర్తిగా తెలుగులో మొట్టమొదట యేలేటి సినిమాల్నే మెచ్చుకోగలం.! ఎందుకంటే ఆయన సినిమాలు సమాజానికి ప్రతిబింబాలు.! ‘మనమంతా’ లాంటి క్లాసిక్ సినిమా తెలుగులో యావరేజ్గా ఆడింది.! ఎందుకనే ప్రశ్న వేసుకుంటే.? మనుషుల్లో ఆహార ప్రియులు పెరిగిపోయినట్లే ఎంటర్టైన్మెంట్ ప్రియులు కూడా విపరీతంగా పెరిగిపోయారు.! ‘ఆరోగ్యం, ఆర్గానిక్’ అనే ఆలోచన లేకుండా ఏది పడితే అది తినేస్తున్నాం.! అలాగే కొన్ని సినిమాలు, టీవీషోలు అలవాటు చేసిన ఎకిలి, ఎంగిలి, బాడీషేమింగ్, చవకబారు కామిడీల వల్ల సమాజం తాలూకా సగటు ‘ఐక్యూ’ కూడా తగ్గిపోతుంది.! దీని వల్ల ప్రేక్షకులు తమ నిజ జీవితాలను తామే గుర్తించడంలో సోదర భాషలకంటే వెనకపడ్డారు.! యేలేటి సినిమాల్లో ఉండే హ్యూమర్, లాజికల్ స్టోరీ నెరేషన్ మిస్సవుతున్నారు.! అందుకే ఆయన మలయాళం, తమిళ సినీ ప్రేమికుల్ని కూడా కలుపుకున్నారు.! యేలేటి సినిమాలు ఆడియన్సును చీట్ చెయ్యవు.! వాళ్ళు ఇచ్చిన సమయానికి, డబ్బులకు గౌరవమైన ప్రతిఫలాన్నిస్తాయి.! కొంత మంది తెలుగు దర్శకుల మ్యాజిక్కులకు అలవాటు ‘పడిపోయిన’ ప్రేక్షకుల్ని లాజిక్కులతో ఆలోచింపచేయడం ఒర్జినల్ స్టోరి టెల్లర్స్ కు పెద్ద శాపంగా మారింది.! కానీ యేలేటి లాంటి దర్శకులు ఓపికతో ప్రేక్షకుల పాలిట దాన్ని వరంగా మారుస్తున్నారు.!

చంద్రశేఖర్ యేలేటి వ్యక్తిత్వం:

Whatsapp Image 2020 10 21 At 12.27.54 Pm‘‘ఒక భయం లేని వ్యక్తి ఎప్పుడూ క్రోధంగా ప్రవర్తించడు. అసలు దేనికి భయపడని వాడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఒక ఫ్రీ మ్యాన్ లా బ్రతుకగలుగుతాడు’’ అని జిడ్డు కృష్ణమూరి గారు చెప్పారు. ఈ వాక్యానికి నిలువెత్తు నిదర్శనం యేలేటి వ్యక్తిత్వం.! తన సమకాలికులు, శిష్యులు స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్నా యేలేటిలో మాత్రం కంపారిజన్, ఐడెంటిటీ క్రైసిస్ లాంటి గందరగోళం లేదు.! సినీ పరిశ్రమ మొత్తం కంపారిజన్, ఐడెంటిటీ క్రైసిస్లో పడి నలిగి, నశించిపోయి ఎలాగోలాగ బతికేస్తుంటే యేలేటి మాత్రం తామరాకు మీద నీటి బిందువులా ప్రసన్న వదనంతో ప్రశాంతమైన చిరునవ్వుతో ఒక మహర్షిలా జీవిస్తుంటారు.! తెలుగు సినిమాలన్నీ ‘రాశి’ పోస్తే యేలేటి సినిమాలు ‘వాసి’ గా వెలుగుతాయి.!

‘మనమంతా’ సినిమా టైమ్లో యోయో టీవి ఇంటర్వ్యూలో ‘‘మీరింత సింపుల్గా ఎలా ఉంటారు’’? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘‘ఒక సినిమా గొప్ప హిట్ అయిందంటే అది మన ఒక్కరి టాలెంటేకాదనే విషయం మనకు తెలుస్తుంటుంది.! అది కంప్లీట్గా టీమ్ వర్క్.! అలా కాకుండా అంతా నా వల్లే అయింది.! నేను ఇదంతా సాధించేశాను అనుకుంటే హెడ్ స్ట్రాంగ్ నెస్ పెరుగుతుంది.! నేను సాధించిన నేషనల్ అవార్డు కూడా నాతో పాటు వర్క్ చేసిన అందరిది.’’ అని అంటారు.! ఇలా చాలా మంది ఎఫెక్ట్ కోసం అంటుంటారు కానీ నిజ జీవితంలో అది కనిపించదు.! యేలేటి అలా కాదనే సత్యం ఆయన తీసిన సినిమాలు, అందులో క్రియేట్ చేసిన పాత్రలు, ఆయన బాడీ లాంగ్వేజ్ చెబుతూనే ఉంటాయ్.! అవి చెప్పకపోతే యాంకర్ ఎందుకు ఆ ప్రశ్న అడుగుతుంది.? ఇలా రాసుకుంటూ పోతే చాలా ఉంది.!

ఇక చివరిగా రామ్ గోపాల్ వర్మ సమాజాన్ని గిల్లడం మానేసి శ్రద్ధగా సినిమాలు తీస్తే అవి చంద్రశేఖర్ యేలేటి సినిమాల్లా ఉంటాయని మాత్రం కచ్ఛితంగా చెప్పగలను. చంద్రశేఖర్ యేలేటి ఒక గ్యాంగ్ స్టార్; క్రైమ్; హర్రర్ జోన్రాల్లో సినిమాలు తీస్తే అవి రామ్ గోపాల్ వర్మ సినిమాల్లా ఉంటాయని కూడా మనం ఊహ చెయ్యవచ్చు! వీరిద్దరి స్టోరీ టెల్లింగ్ స్క్రీన్ మీద ‘వెరీ ఇంటెన్సిటీ’గా ఉంటుంది.! మళ్ళీ అదే ఇంటెన్సిటీ కృష్ణవంశీలో కూడా కనిపిస్తుంది..!చంద్రశేఖర్ యేలేటి అలాంటి సినిమాలు తీస్తే మాత్రం సినీ ప్రేమికులకు పండగే.!

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR