హిందూ సంప్రదాయంలో ఎన్నో ఆచారాలు ఉన్నవి. దేవుడికి భక్తితో చేసే ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని పురాణాలూ చెబుతున్నాయి. అయితే అలాంటి ఆచారాలలో ఒకటి కొబ్బరికాయ కొట్టడం. మనం గుడికి వెళ్ళినప్పుడు, పండుగ రోజు, శుభకార్యాలు జరిగే రోజు, కొత్త వాహనం విక్రయం చేసినప్పుడు ఇలా అనేక సందర్భాలలో ఇష్ట దైవాన్ని తలచుకొని కొబ్బరికాయలు కొడుతుంటారు. అంతేకాకుండా ముక్యమైనా పూజా సందర్భాల్లో కొబ్బరికాయ ఉన్న కలశమును ఉపయోగిస్తుంటారు. మరి ఇలా కొబ్బరికాయ ఇందుకోసం కొడతారు, అలా మొక్కు తీర్చుకోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గుడికి వెళ్ళినప్పుడు కోరిన కోరికలు నెరవేరడానికి దేవుడికి కొబ్బరికాయ కొట్టి దానిని స్వామికి నైవేద్యంగా పెట్టి ఆ తరువాత మనం దానిని ప్రసాదం లాగా స్వీకరిస్తాం. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. అయితే ఒకప్పటికాలంలో మనలోని జంతు ప్రవృత్తులను భగవంతునికి సమర్పించడానికి గుర్తుగా జంతుబలి అమలులో ఉండేది. ఆ ఆచారము నెమ్మదిగా తగ్గిపోయి దానికి బదులుగా కొబ్బరికాయ నివేదించ బడుతున్నది. అయితే ఎండిన కొబ్బరి కాయకు పై భాగములో పిలకకోసం మాత్రము వదిలి, మిగతా పీచు అంతా తీసి వెయ బడుతుంది. దానిపైన ఉన్న గుర్తులు మానవుని తల మాదిరిగా కనిపిస్తాయి. ఇక పగిలిన కొబ్బరికాయ అహంకారము యొక్క విరుపును ప్రతిబింబింప చేస్తుంది. మనలోని అంతరంగ ప్రవృత్తులకు ప్రతీక ఐన లోపలి నీరు, మనసుకు ప్రతీక ఐన కొబ్బరితో సహా భగవంతునికి నివేదింప బడతాయి. అప్పుడు భగవంతుని స్పర్శతో శుద్ధి అయిన మనసు ప్రసాదం గా వినియోగించ బడుతుంది. దేవాలయాల్లోనూ , ఇళ్ళల్లోను చేసే సంప్రదాయ బద్దమైన పంచామృత అభిషేక ప్రక్రియలో విగ్రహం పైనుంచీ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, గంధపు మిశ్రమము, విభూతి మొదలగు వాటితో అభిషేకము చేస్తారు. ప్రతి ఒక్క పదార్ధము భక్తులకి ప్రయోజనాలను కల్గించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గలిగి ఉన్నది. సాధకునికి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుందనే నమ్మకముతో కొబ్బరినీరు అభిషేక ప్రక్రియలలో వాడబడుతుంది.కొబ్బరి కాయకు పైనున్న మూడు కళ్ళ గుర్తుల్ని బట్టి త్రినేత్రుడైన పరమశివునికి ప్రతీకగా భావిస్తారు. అందువల్లనే మన కోరికలు తీర్చడానికి అది సాధనంగా పరిగణించ బడుతుంది. కొన్ని వైదిక ప్రక్రియలలో పరమ శివునికి మరియు జ్ఞానికి ప్రతీకగా కొబ్బరి కాయ కలశం పై పెట్టబడి అలంకరింపబడి, మాలాలంకృతము చేయబడి పూజింపబడుతుంది. ఇవేకాకుండా, కొబ్బరికాయ భూమిలోనుంచి ఉప్పు నీటిని తీసికొని బలవర్ధకమైన నీటిగా మార్చుతుంది. ఈ నీరు ప్రత్యేకముగా రోగులకు ఉపయోగ పడుతుంది. ఇంకా ఇది ఎన్నో ఆయుర్వేద మందుల్లోనూ ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలోను వాడబడుతుంది. అంతేకాకుండా కొబ్బరికాయ ఫలాపేక్ష రహిత సేవకి కూడా ప్రతీక. చెట్టు యొక్క ప్రతి భాగము మ్రాను, ఆకులు, కాయ, పీచు మొదలైనవి ఇంటి కప్పు, చాపలు రుచికరమైన వంటకాలు, తైలము, సబ్బులు మొదలైన వాటి తయారీ లో ఉపయోగించ బడతాయి. ఈవిధంగా కొబ్బరికాయ కొడుతూ మొక్కులు తీర్చుకోవడం వెనుక అసలు కారణం ఇదే అంటూ కొందరు పండితులు తెలియచేస్తున్నారు.