వినాయకుడు 10 భుజాలతో దర్శనమిచ్చే అద్భుత ఆలయం గురించి తెలుసా ?

మన పురాణాలూ చూసినట్లైతే నాలుగు కంటే ఎక్కువ చేతులు కలిగిన దేవతలు చాలా తక్కువ. అయితే ఇక్కడ వెలసిన గణపతి దేవుడికి పది భుజాలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయంలో గణపతి  దశభుజ గణపతిగా ప్రసిద్ధి చెందాడు. మరి ఎంతో మహిమ గల ఈ ఆలయం ఎక్కడ ఉంది?  ఈ ఆలయంలో మూలవిరాట్ కి ఉన్న ప్రత్యేకతలు ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Ganpathi

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలంలో దశభుజ గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో భూపతిరాయలు అనే పాలకుడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ ఆలయంలో 10 అడుగుల ఎత్తు గల ఏకశిలా దశభుజ గణపతి ఉండి, ఎడమ తొడపైన లక్ష్మీదేవి ఆసీనురాలై ఉన్న గణపతిని పదిహేను అడుగుల ఎత్తుతో, పన్నెండు అడుగుల వెడల్పుతో అత్యద్భుతంగా మలచారు. ఆ ప్రతిమ ఆనాటి శిల్పుల నైపుణ్యానికి మచ్చు తునకగా చెప్పవచ్చు.

2-Dashabhuja Ganpathi

ఇక గణపతి విగ్రహం విషయానికి వస్తే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ గా, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం, ఏనుగు మొహం, చాట చెవులు, బానపొట్ట గణపతి రూపం జగద్విఖ్యాతం. ఇక్కడి గణపతికి మొత్తం పదిచేతులుంటాయి. ఎడమవైపున అయిదు చేతులూ, కుడివైపున అయిదు చేతులతో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో  ఆ రూపం భక్తుల్ని తన్మయుల్ని చేస్తుంది. కుడివైపున మొదటి చేతిలో నారికేళం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో ధనుస్సు, ఐదో చేతిలో అంకుశం ఉంటాయి. ఎడమవైపున మొదటి చేతిలో భార్య సిద్ధి, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, నాలుగో చేతిలో శరం, అయిదో చేతిలో ఖడ్గం దర్శనమిస్తాయి. విగ్రహం ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం ఉంది.

3-Ganesh

స్వామి ముక్కంటిగా దర్శనమిస్తున్న కారణంగా, పరమశివుడిలానే దుష్టశిక్షకుడనీ శిష్టరక్షకుడనీ విశ్లేషిస్తారు. విగ్రహానికి కుడివైపున సూర్యుడూ ఎడమవైపున చంద్రుడూ ఉండటంతో విశ్వగణపతిగా కీర్తిస్తారు.

4-Ganesh

ఈ ఆలయానికి 3 కి.మీ. దూరంలో లింగాలబండ అనే కొండపైన పశుపతినాథ ఆలయం ఉంది. ఈ లింగాల బండపై అరుదైన శివలింగం ఉంది. ఇక్కడ ఉన్న శివలింగానికి నలువైపులా శివుని వాహనమైన నంది ముఖం బొమ్మ ఉంది. ఈ అరుదైన లింగం చాళుక్యుల కాలం నాటిదిగా చెబుతారు.

5-Temple

ఇక దశభుజ గణపతి ఆలయ విషయానికి వస్తే ఇక్కడ ఆది, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇలా ఇక్కడ పదిచేతులవాడు కావడంతో దశభుజ గణపతి గా, కోరికల్ని సిద్ధింపజేస్తూ సిద్ధి వినాయకుడిగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR