ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దులలో దాదాపు 85 మైళ్ళ దూరం ప్రవహిస్తున్న అతి ప్రాచీనమైన మహానది తుంగభద్రా నది. ఈ నది అత్యంత పురాతనమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే తుంగభద్రా నది రామాయణ కాలముకంటే ముందు నుండే ఉండేదని చెప్పడానికి ఆధారాలున్నాయి.
వాల్మీకి రామాయణములో శ్రీరాముడు సీతాన్వేషణ చేస్తూ సుగ్రీవునితో చెలిమి చేసిన ఋష్యమూక పర్వతము తుంగభద్రా నది తీరంలోనే ఉంది. అది ప్రస్తుత హంపి క్షేత్రములో ఉన్నది. రామాయణములో పేర్కొన్నందున తుంగభద్రా నది రామాయణ కాలముకంటె ముందునుంచే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో అనేక ఔషధ గుణాలు కలిగిన వృక్షాలు ఉన్నాయని ఈ వృక్షాల మీదుగా ప్రవహించిన నీరు ఔషధ లక్షణాలను కలిగి ఉన్నదని చెబుతారు. ఉత్తరాదిన గంగ ఎంత ముఖ్యమైనదో, పవిత్రమైనదో దక్షిణమున తుంగ అంతటి ముఖ్యమైన, ఔషధ గుణాలు గల నీరు కలిగినదని ప్రఖ్యాతి పొందింది. అందువలనే గంగా స్నానము తుంగా పానము అనబడే నానుడి పుట్టింది.
భారతదేశపు పశ్చిమ కనుమలలో పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రములోని సహ్యాద్రి పర్వతముల మీదుగా ప్రవహించి గంగ మూల వద్ద మొదటగా తుంగ, భద్ర లు రెండు వేరు వేరు నదులుగా పేరొంది అక్కడ నుండి తూర్పు దిశగా ప్రవహిస్తూ కర్ణాటక రాష్ట్రంలో కూడలి వద్ద ఒకటిగా కలిసి తుంగభద్ర నదిగా రూపాంతరము చెందింది.
అటువంటి పవిత్ర తుంగభద్రమ్మ చెంతలో పుష్కరుడు తేదీ.20.11.2020 (శుక్రవారము) నాడు చేరి తేదీ.01.12.2020 (మంగళవారము) వరకు ఉంటున్నాడు.భారత కాలమానము ప్రకారము దేశము లోని 12 ముఖ్యమైన నదులకు పుష్కరాలు బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయములో వస్తాయి. బృహస్పతి ఆయా రాశుల్లో ఉన్నంతకాలము ఆ నదిలో పుష్కరము ఉన్నట్లు లెక్క.