Home Health టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగే అలవాటు ఉందా? ఇది తెలుసుకోండి!

టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగే అలవాటు ఉందా? ఇది తెలుసుకోండి!

0

చాలామందికి ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం అలవాటు. అసలు కాఫీ నీళ్లు నోట్లో పడనిదే ఏ పని చేయని వాళ్ళు కూడా ఉంటారు. శరీరానికి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని అందించేవి టీ, కాఫీలు. బాగా ఒత్తిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు వీటిని తాగితే ఆ హాయే వేరు. మళ్లీ కొత్త శక్తి వచ్చి తిరిగి పని చేసుకునేందుకు ఉపయోగపడతాయి. అయితే ఇల్లు, ఆఫీస్, హోటల్ లేదా బయట ఎక్కడైనా కాఫీ, టీలు తాగినప్పుడు వాటికి ముందు నీళ్లు తాగే అలవాటు ఎంతో మందికి ఉంటుంది.

bed teaఇంటికి వచ్చినవాళ్లకి టీ, కాఫీలు ఇస్తే, వాళ్లు అడిగి మరీ మంచినీళ్లు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా తాగడం మంచిది కాదన్నది కొంతమంది నమ్మకం. నీళ్లు తాగిన వెంటనే వేడి వేడి టీ తాగడం వల్ల… నాలుక, పళ్లు పాడైపోతాయని వాదన. మరి నిజంగానే అలా జరుగుతుందా…? టీ, కాఫీ తాగే ముందు నీళ్లు తాగితే అసలు ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…

రసాయనశాస్త్రంలో ఆమ్లాలు (యాసిడ్స్), క్షారాలు (ఆల్కలైన్) అని ద్రవాలను విడదీసే రెండు విభాగాలు ఉన్నాయి. అయితే ఏదైనా ఒక ద్రవం ఆమ్లమా, క్షారమా అని తెలుసుకునేందుకు పీహెచ్ విలువ ఉపయోగపడుతుంది. పీహెచ్ స్కేలుపై 1 నుంచి 14 వరకు స్కోర్ ఉంటుంది. 7 కన్నా తక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని ఆమ్లమని, 7 కన్నా ఎక్కువ విలువ ఉంటే ఆ ద్రవాన్ని క్షారమని అంటారు.

అయితే 7 విలువ ఉంటే ఆ ద్రవాన్ని తటస్థ ద్రవమని పిలుస్తారు. ఈ క్రమంలోనే నీటి పీహెచ్ విలువ చూస్తే అది 7 కన్నా ఎక్కువగా, కాఫీ, టీల పీహెచ్ విలువలు 5, 6లుగా ఉంటాయి. కాబట్టి కాఫీ, టీలు ఆమ్లత్వాన్ని (యాసిడిక్) కలిగి ఉంటాయి. నీరు క్షార స్వ‌భావాన్ని క‌లిగి ఉంటుంది. కాఫీ, టీలను తాగితే సహజంగానే అవి ఆమ్ల స్వభావం కలిగి ఉండడం చేత అవి మన పొట్టలో అల్సర్‌లను, పేగులకు పుండ్లను, క్యాన్సర్‌లను కలిగిస్తాయి.

అందువ‌ల్ల వాటిని తాగిన‌ప్పుడు జీర్ణాశ‌యం గోడ‌ల‌పై యాసిడ్ ప్ర‌భావం చూపిస్తుంది. ఇది జీర్ణాశ‌యంపై న‌ష్టం క‌లిగిస్తుంది. కానీ టీ కాఫీ తాగే ముందు నీరు తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలోకి కాఫీ, టీ చేరినా ఆమ్ల స్వ‌భావం ఉండ‌దు. పీహెచ్ స్థాయిలు త‌ట‌స్థంగా ఉంటాయి. దీంతో జీర్ణాశ‌యంపై ఆమ్ల ప్ర‌భావం ప‌డ‌దు. జీర్ణాశయం ఆమ్లాల నుంచి సుర‌క్షితంగా ఉంటుంది. క‌నుక‌నే టీ, కాఫీలు తాగే ముందు నీటిని తాగుతారు.

మన నోటి దగ్గర నుంచి కడుపు దాకా ఉన్న భాగాలని ఏరో డైజెస్టివ్ సిస్టం అని పిలుస్తారు. వేడి వేడి టీ ఈ ఏరో డైజెస్టివ్ సిస్టం లోంచి వెళ్లేటప్పుడు, వీటి మీద ఉన్న సున్నితమైన పొర దెబ్బతినే ప్రమాదం ఉంది. టీకి ముందు మంచినీరు తాగితే ఈ ప్రమాదం ఉండదట. కేవలం టీ అనే కాదు ఏ పదార్థం తీసుకునే ముందైనా గొంతు కాస్త తడుపుకుంటే అది ఏరో డైజెస్టివ్ సిస్టంకి లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది.

వేడి వేడి టీ ఒకేసారి నాలుక మీద పడటం వల్ల, నాలుక మీద ఉండే సున్నితమైన టేస్ట్ బడ్స్ దెబ్బతింటాయి. టీ ముందు నీళ్లు తాగడం వల్ల, నాలుకకి అంత వేడి అనిపించదు. ఇక నోరు డ్రైగా ఉన్నప్పుడు టీ తాగేకంటే, ఓ గుక్కుడు మంచినీళ్లు తాగిన తర్వాత టీ తాగితే… దాని రుచిని పూర్తిగా ఆస్వాదించవచ్చని అంటారు. టీ అలవాటుని ఎలాగూ మార్చుకోలేం. కానీ దానికి మరో చిన్న అలవాటుని జోడించడం వల్ల ఎంత ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఆస్వాదించొచ్చు.

Exit mobile version