రక్తహీనత నేటి యువతరంలో పెద్ద సమస్యగా మారింది. ప్రపంచ జనాభాలో దాదాపు 33% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని ఒక అంచనా. మారుతున్న జీవన విధానంలో సరైన పోష్టికాహారం తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటివి ఇందుకు కారణాలు. రక్తం శరీరంలో తక్కువ ఉంది అంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.
శరీరంలో ఉన్న రక్తంలోని ఎర్రరక్త కణాలు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల రక్తహీనత వస్తుంది. దీనినే అనీమియా అంటారు. ఇలా రక్తహీనత రావడానికి ప్రధాన కారణం మనకు ఐరన్ లోపం ఉండటం. ఎందుకంటే మన శరీరానికి కావల్సిన పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఐరన్ ఉన్న ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది.
మరి శరీరానికి ఐరన్ అందించే ఆహారపదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కోడి, చేప లాంటివి వారానికి కనీసం మూడుసార్లు తీసుకుంటే తగినంత ఐరన్ లభిస్తుంది. ఇది నాన్ వెజ్ తినేవారికి ఒకే మరి వెజిటేరియన్ తినేవారు ఏం తినాలి అంటే కచ్చితంగా మీరు పప్పులు, పల్లీలు, నల్లశనగలు తీసుకోండి. అంతేకాదు అలసందలు వారానికి రెండు రోజులు తీసుకోండి.
ఇంకా చాలా మంది చిక్కుళ్లు తినరు ఇది చాలా ఐరన్ ఇస్తుంది. అలాగే మంచి ఫైబర్ కంటెంట్ ఉండే సోయాబీన్స్ వారానికి మూడు నాలుగు సార్లు తీసుకోవాలి. ఇక ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, గోంగూర తప్పనిసరిగా తీసుకోండి. బెల్లం కూడా వారానికి రెండు మూడు సార్లు తీసుకుంటే మంచిది. వీటితో పాటు విటమిన్ సీ ఉండే ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ఉత్తమం.