కోమటి చిన వేమారెడ్డి వేమనగా ఎలా మారాడో తెలుసా ?

0
436

సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి తన పద్యాలతో విశ్వకవిగా యోగివేమన కీర్తి పొందారు. పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో పద్యాలు, గీతాలు ఆలపించి విశ్వకవిగా, యోగివేమనగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. సుమారుగా 6 వేలు పైచిలుకు పద్యాలను యోగివేమన రచించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. నేటికీ ప్రజలు యోగివేమన పద్యాలను నెమరు వేసుకుంటూ ఉంటారు. కొండవీటి రాజైన వేమారెడ్డి యోగి వేమనగా ఎలా మారారు?

Do you know how Komati Chinna Vemareddy became Vemana?ప్రజా కవి యోగి వేమన క్రీ.శ. 1328-1428 సంవత్సరాల మధ్య కాలంలో కొండవీటి రెడ్డిరాజుల చివరి పాలకుడు రాజవేమారెడ్డి సోదరుడు. ఈయన అసలు పేరు బెదమ కోమటి చిన వేమారెడ్డి. ఈయన అన్న పేరు బెదమ కోమటి పెదవేమారెడ్డి. అప్పటి కడప,కర్నూలు,అనంతపురం కలిపి ఒకే రాజ్యంగా ఉండేది. దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి. అతని మంత్రి తురగారాముడు. తురగారాముడు ఎలాగైనా అన్నదమ్ములనిద్దరినీ చంపి తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉండేవాడు.

Vemanaమనం వేమనగా పిలుచుకునే చినవేమారెడ్డిని మహా ధైర్యవంతుడు. పేరుకు అన్నగారు రాజు, కానీ మొత్తం రాజ్యం వేమన ధైర్యసాహసాల కనుసన్నులో ఉండేది. అందుకే తురగారాముడు ముందు వేమనను మట్టు బెడితే గానీ తన పని సులువు కాదని, తన దృష్టిను వేమన మీద ఉంచుతాడు. వేమన యుక్త వయసులో వేశ్యాలోలుడుగా ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే ఈయన ముందు వెళ్ళేవాడు. వేమనకు విస్వద అనే ఒక ప్రేయసి కూడా ఉండేది. వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు తన రాజ్యం గురించి, తాను నిర్వర్థించాల్సిన ధర్మం గురించి హెచ్చరిస్తుంది. కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు. తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది,కానీ ఫలితం ఉండదు. ఆ సమయంలో మాంచాల నాగులు అనే మహా అందెగత్తె భోగమేళం ప్రారంభిస్తుంది. ఆమె గురించి ఆ నోటా ఈ నోటా వేమనకు చేరుతుంది. వేమన కూడా ఆమె అందానికి దాసుడై పోతాడు. ఇక తన మకాం పూర్తీగా నాగుల యింటికి మారుస్తాడు. ఓ ప్రేయసీ కంటే ఎక్కువగా అభిమానిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న విస్వద, వేమనకు సత్యం చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.

Vemanaవేమన నాగుల కి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన తురగారాముడు వెళ్లి నాగులను లోబర్చుకుంటాడు. సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం చేయవలసిందిగా చెబుతాడు. దానికి గానూ ఆమెకు డబ్బు,జాగీరు ఎరగా చూపుతాడు. చెయ్యకపోతే తానే వేమనను చంపి ఆ అభియోగం నీమీదికి తీసుకొస్తానని బెదిరిస్తాడు. చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది. ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో వున్నప్పుడు తాగమని ఇస్తుంది. వేమన నాగులు ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు. అంతే పూర్తీగా మత్తెక్కి కోమాలోకి వెళ్ళిపోతాడు. నాగులు తురగారామునికి పని పూర్తీ అయిందని కబురు బెడుతుంది. తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో వేయించేస్తాడు. విషప్రయోగం కారణంగా అడవిలో అపస్మారస్థితిలో పడి ఉన్న వేమనను అభిరాముడు అనే కంసాలి రక్షిస్తాడు. అభిరాముడు అడవులలో దొరికే ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు. తనకు తెలిసిన విద్యతో అపమారక స్థితిలో ఉన్న వేమనకు వైద్యం చేస్తాడు. అయితే మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు. ఏ వివరాలు అడిగినా చెప్పేవాడు కాదు. మహా మౌనంగా ఉండేవాడు. నిత్యం విస్వద చెప్పిన సత్యం,నాగులు,తురగారాముడు చేసిన మోసం కళ్ళముందు కదిలేవి.

ఇక ఆకులు, అలముల కోసం అడవులకెళ్లే అభిరాముడు అప్పుడదప్పుడూ తన గురువుగారైన విశ్వకర్మ యోగిని కలిసి జ్ఞానాన్ని తెలిసుకుంటూ ఉండేవాడు. ఒక రోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని,తాను సంపాదించిన జ్ఞానాన్ని ఉపదేశిస్తానని రేపు రావలసిందిగా చెబుతాడు. అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు… దారిమధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతాడు.దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు. అభిరాముడు ఎంతకూ ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండడంతో వేమన బయలుదేరుతాడు. వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళతాడు. విశ్వకర్మయోగి చెందవలసిన వాడు, రావలసిన వాడు రానే వచ్చాడు… అని వేమనను పిలిచి ధ్యాన,జ్ఞాన,విద్యను నేర్పించి, మూడొకన్నును ఉద్దేపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు. ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది. అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు. తాను పొందవలసిన దాన్ని పొందలేక పోయానని బోరున విలపిస్తాడు. వేమన దానికి అభిరామా….దుఃఖించకు,భాధ పడకు… నా ప్రేయసి నా కళ్ళు తెరిపించాలని ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ నేను పెడచెవిన పెట్టాను. ఈ రోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది. విస్వద…అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే వేమన వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను అని చెబుతాడు…విస్వద అభిరామా ఇద్దరూ కలిసి వినరా వేమా… అని నాకు భోధిస్తున్నట్టుగా,చెబుతున్నట్టుగా ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు…అందుకే.. విశ్వదాభిరామా వినురావేమా..!

Vemanaఇప్పటికీ పండిత, పామర భేదం లేకుండా వేమన పద్యాలు వినని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతగా ఆయన పద్యాలు జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. ఆయన రాసిన ప్రతి పద్యం ఒక ఆణిముత్యమే. మూఢనమ్మకాలను, స్వామీజీల మోసాలను ఆనాడే దునుమాడిన సాంఘిక సంస్కర్త, సామాజిక విప్లవకారుడు యోగివేమన. యోగిగా మారిన వేమన.. పద్యాలు, కవిత్వాలు వల్లెవేస్తూ గాండ్లపెంట మండలం కటారుపల్లిలో జీవసమాధి పొందారు. వేమన ఉత్సవాలు ప్రతి ఏటా ఉగాది పండుగ తర్వాత వచ్చే ఆదివారం ప్రారంభమవుతాయి. ఈ సాంప్రదాయం పూర్వం నుంచి కొనసాగుతోంది.

SHARE