Home Health గంజి వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

గంజి వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా ?

0
గంజి నీరు

మన పూర్వికుల జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండేది. మన తాతల కాలంలో ఒకపూట అన్నం తిని మరోపూట గంజిని తాగేవారు. అందుకే మన తాతల కాలంలో మనుషులు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఎక్కువకాలం జీవించేవారు. కానీ మన తరం గంజిని ఎప్పుడో మరిచిపోయాం. రైస్ కుక్కర్ వలన గంజి అనేది లేకుండా పోయింది దానితో ఈ రోజుల్లో గంజి అంటే తెలియని పరిస్థితి. కొంతమంది గంజి ఉపయోగాలు తెలియక పారబోస్తున్నారు. కానీ గంజి వలన చాలా లాభాలు ఉన్నాయి. అన్నం కంటే ఎక్కువ పోషక పదార్థాలు గంజిలోనే ఉంటాయి.

ఇంట్లో అన్నం వండినప్పుడు ఎక్కువ నీటిని పోసి అన్నం మంచిగా ఉడికిన తర్వాత..అందులో మిగిలిన నీటిని జల్లెడ ద్వారా వేరు చేయాలి. గంజి నీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు దానిలో కాస్తంత ఉప్పు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నీరసంగా ఉన్నప్పుడు గంజి నీటిని త్రాగితే శక్తి వస్తుంది. గంజి నీటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి అవసరమయ్యే పోషణ లభిస్తుంది. విటమిన్ల లోపం రాకుండా జాగ్రత్తపడవచ్చు.

కానీ ఇన్ని పోషకాలు ఉన్నాయని తెలియక గంజిని చాలా మంది వృధా చేస్తుంటారు. గంజిలో మన శరీరానికి కావలసిన 8 రకాల ఎమినో యాసిడ్లు ఉంటాయి. అవి మనకు గ్లూకోజ్ కంటే ఎక్కువగా తక్షణ శక్తిని అందిస్తాయి. గంజి తాగడం వలన కండరాలు పునరుద్ధరణ అవుతాయి. అలాగే మనకు ఒక రోజుకు కావలసిన శక్తిని అందిస్తుంది.

ఒక గ్లాస్ గంజిలో కొద్దిగా ఉప్పువేసి కలిపి తాగితే డయేరియా సమస్య నుండి బయట పడవచ్చు. చర్మంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా చల్లారిన గంజిని రాస్తే దురదతో పాటు మంట కూడా తగ్గుతుంది. దురదగా ఉన్న చోట గంజి నీటిని పోసి సున్నితంగా మర్దనా చేయాలి. ఫలితంగా దురదలు తగ్గిపోతాయి.

పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటినైనా తాగించాలి. దాంతోవారికి కావాల్సిన ఆహారం సరిగ్గా అంది శక్తి లభిస్తుంది. పోషణ సరిగ్గా ఉంటుంది. వారి శారీరక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. విరేచనాలు అయిన వారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.

నీరసంగా ఉన్నవాళ్లు గంజిలోకి ఉప్పు లేదా నిమ్మరసం వేసుకుని తాగితే తక్షణమే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో గంజి సహాయపడుతుంది. జ్వరంతో బాధ పడుతున్న వారికి గంజి దివ్యౌషధంలా పని చేస్తుంది. గంజిలో కార్బోహైడ్రేట్లు చాలా ఉన్నాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అలాగే, ఇన్‌ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది. కాలానుగుణ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ జ్వరం సమయంలో గంజి తాగడం వల్ల డిహైడ్రేషన్ ఉండదు. వేసవిలో గంజి డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

విటమిన్ల లోపం సమస్యతో బాధ పడే వాళ్లు గంజిని తాగితే ఆ సమస్యను సులభంగా అధిగమించవచ్చు. అసిడిటీ సమస్యతో బాధ పడే వాళ్లు గంజిని తీసుకుంటే మంచిది. గంజి మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. జీవక్రియ రేటును పెంచుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంతో పాటు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో గంజి సహాయపడుతుంది.

జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతుంటే… గంజి మీకు మంచి మెడిసిన్. గంజి మంచి కండీషనర్ కూడా. షాంపూ పెట్టిన తర్వాత జుట్టు మీద కండీషనర్‌గా వాడండి. ఇది జుట్టు క్వాలిటీని మెరుగుపరుస్తుంది. దీనిలోని అమైనో ఆమ్లాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి.

మనం తలస్నానం చేసిన తర్వత కొద్దిగా గంజిని వెంట్రుకలకు పట్టించి ఒక 10-15 నిమిషాల తరువాత స్నానం చేస్తే వెంట్రుకలు కాంతివంతంగా, ఒత్తుగా, బలంగా పెరుగుతాయి. గంజిలో విటమిన్ బి, సి, ఇలను కలిగి ఉంటుంది. ఇవి జుట్టు పెరుగుదలకు ఉపకరిస్తాయి.

గంజి నీరు స్కిన్ టోనర్‌గా కూడా పనిచేస్తుంది. ముడతల నుండి ముఖాన్ని రక్షిస్తుంది. ఇందుకోసం గంజిని కాటన్ బాల్‌లో తీసుకొని ముఖం మీద మెత్తగా పూసుకుని ఆరనివ్వండి. ఆరిపోయిన తర్వాత శుభ్రం చేసుకోండి.

మొటిమల సమస్యలు ఎదుర్కోవడంలో కూడా గంజి మేలు చేస్తుంది. ఇది మొటిమల కారణంగా ఏర్పడిన ఎరుపు మచ్చలు, వాపు, దురదలను తొలగిస్తుంది. కొత్త మొటిమలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు రోజూ ముఖానికి గంజి పూసుకుంటే ముఖంలో గ్లో పెరుగుతుంది.

 

Exit mobile version