Home Unknown facts భగవద్గీత జయంతి జరుపుకోవడానికి గల పురాణ కథ ఏంటో తెలుసా ?

భగవద్గీత జయంతి జరుపుకోవడానికి గల పురాణ కథ ఏంటో తెలుసా ?

0

భగవద్గీత హిందూ పవిత్ర గ్రంథం. గీతా జయంతి అంటే భగవద్గీత పుట్టినరోజు. భారతదేశం, ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. దేవదేవుడు శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడిగా అవతరించి దుష్టసంహారం గావించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువులను, గురువు, స్నేహితులను చూసిన అర్జునుడి వారితో యుద్ధం చేయడానికి మనసు అంగీకరించదు. ఆ సమయంలో కార్యోన్ముఖుడిని చేయడానికి శ్రీ కృష్ణపరమాత్మ లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. దీనిని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున భగవానుడు అందించాడని నమ్మకం. అందుకే ఆ రోజున ప్రపంచ వ్యాప్తంగా గీతా జయంతిని జరుపుకుంటారు. గీత సాక్షాత్తు భగవానుడి నోటి నుంచి వచ్చింది.

భగవద్గీతఎలాంటి సందేహానికి తావులేకుండా పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్ర గ్రంథం భగవద్గీత. “గీ” అనే అక్షరం త్యాగాన్ని బోధించుతుంది. “త” అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తుంది. గీత అనే రెండుశబ్దాలకు అర్ధం ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్ధం వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశిస్తుంది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి.

ఈరోజు ఆ పవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యం వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించడం అవసరం లేదు మానవాళి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఇప్పటి నుండి చదవండి. ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట. అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతంగా అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు.

ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు. చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను ధరిస్తుంది. ఈ ఆత్మను ఆయుధాలేవీ ఛేదించలేవు. అగ్ని దహించలేదు, నీరు తడుపలేదు, గాలి కూడా ఏమి చేయలేదు. అర్జునా! నీకు కర్మను చేయటంలోనే అధికారం వుంది. కర్మఫలాలను ఆశించటంలో మాత్రం నీకు అధికారం లేదు. కర్మఫలాలకు నీవు కారణం అవ్వకు.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించి, అధర్మం వృద్ధి అవుతూ ఉంటుందో, అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను. సాదు, సజ్జనులను సంరక్షించటం కోసం, దుర్మార్గులను వినాశం చేయడానికి, ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. అన్ని జీవులలోనూ పరమాత్మ ఉన్నాడని, ఎవరిని ద్వేషించినా తనను ద్వేషించినట్టేనని అన్నాడు కృష్ణుడు. భగవద్గీత సారం అర్దమైతే మనం ఎవరిని ద్వేషించము. ఈలోకంలో చెడ్డవారిని ద్వేషించడం మొదలుపెడితే అభిమానించడానికి మంచివారు ఎవరు ఉండరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏవో కొన్ని చెడు లక్షణాలుంటాయి. మనం వ్యక్తిని ద్వేషించడం కాదు, చెడు లక్షణాలను, చెడును ద్వేషిస్తే మనం ఆ లక్షణాలను అలవరచుకోకుండా ఉంటాం.

నిజమైన దేవుడు ఆయనను నమ్మినా, నమ్మకున్నా ఎవరినీ ద్వేషించడు, ద్వేషించమని చెప్పడు. అందరిని మంచిగా బ్రతకమనే చెప్తాడు. గీతలో పరమాత్మ కూడా అందరు సన్మార్గంలోనే బ్రతకాలని బోధిస్తాడు. అందుకే ప్రపంచంలో భగవత్ తత్వం గురించి తెలుసుకోవాలి అనుకునేవారికి గీత ఒక కాంతికిరణం, ఒక ఆశాపుంజం. భగవద్గీతను చదవడం కాదు, అర్ధం చేసుకుంటే మన జీవితం సార్ధకమవుతుంది.

Exit mobile version