చూస్తుండగానే ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఒక్కసారి బయటకు వెళ్ళొస్తే రెండు ఎక్కడలేని నీరసం పొంచుకొస్తోంది. శరీరంలో నీటి శాతం తగ్గడంతోపాటు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే శరీరంలో చలువని పెంచేందుకు మన పూర్వీకులు జావను చేసుకుని తాగేవారు.
ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా వీటి ప్రాధాన్యత మళ్ళీ పెరిగింది. జావ ఆరోగ్యానికి చేసే మేలు తెలిసి దాని వాడకం పెరుగుతూ వస్తోంది. అయితే జావను ఎన్నోరకాలుగా తయారు చేసుకోవచ్చు. అవేంటో వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
రాగిజావ :
రాగిజావను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు మాత్రమే. ముందుగా రెండు చెంచాలు రాగిపిండిని కప్పులో వేసి బాగా కలుపుకోవాలి. అందులో రెండు గ్లాసుల నీళ్లు వేసి.. తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. బాగా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఇష్టమైన వాళ్లు కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయల ముక్కలు వేసుకుని దింపేయాలి. వేడి తగ్గకన్న ముందే బౌల్‌లో జావను తీసుకుని అందులో పెరుగు కలుపుకొని తాగితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక వేళ రాగిజావ కాస్త తియ్యగా చేసుకోవాలంటే రాగి పిండిలో బెల్లం ముక్క వేసుకుని అరగ్లాసు పాలు కలిపి ఉడికించుకోని తాగాలి.
ఉపయోగాలు:
క్యాల్షియం:
ఇతర గింజల్లో వేటిలో లేనంత క్యాల్షియం నిల్వలు రాగుల్లో వుంటాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎముకల పుష్టి కోసం కొందరు క్యాల్షియం మాత్రలను వాడుతుంటారు. వాటికి బదులు రోజూ రాగి జావ తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. పిల్లలు పుష్టిగా, వారి ఎముకలు బలంగా వుండాలంటే రాగి జావ ఇస్తుండాలి.
అధిక బరువును అడ్డుకుంటుంది:
రాగుల్లో కొవ్వు తక్కువ కనుక అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటుంటే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం కాకుండా రాగులు తీసుకుంటుంటే బరువు కంట్రోల్ అవుతుంది. అమినో ఆసిడ్లు వుండటం వల్ల అధిక బరువు వున్నవారు బరువు తగ్గి మామూలు స్థితికి వచ్చే అవకాశం వుంటుంది.
బ్లడ్ షుగర్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది:
అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్, ఫైబర్ వుండటం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో వుంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
రాగులు ట్రైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా చేసి గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. హార్ట్ ఎటాక్స్ గానీ, స్ట్రోక్స్ గానీ రాకుండా చేస్తాయి. ఎలాంటి వారికైనా ఈ రాగులు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఇప్పుడు తమ ఆహారంలో చేర్చుకుని ప్రయోజనాలను పొందుతున్నారు. రాగి మాల్ట్, రాగి లడ్డూ, రాగి హల్వా, రాగి పకోడా, రాగి బిస్కెట్లూ, రాగి దోసె, రాగి సంకటి లాంటివి కూడా ఆరోగ్యానికి మంచి చేసేవే.