ఉలవలు నవ ధాన్యాల్లో ఒకటి. మన దేశంలో వీటి పేరు తెలియని వారుండరు. ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఉలవలు ఇంట్లో తినడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఉలవలు గుగ్గిళ్ళుగా చేసుకొని తినడమో లేక చారు తయారుచేసుకుని వాడడమో చేస్తే వారు పేదవారై ఉండేవారు. కానీ ఉలవచారు నేడు అత్యంత ఖరీదైన వంటకం. దీనిని విందు వినోదాలలో వాడడం స్టేటస్ సింబల్ గా భావిస్తున్నారు.
ఉలవ గుగ్గిళ్ళు, ఉలవచారు తెలుగు వారికి అత్యంత ప్రియమైన వంటకాలు. అంతేకాదు ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి ఉలవల వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… ఉలవలు మంచి ప్రొటీన్లను కలిగి ఉండడం వల్ల నీరసాన్ని పోగొడుతాయి. రక్తహీనతతో బాధపడేవారు ఉలవలు తరచూ ఆహారంలో తీసుకుంటే మంచిది. ఉలవలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అజీర్తిని పోగొడుతుంది. కడుపులో వాతమును త్వరగా తగ్గిస్తుంది. అజీర్తి విరేచనాలు అయ్యేవారు ఉలవచారు వాడటం వల్ల మేలు జరుగుతుంది.
ఉలవల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి చక్కని పోషణను అందిస్తాయి. వీటిలో ఫైబర్ ఉండడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఉలవలను తీసుకోవడం వల్ల పీరియడ్స్ సరిగ్గా రాకపోవటం, క్రమం తప్పటం వంటి ఋతు సంబంధ సమస్యలు రావు. అధికంగా చెమటలు పడుతున్న వారు ఆహారంలో ఉలవలు వాడటం వల్ల చెమటలు హరించిపోతాయి.
ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వారి శరీర నిర్మాణానికి పనికొస్తాయి. ఉలవల్లో ఆకలిని పెంచే గుణాలు ఉంటాయి. అందుకే దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. మూత్ర పిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి.
ఉలవలను రెగ్యులర్‌గా తింటుంటే శరీరంలో ఉన్న కొవ్వు క్రమంగా కరిగి అధిక బరువు తగ్గుతారు. ఒక కప్పు ఉడికించిన ఉలవలను ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. ఉలవలు తింటే అస్సలు కొవ్వు చేరదు. అందుకే అన్ని వయసుల వారూ నిశ్చింతగా వీటిని తినొచ్చు.
ఉలవలను, బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమం తప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతుంది. వేసవిలో సెగ గడ్డల సమస్య ఎదురైతే ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపు కలిపి పై పూతగా వేస్తే మరునాటికి గడ్డ సమసిపోతుంది.