Home Unknown facts ఢాకేశ్వరిదేవి ఆలయ చరిత్ర ఏంటో తెలుసా ?

ఢాకేశ్వరిదేవి ఆలయ చరిత్ర ఏంటో తెలుసా ?

0
history of Dhakeshwari Devi Temple

కాళికామాత అనంత శక్తిదాయిని అయిన హిందూ దేవత. కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్ధాలున్నాయి. శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించేదిగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణి గా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు. అటువంటి కాళికామాతకు భారతదేశంలో ఎన్నో ఆలయాలు విరివిగా ఉన్నాయి. అలాగే బాంగ్లాదేశ్ లో కూడా అమ్మవారు ఇప్పటికీ పూజలందుకుంటున్నారు.

బంగ్లాదేశ్ రాజధాని, ఢాకా జిల్లా ప్రధాన నగరం. ఢాకా ఒక మహా నగరం, దక్షిణాసియా లోని పెద్ద నగరాలలో ఒకటి. ఇది బురిగంగా నది ఒడ్డున ఉంది, ఈ నగర జనాభా కోటీ ఇరవై లక్షలు, బంగ్లాదేశ్‌లో అత్యంత జనాభాగల నగరం. దీని సాంస్కృతిక చరిత్రను చూసి, దీనిని “మసీదుల నగరం” అని కూడా పిలుస్తారు. అటువంటి స్థలాన్ని ఢాకేశ్వరిదేవి పేరు మీదుగా ఢాకా అని పిలవడానికి కారణం ఉంది.

ఈ నగరానికి ఢాకా అన్న పేరు రావడానికి కారణం ఏమిటన్న విషయం మీద చాలా వాదనలే ఉన్నాయి. వాటిలో ప్రముఖమైన వాదన ఢాకేశ్వరి దేవి ఆలయం. ఢాకాలో ఉన్న ఈ ఆలయం మీదుగానే ఆ ఊరికి ఆ పేరు వచ్చిందని అంటారు. ఇంతకీ ఎవరా ఢాకేశ్వరి దేవి? ఏమిటా ఆలయ చరిత్ర? తెలుకునే ప్రయత్నం చేస్తే, ఆసక్తికరమైన విశేషాలు చాలానే వినిపిస్తాయి.

రాజులు పాలిస్తున్న రోజుల్లో బంగ్లాదేశ్‌ను పాలించిన రాజవంశాలలో ‘సేన వంశం’వారిది ఒక ప్రత్యేకత. అధికారంలో ఉన్నది 150 ఏళ్లే అయినా, వారి ప్రభావం బంగ్లాదేశ్‌ మీద బాగానే ఉంది. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న నవదీప్ రాజధానిగా సాగిన వీరి పాలనలో హైందవ మతానికి అధిక ప్రాధాన్యత ఉండేది. వారి పాలనలో ఇప్పటికీ గుర్తుండిపోయే అంశం ‘ఢాకేశ్వరి దేవి’ దేవాలయం. సేన వంశానికి చెందిన బల్లాలసేనుడనే రాజు, 12వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి.

ఇప్పుడున్నవారికి ఢాకేశ్వరి దేవి ఆలయం వెనుక ఉన్న కథ ఏమిటో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యం ఉండేదట. ఆ అరణ్యంలో ఓ చోట ఢాకేశ్వరి దేవి ఉన్నట్లు బల్లాలసేనునికి కల వచ్చింది. తరువాతి రోజు ఆ ప్రదేశాన్ని తవ్వించిన రాజుకి అక్కడ అమ్మవారి విగ్రహం బయటపడింది. దాంతో అక్కడే ఓ బ్రహ్మాండమైన ఆలయాన్ని నిర్మించారు. ఢాకేశ్వరి వెలసిన ఈ ప్రదేశం శక్తిపీఠాలలో ఒకటని బంగ్లా హిందువుల నమ్మకం. అమ్మవారి కిరీటంలోని మణి ఇక్కడ పడిందని ఇక్కడి వాళ్ళ నమ్మకం.

ఆనాటి నుండి ఇప్పటి వరకు ఆలయం ఉందంటే అమ్మవారి మహిమ అనే చెప్పాలి. ఎందుకంటే ఢాకేశ్వరి దేవి ఆలయం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. విదేశీయులు దండయాత్ర చేసిన ప్రతిసారీ, ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తూ వచ్చారు. ఇక 1971లో బంగ్లాదేశ్‌ మీద పాకిస్తాన్‌ సైనికులు జరిపిన దాడిలో ఆలయం మరింతగా దెబ్బతిన్నది. బాబ్రీమసీదు కూల్చివేత సందర్భంలోనూ, దుండగులు ఈ ఆలయాన్ని నేలమట్టం చేసే ప్రయత్నం చేసారు. ఇన్ని దాడులని ఎదుర్కొని కూడా ఢాకేశ్వరీ దేవి ఆలయం అలనాటి భక్తి ప్రాభవానికి గుర్తుగా మిగిలింది.

ఢాకేశ్వరి ఆలయంలో పదిచేతులతో కనిపించే కాళికా అమ్మవారితో పాటు, వాసుదేవుని విగ్రహం, శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఆలయం నిర్మించిన కొత్తలో ఇక్కడ బంగారు విగ్రహం మూలవిరాట్టుగా ఉండేదట. దాడులకు భయపడి ఆ విగ్రహాన్ని పశ్చిమబెంగాల్‌కు తరలించినట్లు చెబుతారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ముస్లింల సంఖ్య అధికం. కానీ ఈ గుడికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ ఆలయాన్ని ‘బంగ్లా జాతీయ మందిరం’గా ప్రకటించారు. దసరా, జన్మాష్టమిలాంటి రోజులలో ఈ ఆలయంలో మంచి సందడి కనిపిస్తూ… పూర్వ వైభవాన్ని గుర్తుచేస్తు కనువిందు చేస్తుంది.

ఢాకేశ్వరి దేవి ఆలయానికి ప్రాభవం తగ్గిపోయి ఉండవచ్చు. మునుపటిలా భక్తులు పోటెత్తకపోవచ్చు. కానీ బంగ్లాదేశ్‌లో అత్యంత ప్రముఖమైన హిందూ ఆలయం ఏది అంటే దీనినే పేర్కొంటారు. అందుకే ప్రధాని మోదీ సైతం బంగ్లాదేశ్‌కు వెళ్లినప్పుడు, ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఢాకేశ్వరి ఆలయం ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా, చరిత్రలో దాని ప్రధాన్యతని మర్చిపోలేం. బంగ్లాదేశ్‌లో ఢాకా అనే ఊరు ఉన్నంతవరకూ, ఢాకేశ్వరి పేరుని ఎవ్వరు మర్చిపోలేరు.

 

Exit mobile version