Home Unknown facts గోవును పూజించడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా ?

గోవును పూజించడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుసా ?

0

భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ కూడా ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడుతుంది. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నాయి.

ఒక గోవును దానం చేస్తే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుంది. కపిల గోవును దానం చేస్తే ఏడు తరాలను తరింపజేస్తుంది. గోదానం చేస్తే పితృ దేవతలు ఘోరమైన వైతరణి నది దాటి స్వర్గానికెళతారని శాస్త్రంలో చెప్పబడింది. ఆషాడ శుద్ద ఏకాదశి (తొలి ఏకాదశి) రోజున గో పద్మ వ్రతం చేస్తే విశేష ఫలితం కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఎండ వల్ల, వడ గాడ్పులప్పుడు , చలి గాలులు వీస్తున్నప్పుడు, వర్షం వచ్చినప్పుడు ముందుగా నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు గోవును రక్షించు అని సామెత ఉంది.

ఒకానొకప్పుడు పార్వతీదేవి కైలాసమున పరమశివుని భక్తితో పూజించి, నాథా! స్త్రీలు తెలిసి తెలియక ముట్లు, అంటు కలిపిన దోషం, పెద్దలను, బ్రాహ్మణులను, భక్తులను దూషించిన దోషం, పరులను హింసించిన పాపం ఏ విధముగా పరిహారమగునో చెప్పవలసినదిగా ప్రార్థిస్తుంది. అప్పుడు దయామయుడగు పరమశివుడు ఓ పార్వతీ! గోవునందు సమస్త దేవతలు కలరు. అట్టి గోవును పూజించిన సర్వపాపములు నశించును అని చెబుతాడు.

గోవు పాదమునందు ఋణ పితృ దేవతలు, గొలుసులు, తులసి దళములు, కాళ్ళలో సమస్త పర్వతాలు, మారుతీ కూడా కలరు. నోరు లోకేశ్వరం, నాలుక నాలుగు వేదములు, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాన గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళలో సూర్య చంద్రులు, చెవులలో శంఖు-చక్రాలు, కొమ్ములలో యమ, ఇంద్రులు ఉన్నారు.

కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురమున బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ, ప్రయాగ నదులు ఉండును. ఉదరమున పృద్వీ దేవి, వెన్నున భరద్వాజ, కుబేర, వరుణ, అగ్ని మొదలగు దేవతలు ఉన్నారు. ఉదరమున సనక, సనంద, సనత్‌ కుమారులు, తోకన చంద్రుడు, తోక కుచ్చున సూర్య కిరణములను, తోలు ప్రజాపతి, రోమావళి త్రిశంత్కోటి దేవతలు పిరుదుల యందు పితరులు, కర్రి కావేరిబోలు, పొదుగు పుండరీకాక్షుని బోలు, స్తనాలు,సప్త సముద్రాలు, పాలు సరస్వతి నది, పెరుగు నర్మదా నది, నెయ్యి అగ్ని, బొడ్డున శ్రీకమలం, అమృతం కడుపులో ధరణీ దేవతలు, గోపచింత గంగ, యమున, ప్రయాగ, త్రివేణి నదుల తీర్థం, గోమయంలో శ్రీ మహాలక్ష్మి కలదు.

యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు. గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేసిన భూ ప్రదక్షిణంతో సమానం. గోవును పూజించితే సమస్త దేవుళ్ళను పూజించి నట్లవుతుంది. ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గోపూజ చేసినవారు సమస్త పాపముల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యమును పొందుతారు. కార్తీక బహుళ ద్వాదశిని గోవత్స ద్వాదశి అంటారు. ఆ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యములు పొందుతారు.

 

Exit mobile version