Home Unknown facts మన దేశంలో నవగంగలు కలిసే పవిత్రమైన పుష్కరిణి ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో నవగంగలు కలిసే పవిత్రమైన పుష్కరిణి ఎక్కడ ఉందో తెలుసా?

0
navagangalu
భగీరథుడు కపిల ముని శాపం వల్ల  భస్మమైన తన పితురులకు మోక్షప్రాప్తి కలిగించడానికి తపమాచరించి బ్రహ్మలోకం నుండి భూలోకానికి గంగానదిని తీసుకువచ్చాడు. గంగానది బ్రహ్మలోకం నుండి మేరురూపుడైన విష్ణువు నుండి సూర్యుని నుండి చంద్రుని నుండి శివుని జటాజూటం నుండి హిమవంతం నుండి భూమి మీదకు ప్రవహిస్తుంది.
 అలాంటి గంగా నదిలో స్నానం చెయ్యటమే మహా పవిత్రం అంటారు. అలాంటిది నవగంగలు కలిసిన పుష్కరిణిలో స్నానం చేస్తే ఇంకెంత పుణ్యమో కదా. నవగంగలు ఏంటి ఒకే దగ్గర కలవటం ఏంటి అని ఆలోచిస్తున్నారా. 1.గంగ 2.యమున 3.సరస్వతి 4.నర్మద 5.గోదావరి 6.కావేరి 7.మహానది 8.పయోష్ణ  9.సరయు ఈ తొమ్మిది నదులని నవగంగలుగా వర్ణించటం జరిగింది. ఈ నదులన్నీ పన్నెండేళ్ళకోసారి మహామఘం అనే పుష్కరిణిలో వచ్చి కలుస్తాయని ప్రతీతి.
 ఈ మహామఘం అనే పుష్కరిణి తమిళనాడులోని కుంభకోణం అనే పట్టణంలో ఉంది. ద్వాపరయుగం అంతమయ్యే కాలంలో ఆకాశంలో వెళ్తున్న అమృతభాండాన్ని వేటగాడి రూపంలో ఉన్న శివుడు బాణంతో కొడితే ఆ భాండం ముక్కలుగా విరిగి నేలమీద పడిందట. ఆ ప్రదేశమే కుంభకోణం.
 అలా విరిగిపడిన అమృతభాండపు ముక్కలు వివిధ శివలింగాలుగా రూపుదాల్చాయట. కుంభకోణం పరిసర ప్రాంతాల్లో ఉన్న కుంభేశ్వర, సోమేశ్వర, చక్రపాణి, సారంగపాణి మొదలైన ప్రాంతాల్లో పడిన లింగాలు ప్రస్తుతపు ఆలయాల లాగా రూపుదిద్దుకున్నాయట. గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండం లో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుకతో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల కుమ్భేశ్వరుడయ్యాడు. అందుకని ఇక్కడ నిత్యాభిషేకాలు ఉండవు.
 సుగంధ ద్రవ్యాలనే లేపనంగా పూస్తారు. శివుడి ఆకారం కూడా కుండ మూతిలాగా ఉండటం ఇక్కడి ఒక విశేషం. చైత్ర మాసంలో సూర్యకిరణాలు శివలింగం మీద పడటం ఇంకొక విశేషం. ఇక్కడ అమ్మవారిని మంగళాంబిక అనే పేరుతో కొలుస్తారు.
 ఆరున్నర ఎకరాలలలో విస్తరించిన ఈ పుష్కరిణిలో 21 బావులు ఉన్నాయట. చుట్టూ రాతిమెట్లు ఇంకా 16 మండపాలు కొలువుతీరి ఉన్నాయి. ప్రతి పన్నెండేళ్ళకి మాఘమాసంలో గురుడు సింహ రాశిలో ప్రవేశించినప్పుడు ఈ మహామాఘ పుష్కరాలు జరుగుతాయి. ఈ సమయంలో నవగంగలు మాత్రమే కాకుండా దేశంలో ఉన్న అన్ని నదుల నీరు వచ్చి ఇక్కడ కలుస్తుందని ఒక నమ్మకం.
 అందుకే పుష్కర సమయంలో కుంభకోణంలో  దేవాలయాలన్నిటి నుండి ఉత్సవమూర్తులను ఇక్కడికి తీసుకువచ్చి స్నానం చేయిస్తారు. అదే సమయంలో భక్తులు కూడా మూడు మునకలు వేసి స్నానం ఆచరిస్తారు. ఈ ఒక్కరోజే కనీసం పదిలక్షల మంది భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి ఇక్కడి స్వామిని దర్శించుకుంటారని ఒక అంచనా. పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ప్రసాదించే పుష్కర స్నానం ఎవరికీ మాత్రం చేయాలని ఉండదు.

Exit mobile version