Home Health చూయింగ్ గమ్ మింగితే పేగులకు అతుక్కుపోతుందా?

చూయింగ్ గమ్ మింగితే పేగులకు అతుక్కుపోతుందా?

0
chewing gum
మీరు ఎప్పుడైనా చూయింగ్ గమ్ నములుతుంటే పెద్దవాళ్ళు వద్దని వారించారా…? చూయింగ్ గ‌మ్ న‌మ‌ల‌డం చాలా మందికి ఉన్న కామ‌న్ అల‌వాటు.పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా కోట్ల మంది త‌ర‌చూ చూయింగ్ గ‌మ్ న‌ములుతుంటారు. అయితే పెద్ద‌లు మాత్రం చూయింగ్ గ‌మ్ న‌మ‌ల‌డం ఆరోగ్యానికి మంచిది కాద‌ని.ఒక‌వేళ దానిని పొర‌పాటున మింగేస్తే క‌డుపులో పేగులు అతుక్కుపోతాయ‌ని ఏవేవో చెబుతుంటారు.
మనం కూడా చిన్నప్పటి నుంచి చూయింగ్ గమ్ మింగేస్తే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని ఎన్నో కథనాలు వినే ఉంటాం. ఈ విషయమై ఎన్నో రకాల అపోహలు ప్రజలలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూయింగ్ గమ్ పొరపాటున మింగేస్తే అది కడుపులో ఏడు సంవత్సరాల పాటు అరగకుండా ఉండిపోతుందని.. మరికొందరైతే కడుపులో పేగులన్నింటికీ అది అతుక్కుపోయి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుందని.. ఇక ఏమీ తినడానికి కుదరదని.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు చెప్పి భయపెట్టేవాళ్లు..
ఇంతకీ చూయింగ్ గమ్ మింగేస్తే అసలు ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?? పిండి పదార్ధం, రంగులు, చక్కెర లేదా తీపిని పెంపొందించే పదార్ధములు, సువాసనలు వెదజల్లే ద్రవాలు, కొవ్వులు, రెసిన్లు, మైనం, ఎలాస్టోమర్లు మరియు మిశ్రమద్రావణమును స్థిరపరుచు పదార్థములు( ఎమెల్సీఫైర్ ) ఇలా ఎన్నో పదార్ధాలు బబుల్ గమ్ లో ఉంటాయి.
చూయింగ్ గమ్ లు ఎలాస్టిక్ గా ఉండి అతుక్కుపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. గంటల కొద్దీ నమిలినా వాటి పరిమాణం ఏమాత్రం తగ్గకపోవడానికి కారణం అదే. మన శరీరం చూయింగ్ గమ్స్ ని అరిగించుకోలేదు అనేది నిజమే అయితే మన పేగులకు అది అంటుకుపోతుందని లేక కడుపులోనే కొన్ని సంవత్సరాలు ఉండిపోతుందని చెప్పింది మాత్రం అబద్ధమే..
చాలామందికి ఇలాంటి అపోహే ఉంటూ ఉంటుంది. మన పొట్టలోకి వెళ్లిన ప్రతి ఆహారాన్ని అరిగించేందుకు జీర్ణాశయం ఎంజైమ్స్ విడుదల చేస్తుంది. అక్కడ ఆహారం అరిగిపోయి పోషకాలుగా మారి రక్తంలోకి ప్రవేశిస్తుంది. అరగని కొన్ని పదార్థాలు పేగుల ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మనం చూయింగ్ గమ్ తిన్నప్పుడు దాన్ని అరిగించే శక్తి శరీరానికి లేకపోవడం వల్ల మిగిలిన ఆహారంతో పాటు మలం ద్వారా అది బయటకు వెళ్లిపోతుంది.
ఇలా వెళ్లడానికి 12 నుంచి 48 గంటల వరకూ పట్టే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు రోజుల సమయం కూడా పట్టవచ్చు. అందుకే అనుకోకుండా చూయింగ్ గమ్ మింగినట్లైతే నీళ్లు ఎక్కువగా తాగడం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల దాన్ని తొందరగా శరీరం నుంచి బయటకు వెళ్లిపోయేలా చేయవచ్చు.
అయితే చూయింగ్ గమ్ తినడం వల్ల ఎలాంటి హాని లేదా? అని అడిగితే ఉందనే చెప్పాలి. చాలా అరుదుగా కొన్ని కేసుల్లో దీనివల్ల మన పేగుల్లో ఇబ్బంది ఏర్పడవచ్చు. మలబద్ధకంతో బాధ పడుతున్న వారు, చాలా ఎక్కువ మోతాదులో చూయింగ్ గమ్ ని మింగినప్పుడు అది పేగుల్లోనే ఉండిపోయి పేగులు బ్లాక్ అయ్యేందుకు కారణంగా మారతుంది. అందుకే చిన్న పిల్లలను చూయింగ్ గమ్ లకు దూరంగా ఉంచేందుకు పెద్దలు ప్రయత్నిస్తుంటారు. చాలా అరుదైన కేసుల్లో చూయింగ్ గమ్ మింగడం వల్ల వాంతులు, కడుపు నొప్పి, మలబద్ధకం, విరేచనాలు వంటివి అవుతుంటాయి.
కొంత మందిలో దద్దుర్లు మరియు దురద వంటి లక్షణాలు కనపడుతుంటాయి. బబుల్ గమ్ లో వాడే పదార్ధాల వల్ల కొన్ని రకాల ఎలర్జీలు కూడా వస్తాయి. అందుచేత బబుల్ గమ్ గనుక మింగినట్లైతే, అంటువంటి సమయంలో ఇటువంటి విపరీతమైన లక్షణాలు మీలో కలుగుతుంటే వైద్యుడ్ని ఖచ్చితంగా కలవండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా మీ శరీర ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగిపోతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.  శరీరం బబుల్ గమ్ ని బయటకు పంపడంలో ఇబ్బంది పడుతుంటే, అటువంటప్పుడు రక్తపోటు కూడా పెరుగుతుంది.

Exit mobile version