Home People సర్వే పల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు

సర్వే పల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు

0

భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి, స్వాత్యంత్రం వచ్చిన తరువాత రాజ్యసభలో మొదటగా జవహర్ లాల్ నెహ్రు ప్రసగించగా ఆ తరువాత ప్రసంగించి అందరిని ఆకట్టుకున్న వ్యక్తి, ఒక గొప్ప మహాతత్వవేత్త, స్వతంత్ర భారతదేశంలో ఉన్నత విద్యావిధానం రూపకల్పన చేసిన ఘనత, ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్న భారతరత్నం డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణన్ గారు. మరి ఆయన జీవితం ఉపాధ్యాయవృత్తి నుండి దేశ రాష్ట్రపతి గా ఎలా సాగింది? ఆయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం వెనుక కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sarvepalli Radhakrishnanశ్రీ సర్వే పల్లి రాధాకృష్ణన్ గారు 1888లో సెప్టెంబర్ 5వ తేదీన మద్రాస్ లోని తిరుత్తణి లో వీరాస్వామయ్య, సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరిది మాతృబాష తెలుగు, అయితే రాధాకృష్ణన్ గారి తండ్రి ఒక జమీందారీలో తహసిల్దార్. ఆయన బాల్యంలో ఉపాధ్యాయులు తన తెలివితేటలూ చూసి ఆశ్చర్యానికి గురయ్యేవారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎం.ఏ పూర్తీ చేసిన ఆయన 21 సంవత్సరాల వయసులో మద్రాస్ రెసిడెన్సీ కాలేజీలో లెక్చరర్ గా చేరారు. ఇక ఆయనకి తత్వ శాస్రంలో ఎంతో ప్రతిభ ఉందని తెలుసుకున్న మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్ గా ఆహ్వానించింది. ఆ తరువాత ఆయనలో ప్రతిభను గుర్తించిన డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్లు కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవి చేపట్టమని కోరగా కలకత్తా వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్ కి వెళ్లాలని నిశ్చయించుకొని గుర్రం బండిని సిద్ధం చేసుకోగా, తన ఇంటికి చేరుకున్న విద్యార్థులు తమ గురువు తమని వదిలి వెళుతున్నారని భావించి వీడ్కోలు చెబుతూ బండి కి ఉన్న గుర్రాలను విడిపించి వారే బండిని లాక్కుంటూ రైల్వేస్టేషన్ వరకు తీసుకువెళ్లి వీడ్కోలు చెప్పడంతో ఆయనకి కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ సంఘటనతో ఆయన కీర్తి దేశం మొత్తం వ్యాపించింది.

ఇలా ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో పనిచేస్తూనే భారతీయ తత్వశాస్రం అనే గ్రంధాన్ని వ్రాసాడు. ఈ గ్రంథం ప్రపంచ వ్యాప్తంగా అందరి అభినందనలు అందుకుంది. ఇక తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆయన్ని ఆహ్వానించగా ప్రాచ్య వెళ్ళారు. అంతేకాకుండా ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా వంటి విదేశాల్లో ఉపన్యాసాలిచ్చి మాతృదేశ కీర్తిని ఎంతో పెంచారు. ఇది ఇలా ఉంటె, 1931లో డా.సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలరుగా పనిచేశారు. ఇంకా 1931లోనే రాధాకృష్ణన్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి సభ్యులుగా ఎన్నుకోబడ్డాడు.1936లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవ అధ్యాపకుడిగా పనిచేసారు.

ఇక దేశానికి 1947 ఆగష్టు 14 తేదీ మధ్యరాత్రి స్వాతంత్ర్యోదయం సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతగానో ఉత్తేజపరిచింది. మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నత విద్యావిధానం రూపకల్పన చేసింది రాధాకృష్ణన్ గారే. స్వాత్యంత్రం వచ్చిన తరువాత సోవియట్ యూనియన్ కి తొలి రాయబారిగా రాధాకృష్ణన్ గారిని నియమించారు. భారతదేశం రిపబ్లిక్ గా అవతరించగానే తొలి ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. 1957 వ సంవత్సరంలో రెండవ సారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1962 లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇలా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతున్న సమయంలో ఆయన పుట్టిన రోజు వేడుకలు చేసేందుకు తన శిష్యులు రాగా ఇలా వేడుకలు చేసేకంటే నా పుట్టిన రోజుని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటే చాలా గర్విస్తానని చెప్పడంతో అప్పటినుండి సెప్టెంబర్ 5 వ తేదీని ఆయన పుట్టిన రోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇలాంటి గొప్ప గురువుకి 1954లో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కింది.

రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతిగా 1967 వరకు కొనసాగి పదవి విరమణ తరువాత మద్రాసు లోని మైలాపూర్ లో ఉన్న తన సొంత ఇంట్లో నివసిస్తూ కాలక్రమేణా ఆరోగ్యం క్షిణించిన ఆయన తన 86 వ ఏట 1975 ఏప్రిల్ 17 వ తేదీన కాలధర్మం చెందారు.

గురువు అనే పదానికి వన్నె తెచ్చిన వారిలో డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణన్ ఒకరు. ఇప్పటికి ఆయన పుట్టిన రోజైన సెప్టెంబరు 5 న గురుపూజోత్సవం సందర్భంగా పాఠశాలకు ఉత్తమ సేవలందిచిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారికీ రాష్ట్రపతి అవార్డులు ఇవ్వడం జరుగుతున్నది. ఒక ఉపాధ్యాయునిగా మొదలై దేశానికి రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి ఇప్పటికి ఎప్పటికి ఆదర్శం.

Exit mobile version