Home Unknown facts సంవత్సరంలో ఒకరోజు మాత్రమే గుడి తలుపులు తెరుస్తారు ఎందుకు?

సంవత్సరంలో ఒకరోజు మాత్రమే గుడి తలుపులు తెరుస్తారు ఎందుకు?

0

ప్రతి ఆలయం కట్టడం వెనుక ఏదో ఒక విశేషం అనేది దాగి ఉంటుంది. ఇంకా కొన్ని ఆలయాలలో ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలను మనం వింటుంటాం. అలానే ఈ ఆలయంలో ఆశ్చర్యం ఏంటంటే సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఈ ఆలయంలోని గుడి తలుపులు తెరవబడతాయి. మరి ఈ ఆలయంలో ఎందుకు సంవత్సరంలో ఒకరోజు మాత్రమే గుడి తలుపులు తెరుస్తారు? అసలు ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు రాష్ట్రంలోని, మదురై జిల్లా, మధురై కి దగ్గరలో అళగర్‌ కోవిల్‌ ఉంది. ఇక్కడ వెలసిన విష్ణుమూర్తిని అజాగర స్వామి అని పిలుస్తారు. ఈ స్వామి ఈ ఆలయంలో మూడు భంగిమల్లో అంటే కూర్చొని, నిలుచొని, పరుండియున్న మూడు ఆకారాలలో దర్శనం ఇస్తారు.

మధుర మీనాక్షి దేవిని ఈయన సోదరిగా భావిస్తారు. సుందరేశ్వరునితో ఆమె వివాహము జరుగుతున్నప్పుడు ఆ వివాహం చూద్దామని బయలుదేరి వైగై నది తీరము వరకు వచ్చిన తరువాత, వివాహం అయిపోయిందని తెలిసి స్వామివారు తిరిగి వెళ్ళిపోతారు. అందుకే మధురలో మీనాక్షి అమ్మవారి కళ్యాణోత్సవం జరిగే సమయంలో, ఇక్కడి నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహం తరలివెళ్తుంది. ఈ అళగర్‌ స్వామిని దర్శిస్తే మనసులో కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం. మహాభారతకాలంలో ధర్మరాజు, అర్జునులు సైతం ఈయనని దర్శించారని అంటారు. ఈ ఉత్సవాన్ని ఇక్కడి ప్రజలు చాలా గొప్పగా జరుపుకుంటారు.

ఈ ఆలయం చుట్టూ శిధిలమైన కోటగోడలు, దీని రాచరికాన్ని గుర్తుచేస్తాయి. 180 అడుగుల ఎత్తులో ఉండే ఆలయ గోపురం ఈ ఆలయపు వైభవాన్ని గుర్తుచేస్తాయి. సుందరపాండ్యన్‌ అనే రాజు 13వ శతాబ్దంలో విమానం గోపురం మీద పోయించిన బంగారపు పోత సూర్యకాంతికి మెరిసిపోతుంటుంది. అళగర్‌ కోవిల్‌లోని ఉత్సవ విగ్రహం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది.

అయితే ఈ విగ్రహాన్ని దొంగిలించేందుకు ఓసారి 18 మంది దుండగులు ఈ ఆలయం మీద దాడి చేశారట. అలాంటి దాడికి సిద్ధంగా ఉన్న ఆలయ పూజారులు ప్రతిదాడి చేశారు. ఆ పోరులో 18 మంది దొంగలూ మట్టికరిచారు. ఆ సమయంలో వారికి కరుప్పుస్వామి అనే కావలి దేవత కనిపించి, ఇక మీదట తాను ఈ క్షేత్రాన్ని సంరక్షిస్తుంటానని మాట ఇచ్చాడట.

అళగర్‌ కోవిల్‌ వెలుపల ఉన్న కరుప్పుస్వామి సన్నిధి చాలా శక్తిమంతమైనదని చెబుతారు. సామాన్య భక్తులు ఈ స్వామి ఉగ్రరూపాన్ని చూసి తట్టుకోలేరని అంటారు. అందుకే ఏడాదిలో ఒక్కసారే ఈ ఆలయం తలుపులు తీస్తారు. విచిత్రంగా అలా తలుపులు తీసే సమయంలో పక్షులు, కీటకాలతో సహా చుట్టూ ఉండే అడవులన్నీ ప్రశాంతంగా మారిపోతాయట. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కపోతుందని చెబుతారు.

అళగిరి కోవిల్‌లో తిరుమాళ్‌ స్వామివారితో పాటుగా వారి సతీమణ సుందరవల్లి తాయార్‌ ఆలయం కూడా చూడవచ్చు. వివాహం కాని స్త్రీలు ఈ అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తే ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ఈమెకు కళ్యాణవల్లి తాయార్‌ అన్న పేరు కూడా ఉంది.

ఆలయంలోని ఆ స్వామి ఉగ్రరూపాన్ని సామాన్యులు చూడలేరు కనుక గుడి ఆలయం తలుపులు సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుస్తారని తెలుస్తుంది.

Exit mobile version