Home Unknown facts శివలింగానికి స్త్రీ వలె తలపైన కొప్పు ఉండే ఆలయం ఎక్కడ ఉంది?

శివలింగానికి స్త్రీ వలె తలపైన కొప్పు ఉండే ఆలయం ఎక్కడ ఉంది?

0

మన దేశంలో శివుడు లింగ రూపంలో దర్శనం ఇచ్చే ప్రముఖ ఆలయలు చాలానే ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే శివలింగానికి స్త్రీ వలె తలపైన కొప్పు అనేది ఉంటుంది. మరి ఆ శివలింగం ఎక్కడ ఉంది? అలా ఆ శివలింగం కనిపించడం వెనుక కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఉమాకొప్పులింగేశ్వరస్వామిఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి 3 కి.మీ. దూరంలో ఉన్న పలివెల గ్రామంలో శ్రీ ఉమాకొప్పులింగేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివలింగ ప్రతిష్ట అగస్య మహర్షి చేత జరిగిందని ప్రతీతి.

ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం ఒకప్పుడు ఈ ఆలయ పూజారి శివలింగారాధన చేస్తూ ఉండేవాడు. కానీ ఆ పూజారికి ఒక దురలవాటు ఉంది. అతడు ప్రతిరోజు తన ప్రియురాలికి అలంకరించిన పూలమాలలను తెచ్చి ఈ స్వామివారికి అలంకరించేవాడు. ఒకరోజు ఆ దేశాన్ని పరిపాలించే మహారాజుగారు స్వామివారిని దర్శించి, స్వామికి అలంకరించిన పూల మాలానే ప్రసాదంగా స్వీకరించాడు. అయితే ఆ దండలో ఒక శిరోజం కనబడటంతో రాజు కోపానికి గురై ఇది ఏమిటి అని ప్రశ్నించగా, అప్పుడు పూజారి బయపడి తడబడి ఆ శిరోజం స్వామివారిదేనని, ఆయనకు స్త్రీ వలె కొప్పు ఉందని చెప్తాడు. ఇంకా రేపు ఉదయం నిర్మాల్యం తొలగించాక స్వామివారి కొప్పు చూపెడతానని ఆ క్షణాన్ని తప్పించుకుంటాడు. దాంతో మర్నాడు వస్తానని రాజు వెళ్ళిపోతాడు.

అప్పుడు పూజారి ప్రాణభయంతో శివుడిని అనేక విధాలా ప్రార్ధించి పచ్చాత్తాపంతో రాత్రంతా శివలింగం పైన కన్నీరు కార్చాడు. అయన కన్నీటితో శివలింగాన్ని అర్పించి తనని కాపాడమంటూ వేడుకున్నాడు. అప్పుడు భక్తవత్సలుడైన శివుడు భక్తుడిని కాపాడే ఉద్దేశంతో తన శివలింగం పైన ఉన్న కొప్పులో శిరోజాలు సృష్టించాడు. ఇక మరుసటి రోజున వచ్చిన రాజుగారు శివలింగానికి ఉన్న కొప్పున శిరోజాలు ఉండుట చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో తన తప్పిదాన్ని మన్నించమని రాజు ప్రార్దించగానే శివుడు ప్రత్యక్షమై తన భక్తుడని, రాజుని కూడా దీవించాడని స్థల పురాణం.

ఇక ఆలయ విషయానికి వస్తే, తూర్పున కౌసికి, దక్షిణమున సాంఖ్యాయని, పడమర వశిష్ట, ఉత్తరాన మాండవి మరియు పల్వల అను అంతర్వాహినిగా ఉన్న నదుల మధ్య ఉన్న ప్రదేశంలో నిర్మించబడినట్లు చెబుతారు. ఇక గర్భగుడిలో ఛత్రస్రాకారములో ముందుకు పొడుచుకొని వచ్చిన ఒక భాగం ఉంది. దీనినే కొప్పు అంటారు. అందువలనే ఈ స్వామి కొప్పులింగేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇంకా ఈ ఆలయంలో స్వామివారు మరియు అమ్మవారు ప్రక్కప్రక్కనే ఒకే పీఠంపై ప్రతిష్టింపబడి ఉన్నారు. అందుకే ఈ స్వామివారిని ఉమా కొప్పులింగేశ్వరుడు అని అంటారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఆది దంపతులైన పార్వతి, పరమేశ్వరులు సకుటుంబ సమేతంగా గర్బగుడిలోనే ఒకే పీఠం పై భక్తులు దర్శనం ఇస్తుంటారు.

Exit mobile version