మన దేశంలో అతిపురాతన అద్భుత ఆలయాలు ఉండగా, కొన్ని ఆలయాల్లో మనం చూసే అద్భుతాలకు ఇప్పటికి ఎవరిదగ్గర సమాధానం అనేది లేదు. అలాంటి ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ ఉన్న అద్భుతం ఏంటంటే, శివలింగం అనేది కనిపించదు ఎందుకంటే నెయ్యితో శివలింగం అనేది కప్పబడి ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పటికి వరకు శివలింగం చూట్టు ఉన్న నెయ్యి అనేది కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా కరగలేదు, ఎన్నో రోజుల నుండి ఉంటున్న ఆ నెయ్యి అనేది దుర్వాస అనేది రాలేదు. మరి ఇంతటి అద్భుతం ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయం గురించి మరిన్ని ఆశ్చర్యకర నిజాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేరళ రాష్ట్రం, త్రిచూర్ జిల్లాలో వడక్కునాథన్ ఆలయం ఉంది. ఇది ఒక శివాలయం. ఇక్కడ శివుడు వడక్కునాథన్ గా పూజలను అందుకుంటున్నాడు. అయితే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ఉన్న శిల్పాలు, ఆలయ నిర్మాణ శైలి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. ఈ ఆలయంలో శివలింగం అనేది కనిపించదు ఎందుకంటే తర తరాలుగా ఈ ఆలయ గర్భగుడిలో ఉన్న శివలింగానికి నేతితో అభిషేకం చేస్తున్నారు.
ఈ ఆలయ పురాణానికి వస్తే, పరశురాముడు క్షత్రియులని అంతం చేసిన తరువాత ఒక యజ్ఞం చేసి బ్రాహ్మణులకు దక్షిణ గా తన భూమిని అంత దానం చేసేసి, తానూ తపస్సు చేసుకోవడానికి తగిన భూమిని ఇవ్వమని సముద్రుడిని కోరగా, అప్పుడు సముద్రుడు కేరళ ప్రదేశానికి వెళ్లి తపస్సు చేసుకోమని సూచిస్తాడు. అప్పుడు పరశురాముడు కైలాసానికి వెళ్లి శివపార్వతులను, వినాయకుడిని, సుబ్రహ్మణ్యస్వామిని తన ప్రదేశానికి ఆహ్వానించాడట, అప్పుడు శివుడు ఈ ప్రదేశంలో ఉన్న ఒక మర్రిచెట్టు కింద అదృశ్యమవ్వగా ఆ ప్రదేశాన్ని మూలస్థానం అని పిలుస్తారు. అయితే అక్కడ ఉన్న శివలింగాన్ని చాలా సంవత్సరాల తరువాత కొచ్చిన్ రాజా వంశీయులు ఒక ఆలయాన్ని నిర్మించి ఆ శివలింగాన్ని ప్రస్తుతం ఉన్న ఆలయంలో ప్రతిష్టించారు.
ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, గర్భగుడిలో ఉండే శివలింగాన్ని ఆ కాలం నుండి కూడా నేతితో అభిషేకించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విశేషం ఏంటంటే, ఎప్పటినుండో ఇలా శివలింగానికి నేతితో అభిషేకం చేస్తున్నప్పటికీ ఆ నెయ్యి అనేది కరగడం లేదు, అంతేకాకుండా ఆ నెయ్యి అనేది ఎలాంటి దుర్వాసన అనేది కూడా రావడం లేదు. ఇదంతా కూడా దైవలీలగా భక్తులు భావిస్తుంటారు. ఇక్కడ పురాతన కాలం నుండి శివలింగానికి నెయ్యితో అభిషేకం చేస్తుండగా శివలింగం చూట్టు మూడు మీటర్ల మందంతో నెయ్యి అనేది ఉంటుంది. అందుకే ఈ ఆలయంలో శివలింగం అనేది కనిపించదు.
ఇది ఇలా ఉంటె, ఆలయ గర్భగుడిలో దీపారాధన చేస్తున్నప్పటికీ, వాతావరణ మార్పులు అంటే శివలింగానికి వేడి తగిలిన, సూర్యరశ్మి తగిలిన, ఎండాకాలంలో లో సైతం కొన్ని వేల సంవత్సరాల నుండి శివలింగం చూట్టు ఉన్న నెయ్యి అనేది కరగడం లేదు. మరి ఇలా ఇక్కడ శివలింగం చూట్టు ఉన్న నెయ్యి అనేది ఎందుకు కరగడం లేదని ఇప్పటికి వరకు కూడా ఒక మిస్టరీగానే మిగిలింది.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అనయూట్టు అనే పండగ జరుగుతుంది. ఈ పండుగలో ఏనుగులను అందంగా ముస్తాబు చేసి వాటికీ ఆహారాన్ని పెట్టి ఏనుగులను భక్తితో కొలుస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో చెండావాద్యం జరుగుతుంది. ఈ పండుగలో ఐదు రకాల వాద్యాలను ఉపయోగించి ప్రదర్శన చేస్తారు. ఇంకా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
ఈ విధంగా నేతితో కప్పబడిన ఈ అద్భుత శివలింగాన్ని చూడటానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.