This Guy’s Excellent Analysis On Tollywood Directors Is On Point & Worth Reading

0
2303

Contributed By: ప్రవీణ్ యజ్జల

తెలుగు సినిమాని రామ్ గోపాల్ వర్మకి ముందు, తరువాత అని అంటుంటారు. ఎందుకన్నది మనకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే వర్మతో మొదలుపెడదాం. సినిమాకి సామాజిక బాధ్యత ఉందన్న వాళ్ళు కొందరైతే; జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం అనేవాళ్ళు ఇంకొందరు. ఎవరి దృష్టిలో వారు కరెక్ట్.! ఎందుకంటే సినిమా నుండి ఏది ఆశిస్తే అదే పొందుతారు. అసలు సినిమాల వల్ల ఎవరు ఏమి పొందుతారన్నది కేవలం రచయితల, దర్శకుల ‘అవగాహణ, పరిపక్వత, ప్రాపంచిక దృక్పథం’ మీద ఆధారపడి ఉంటుంది. కొందరు గుంపులో గోవిందలాగ సినిమాలు తీసుకుపోతుంటారు. మరికొందరు ఆ గుంపు ఉనికినే ప్రశ్నిస్తుంటారు. అవసరమైనప్పుడు మార్గనిర్దేశకం చేస్తుంటారు. దీన్నే మరోలా చెప్పాలంటే ప్రేక్షకులు నచ్చే దర్శక, రచయితలు కొందరైతే; చదువర్లు మెచ్చే సినిమాలు మరికొన్ని.! ఈ రెండూ ఒకే దర్శకుడిలో ఉండడం చాలా అరుదు. అలాంటి అరుదైన సినీ మహర్షుల గురించి తెలుసుకోవడంతో పాటు అసలు నిజమైన ‘రచన’ అంటే ఏమిటో చూద్దాం.!

తెలుగు సినిమాలు తీస్తున్నారంటే? తీస్తున్నాం.! చూస్తున్నామంటే? చూస్తున్నాం.! అన్నట్టు నడిచే తెలుగు ప్రాంతీయ సినిమాని దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన ఘణత రామ్ గోపాల్ వర్మకి ‘శివ’ సినిమా ద్వారా దక్కుతుంది.

1 Rgvఆ తరువాత దేశం దాటించి విశ్వవ్యాప్తం చేసిన ఘణత రాజమౌళికి చెందుతుంది. బాహుబలి కథ ఫ్యూడలిజం తాలూకా భావజాలం వల్ల ఆధునిక మేధోవర్గం విమర్శలు గట్టిగానే వినిపించాయి. ఇంత పేరు ప్రఖ్యాతలు, బడ్జెట్ వెసులుబాటు వచ్చాక కూడా రాజమౌళి ఇంకా ముందుచూపు లేకుండా వెనుక చూపుతో చారిత్రక కథాంశాల (RRR) మీద పడడం అయితే ఏమీ బాగోలేదనిపిస్తుంది. వీరిద్దర్ని పక్కకు పెడితే; మిగతా వారంతా ఇంచుమించుగా సమాన స్థాయిల్లో ఉన్నవారే.! ఒకప్పుడు రాజమౌళి కూడా ఈ గుంపులో వాడే. మగధీర; ఈగ; సినిమాతో ఒక్కసారిగా గుంపుకి గోవింద కొట్టి తప్పుకున్నాడు.

2 Pottiఅలా గోవింద కొట్టకపోయినా గుంపులో ఉంటూనే తమ ప్రత్యేకతని కనపరిచేవారిలో ‘కృష్ణవంశీ’ ఒకరు. గులాబీ; సింధూరం; అంత:పురం; చక్రం; లాంటి సినిమాలతో తన మార్కుని వేసినా? ఖడ్గం సినిమాతో పరమత సహనం కోల్పోయాడేమో అనే అనుమానం కలగకమానదు. ‘మురారి; శ్రీఆంజనేయం; సినిమాలతో మూఢవిశ్వాసాలను, దైవభక్తిని ప్రమోట్ చేసినట్టనిపించింది. అవ్వడానికి వర్మ ప్రత్యక్ష శిష్యుడైనా సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ప్రభావం ఎక్కువ కృషవంశీ మీద కనబడుతుంది.

3 Krishna Vamsiవర్మకి, కృష్ణవంశీకి ఫ్రెండ్, శిష్యుడు పూరిజగన్నాథ్. ఎక్కడా ఎవ్వరి ప్రభావాలు లేకుండా తన సొంత మార్కుని వేసిన తొలి దర్శకుడు పూరి. పూరి అంటేనే గుర్తుకొచ్చేది ముందుగా హీరో ‘క్యారెక్టర్’ తరువాత డైలాగ్స్, వాటిని డైలాగ్స్ అని అవమానించలేం.! ఫిలాసఫీని అత్యంత తేలికపాటి మాటలతో అలవోకగా చెప్పేస్తాడు. దానికి ‘టెంపర్’ సినిమాలో ఈ మాట చాలు‘‘జీవితం ఎవ్వణ్ణి వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తది. అలా తీరితేగానీ లైఫ్ అంటే ఏమిటో అర్థం కాదు’’. అని చెప్పిన మాటతో సినిమా మొదలౌతుంది. ఇక ‘బిజనెస్ మేన్’ లో‘‘నేను ఎప్పుడు సిగ్గుపడను. అయినా ఎవ్వరిని చూసి సిగ్గుపడాలి.? చూసి సిగ్గుపడే అంత కారక్టర్లు లేరిక్కడ’’. మరొకటి‘‘నీకంటే తోపెవ్వడు లేడిక్కడ ఎవ్వడి మాట వినద్దూ, మనిషి మాట అస్సలు వినద్దు’’. ఎవడి మాటలు వింటే చలనాలు కోల్పోయిన మెదడల్లో ఆలోచనలు మొదలవుతాయో వాడే పూరి జగన్నాథ్.! మన గురజాడ మాటల్లో చెప్పాలంటే ‘దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్’ అని నిరూపించేలా పూరి సినిమాలు ఉంటాయి. అలాంటిది పూరి మీద కూడా అనుమానం కలిగేలాగ చేసిన సినిమా? ‘మెహబూబా’ ఈ సినిమాలో ఎందుకో గానీ ‘దేశమంటే మట్టే’ అని నిరూపించే ప్రయత్నం గట్టిగా చేశాడేమో అనిపిస్తుంది. ఒక స్టాండెడ్ థింకర్; రెబల్’ అని ముద్ర పడిన తరువాత ఇలాంటివి బయటపడితే ఎలా అర్థం చేసుకోవాలి.? రెండువేలు సంవత్సరంలోనే ‘బద్రి’లాంటి స్ట్రాంగ్ ఎంట్రీ ఇచ్చి రెండువేల పద్దెనిమిదిలో ‘మెహబూబా’ లాంటి దేశభక్తి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రేమకథ తీస్తే ఏం అర్థం చేసుకోవాలి.? అప్డేట్లో భాగంగా ముందుకు పోతున్నారా.? వెనక్కిపోతున్నారా.? అనే అనుమానం కలగకమానదు.

4 Puriఇదే కోవకి ‘క్రిష్’ కూడా వస్తాడు. మొదట ‘గమ్యం; వేదం; కంచె; లాంటి సంచలనాలు తీసి చివరికి బయోపిక్కుల దర్శకుడిగా మిగిలిపోయాడు. క్రిష్ ఈ మార్క్ నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు అతన్ని మర్చిపోయారు.!

5 Krishతొలినాటి నుండి తన మార్క్ ఆఫ్ సినిమాని నిలబెట్టుకున్న దర్శకుడంటే ఒక్క ‘యేలేటి చంద్రశేఖర్’. ఐతే; అనుకోకుండా ఒక రోజు; ఒక్కడున్నాడు; ప్రయాణం; మనమంతా; సినిమాలతో తన పరిపక్వతని చెక్కుచదరనియ్యలేదు. కాకపోతే ఈయన సినిమా వచ్చే వరకూ సినిమా పరిశ్రమలో ఉన్నారా లేదా? అనే అనుమానం ప్రతీ సినీ ప్రేమికుడికి కలగక మానదు.!

6 Chandra‘శేఖర్ కమ్ముల’ అంటేనే సినిమాకి సామాజిక బాధ్యత ఉందని నమ్మే వ్యక్తిత్వం గుర్తుకువస్తుంది. ఆనంద్; హ్యాపీడేస్; ఆయనలో సాఫ్ట్ ఫిల్మమేకర్ని చూపిస్తే, ‘లీడర్; మాత్రం ఆయనలో ఉన్న సామాజిక కోణాన్ని ఆవిష్కరించింది.

7 Shekar Kammulaఅదే కోవకి చెందుతాడు ‘కొరటాల శివ’ ఇతని శ్రీమంతుడు; జనతా గ్యారేజ్; భరత్ అనే నేను; ఈ సినిమాలతో సినిమాలపట్ల తన సామాజిక బాధ్యతని గొప్పగా నిరూపించుకున్నారు. దర్శక, రచయితగా తన పరిపక్వతని కాపాడుకుంటున్నారు.

8 Koratala Shivaమాటల మాంత్రికుడిగా మొదలై తొలినాళ్ళల్లో మంచి ఎంటర్టైనర్గా పేరు పొంది తరువాత ఆ పేరుని పాడుచేసుకున్నారని త్రివిక్రం విషయంలో ఖచ్చితంగా చెప్పవచ్చు. పాత సినిమా కథలు తీసుకొని వాటికి తనదైన కొత్త మాటలు జోడించి సినిమాలు తియ్యడం త్రివిక్రం పద్దతిగా నడుస్తుంది. అతడు(వంశోద్దారకుడు), అఆ(మీనా), అజ్ఞాతవాసి(Largo Winch), అరవింద సమేత వీరరాఘవ(మెండికత్తి; రాయలసీమ సాహిత్యం మీద జరిగిన పి.హెచ్.డి. వర్క్), అల వైకుంఠ పురములో(ఇంటిగుట్టు; మంచిమనిషి) ఇలా నువ్వే నువ్వే; ఖలేజా; జులాయి; అత్తారింటికి దారేది; సన్నాఫ్ సత్యమూర్తి; ఈ సినిమాల్లో కథలు ఏమోగానీ హాలివుడ్ సినిమాల నుండి అనేక సీన్లకు, సీన్లు లేపేశాడు. యూట్యూబ్‌లో ‘త్రివిక్రం కాపీ సినిమాలు’ అని కొడితే బోలేడు బయడపడతాయి. పైగా త్రివిక్రం సినిమాల్లో శ్రీరంగ నీతులకు మాత్రం కొదవుండదు. ఆయన దూరే గుడెసెల గురించి మాత్రం మాట్లాడడు. వాటి గురించి ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకుంటాడు. తెలుగు సినిమా దర్శక, రచయితల్లో త్రివిక్రం అంత అఫీషియల్‌గా కథలు, సన్నివేషాలు దోచేసిన మరో దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. అందుకే తన సినిమా టైటిల్స్ లో తన పేరు ముందు ‘రచన-దర్శకత్వం’ అని వేసుకుంటాడు తప్పా కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అని స్పష్టంగా వేసుకోడు. అదే పూరిజగన్నాథ్ అయితే స్పష్టంగా, ఖచ్ఛితంగా వేసుకుంటాడు. త్రివిక్రం ఎవరెవరివో లేపేసినప్పుడు ఎలా వేసుకుంటాడు లెండీ.? రచన అనే ఒక్క ముక్కతో సరిబడతాడు. అందులో ఉన్న కష్టం తెలిస్తే? ఆ కష్టం త్రివిక్రం పడితే ఖచ్ఛితంగా తన పేరు ముందు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం అనే స్పష్టత వచ్చేది, మన కళ్ళకు కనిపించేది.!

9 Trivikram‘ఆది’ సినిమాతో దర్శక, రచయితగా అడుగు పెట్టినవాడు వి.వి వినాయక్. తొలినాళ్ళలో ఒక ఊపూపినా తరువాత ఇతరుల కథలతో సినిమాలు చేసినా మెల్లగా సినిమాలు తగ్గించుకున్నాడు. ఇప్పుడు నటుడిగా మారి ‘సీనయ్య’ సినిమా చేస్తున్నాడు. త్రివిక్రంలాగ బుర్రలో ఇంకు అయిపోయినా పక్కోడి ఇంకు దొబ్బేసి తన ఇంకుగా చెప్పుకోవడం కన్నా వందరెట్లు గొప్పది, గౌరవ ప్రదమైనది నటించడం. ఎందరో దర్శకులు నటులుగా రానించారు. అలాగే వినాయక్ కూడా అవుతారేమో చూడాలి.

10 Vv Vinayalకామిడీ ట్రాకుల దర్శకుడిగా శ్రీను వైట్ల బాగా పేరు పొందారు. శ్రీను వైట్లలో బలమైన రచయిత లేకపోవడంతో హిట్టు సినిమాలు ఇచ్చినా ఇప్పుడు ఆయనకు సినిమాలు లేవు. ‘బోయపాటి శ్రీను’ పెద్దగా గుర్తున్న సినిమాలు ఏమీ లేవు. ఇతని దగ్గర్నుండి మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తప్పా చదువర్లు మెచ్చే సినిమాలు లేవు ఇకపై వస్తాయనే నమ్మకం కూడా సినీ ప్రేమికులకు లేదు. ఇంచుమించుగా ఇద్దరు శ్రీనుల పరిస్థితి ఒక్కటే.!

11 Sreenuతెలుగు సినిమాకి ఒక కొత్త ఒరవడిని, క్రియేటివిటీని తీసుకొచ్చిన దర్శకుడంటే సుకుమార్. ‘ఆర్య’ తో ప్రేమ కథల స్టైల్ మార్చిన దర్శకుడు. జగడం; ఆర్యా2; 100% లవ్; నేనొక్కడినే; నాన్నకి ప్రేమతో; రంగస్థలం; ఇలా ఆలోచింపజేసే కథల్ని సినిమాలుగా తీశాడు. నేనొక్కడినే; నాన్నకి ప్రేమతో కథలు వేరే రచయితలు రాస్తే వాళ్ళకు ఇవ్వాల్సిన క్రెడిట్ నిస్వార్థంగా ఇచ్చేశాడు. సుకుమార్‌తో తెలుగు సినిమాలో అనేక ప్రయోగాత్మక కథలు రావడం మొదలైందంటే అతిశయోక్తి కాదు. యువ దర్శకులకులపై సుకుమార్ ప్రభావం గట్టిగా ఉంది. కానీ రంగస్థలం సినిమా కథకు శ్రీధర్, చిరంజీవి నటించిన ‘దవళ సత్యం’ దర్శకత్వం వహించిన ‘జాతర’ సినిమా కథకు కాస్త దగ్గరగా పోలికలు ఉండడం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది.

12 Sukumarతెలుగు ప్రేక్షకులు భాస్కర్ని మరిచిపోయినా అతను తీసిన బొమ్మరిల్లు; ఆరెంజ్; సినిమాల్ని మాత్రం మరిచిపోరు.

13 Bommarillu Baskarఅడ్డాల శ్రీకాంత్ అంటేనే లైట్ హార్ట్ ఫ్యామిలీ డ్రామాలు తప్పా పెద్దగా చెప్పుకునే అంత ఏమి లేవు.! ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

14 Srikanth Adalఇలాంటి దర్శక రచయితల్ని చూసినప్పుడు ఒక మాట గుర్తుకువస్తుంది. ‘‘ఒక ప్రాపంచిక దృక్పథం లేనప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా, స్వేచ్ఛగా వ్యక్తం చేయటం సాధ్యం కాదు. అలాంటి ప్రాపంచిక దృక్పథాన్ని సాధించనంత వరకు నవల (సృజనాత్మక రచనలు) కొత్త జీవితాన్ని పొందలేదు”. రాల్స్ ఫాక్స్ ‘నవల- ప్రజలు’ అనే పుస్తకంలో చెబుతాడు. తెలుగు అనువాదం – వల్లంపాటి వెంకటసుబ్బయ్యగారు. ఏ రచయితకైనా సరైన ప్రాపంచిక దృక్పథం, తార్కికదృష్టి, సామాజికస్పృహ లేకపోతే ఆ రచనలు ఎప్పటికీ ఆలోచించతగ్గవి, ఆచరించతగ్గవి కాలేవు. ఎప్పుడైతే ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోతారో వాళ్ళు దర్శక, రచయితలైనా కాకపోయినా సమాజానికి ఒరిగేదేముండదు. అసలు నిజమైన రచయిత అంటే? తరతరాలుగా వస్తున్న అనేక సమాజ రుగ్మతుల్ని, కులాల్ని, మతాల్ని, మూఢవిశ్వాసాల్ని, సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని ప్రశ్నించి అందులో ఉన్న మంచి చెడుల్ని శాస్త్రీయ దృక్పథంతో తర్కానికి నిలబడేలాగ నిరూపించాలి. అప్పుడే నిజమైన రచయిత, రచన, దర్శకుడు, సినిమా అవుతుంది. సమాజంలో సృజనాత్మక ప్రయోజనం ఫలిస్తుంది.!

దర్శక, రచయితలు రెండు రకాలు. ఒకటి: జీవితం, సినిమా ఒక్కటే అని భావించేవాళ్ళు. రెండు: జీవితం, సినిమా వేరు, వేరని నమ్మేవాళ్ళు. అంటే? వృత్తి, ప్రవృత్తిగా దీన్ని మనం అర్థంచేసుకోవచ్చు. దీనికి రామ్ గోపాల్ వర్మని ఉదాహరణగా తీసుకోవచ్చు. వర్మ నిత్యం సినిమా కోసమే ఆలోచిస్తాడు. వర్మ నిజ జీవితంలో రేషనలిస్ట్; హేతువాది; అంటే? ప్రతిదాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా ప్రశ్నించే తత్వమని దీని అర్థం. అదే వర్మ సినిమాల్లో కనిపిస్తుంది. ‘సత్య’ సినిమాలో ఊర్మిళ సత్య కొత్తింట్లోకి దిగినప్పుడు గోడల మీద ఎలాంటి దేవుడు పటాలు లేకపోవడం గమనించి, ‘‘మీరు దేవుణ్ణి నమ్మరా?’’ అని అడుగుతుంది. సత్య ‘‘నమ్మను’’ అని బదులిస్తాడు. దేవుణ్ణి నమ్మే దర్శక, రచయితలైతే అలాంటి సీన్ పెట్టే సాహసం చేయరు. వర్మ తన మెదడులోంచి దేవుడు అనే అంశాన్ని బయటకి తీసిపారేశాడు. అదొకటి తీసేస్తే జ్యోతిష్యం, రంగురాళ్ళు, మూఢవిశ్వాసాలు, వాస్తు అన్ని కనుమరుగైపోతాయ్. అందుకే ఈనాటికి కూడా చాలా భిన్నంగా ఆలోచించి వార్తల్లో నిలుస్తాడు. ‘రామూఇజం’ అనే డెభ్బై ఎపిషోడ్స్ అక్కడినుంచే పుట్టుకొచ్చాయి. దేవుణ్ణి నమ్మడం వల్ల మనం పరిష్కరించుకోవల్సిన విషయాలు ఆయన మీద పడేసి దేవుడా నువ్వే దిక్కనే బానిసత్వం మనలో మనకే తెలియకుండా వృద్థి చెందుతుంది. ఇలాంటి బానిసత్వం నుండి నూతనత్వం రాదు. క్రియేటివ్ ఫీల్డ్ అంటేనే అందరికంటే డిఫరెంట్‌గా; ఛాలెంజింగా ఆలోచిస్తేనే అక్కడ నిలబడగలరు. మనలో భక్తుంటే దేవుడికి ఆల్టర్నేటివ్ ఆలోచించగలమా? అలా వర్మ ఆలోచిస్తాడు కనుకనే ఇప్పటికీ ప్రయోగాత్మక సినిమాలకు, ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్‌గా వర్మ నిలిచే ఉన్నాడు.

15 Rgvఅదే కృష్ణవంశీని తీసుకుంటే అతను దేవుణ్ణి నమ్ముతాడు. అందులో నుండి పుట్టుకొచ్చిన మూఢవిశ్వాసాల్ని గౌరవిస్తాడు. ‘దేశమంటే మట్టే’ అని నమ్మితే దేశభక్తి అవుతుంది; ‘దేశమంటే మనుషులు’ అని నమ్మితే మానవత్వం అవుతుంది; కృష్ణవంశీ మనుషులు కాదని నమ్ముతాడు కాబట్టే అనుకుంటా ‘ఖడ్గం’ లాంటి దేశభక్తి సినిమా తియ్యగలిగాడు. వర్మ – వంశీ వీళ్ళు జీవితంలో నమ్మే సిద్ధాంతాల్నే సినిమాలుగా తీసే ప్రయత్నం అప్పుడప్పుడూ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఎవరిది శాస్త్రీయ దృక్పథం? ఎవరిది అశాస్త్రీయ దృక్పథం? అన్నదే ముఖ్యమైన ప్రశ్న.!

16 Khadgamఇంకొంత మంది దర్శకులు ఉదాహరణకు ‘విక్రమ్ కుమార్’. ‘మనం’లాంటి జన్మజన్మల వృత్తాంతాల మూఢ విశ్వాసాల సినిమా తియ్యగలడు. ‘24’ లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమా తియ్యగలడు. ఇతని దృష్టిలో జీవితం వేరు, సినిమా వేరు. ఇలాంటి దర్శకులకు ఒక సిద్ధాంతంగానీ, సొంత వ్యక్తిత్వంగానీ ఉండవు. వీళ్ళ పేరు చెప్పగానే మనకు ఒక యూనిక్ స్టైల్ గుర్తుకురాదు. పూరి అనగానే మనకు హీరో క్యారక్టరైజేషన్ గుర్తుకు వస్తుంది. సినిమాల్లోనే కాదు బయట అయినా వృత్తిని – ప్రవృత్తిని వేరు, వేరుగా చూసేవాళ్ళు ఎప్పటికీ సమాజాన్ని ప్రభావితం చెయ్యలేరు.‘స్ట్రాంగ్ మైండెడ్’ అనిపించుకోలేరు. వీళ్ళ జీవితంలో సరైన కష్టం వస్తే దాన్ని ఎలా తట్టుకుంటారో కూడా చెప్పలేం.! వీళ్ళ సినిమాల్లో కథలు ‘నాటుగా’ ఉండవు. ‘నీటుగా’ ఉంటాయి. పరభాషా చిత్రాల ప్రభావం ఎక్కువ కనబడుతుంటుంది.

17 Vikram K Kumarతెలుగు సినిమా పరిశ్రమలో కాన్వెంట్ బాచ్ ఎక్కువైపోయారు. వీధిబడిలో చదివిన దర్శకులు చాలా అరుదు.! అందుకే ఎక్కువ అనుకరణ కథలు రాస్తారు.

“తమిళ సినిమాళ్ళా స్థలకాలాదులున్న స్థానిక కథలు, జీవితాలు రాయడం తక్కువ.”

18 Vetrimaran & Pa Ranjithతెలుగులో చాలా కాలం తరువాత స్థలకాలాలు ఉన్న సినిమాలంటే? కంచరపాలెం; మల్లేశం; పలాస; అని చెప్పాలి. ఇలా ఈనాటి యువ దర్శకులు మంచి, మంచి కథలతో ఎంతో కొంత స్థానికత కనిపించేలా కథలు రాస్తున్నారు.

19 Venkatesh‘ఇంద్రగంటి మోహన్ కృష్ణ’ ఈయన సినిమాల్లో మంచి ఆరోగ్యకరమైన రచన బతికి ఉంటుంది.

20 Mohan‘తేజ’ తొలినాళ్ళలో మంచి సంచలనాత్మక ప్రేమకథలు తీశాడు. నేనే రాజు నేనే మంత్రి; తేజా మార్క్ సినిమా.

21 Tejaఇలా ప్రవీణ్ సత్తార్ నుండి పలాస కరుణకుమార్ వరకూ వచ్చిన యువ దర్శకులు తెలుగు సినిమాని చాలా వరకూ ప్రభావితం చేస్తున్నారు.

22 Praveenఎప్పుడైతే షార్ట్ ఫిల్మ్ మేకర్సుకు సినీ అవకాశాలు రావడం మొదలైందో అప్పుడ్నుంచి తెలుగు సినిమా రూపురేఖలు, కీర్తిప్రతిష్టలు పెరిగాయి.

నాగ అశ్విన్ ‘ఎవడే సుబ్రమణ్యం; తరుణ్ భాస్కర్ ‘పెళ్ళిచూపులు; ప్రశాంత్ వర్మ ‘అ; వేణు ఊడుగుల ‘నీదీ నాది ఒకే కథ; గౌతమ్ తిన్ననూరి ‘జెర్సీ; వివేక్ ఆత్రేయ ‘బ్రోచేవారెవరురా; స్వరూప్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ; సంకల్పరెడ్డి ‘ఘూజీ; ఇలాంటి ప్రయోగాత్మక, కథాబలమున్న సినిమాలు తెలుగులో వచ్చి పరభాషా చిత్రాలకు తెలుగు సినిమా ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాయి. భావితరాలకు తెలుగు సినిమాని బతికించి ఇస్తున్న దర్శక, రచయితలకు ఆ తరాల తరపు అభివందనాలు.!

23 All Directorsపైన సినిమా పరిపక్వత గురించి ప్రస్తావించిన సందర్భంలో ఆ సినిమాలు తీస్తున్న దర్శకుల గురించి మాట్లాడాను తప్పితే నాకు, వారికీ ఎంటువంటి విరోధం లేదు. కేవలం విమర్శా విశ్లేషణలో భాగంగా రాశానని గమనించ ప్రార్థన.! విమర్శకుడి గురించి ‘సి. నారాయణరెడ్డిగారు’ ఒక మాట చెప్పారు. ఆ వాక్యాలతో ముగిస్తా‘‘ఎదురైన ప్రతియోధుల తలలను తుత్తునియలు చేసే సైనికుడు కాడు విమర్శకుడు. అలాగే అడ్డమైన వాళ్ళను అతిశయోక్తులతో ముంచెత్తే స్తోత్ర పాఠకుడూ కాడు విమర్శకుడు.’’.(తెలుగులో సాహిత్య విమర్శ: ముందుమాట) అని విమర్శకుని బాధ్యతని తెలియ జేశారు. ఇలాంటి విమర్శా విశ్లేషణలు మన సినిమాలపై మరిన్ని రావాలని ఆశిస్తున్నాను. ‘తెలుగు, తమిళ దర్శకులు – తులనాత్మక పరిశీలన’ అనే అంశం మీద వ్యాసం రావాల్సిన అవసరం ఉంది.

SHARE