హిందువుల ఆరాధ్య దైవం వినాయకుడు. దేవతలందరికి అధిపతి వినాయకుడు. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే వినాయకుడు తొండం లేకుండా బాలగణపతి మనిషి రూపంలో దర్శనమిస్తాడు. ఇలా వినాయకుడు మనిషి రూపంలో దర్శనమిచ్చే ఆలయాలు చాలా అరుదు. మరి నరముఖ గణపతి ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయంలో ఉన్న మరిన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడు రాష్ట్రంలో, తిలతర్పణపురి అనే గ్రామంలో స్వర్నవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయం ఉన్నది. ఈ ఆలయం కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కి. మీల దూరంలోను, తమిళనాడులోని తిరునల్లార్ శనిభగవానుని ఆలయానికి 25కి.మీ ల దూరంలో కలదు.
ఈ ముక్తీశ్వరాలయంలో శ్రీ రాముడు శివుడిని తపస్సు చేసి తన తండ్రికి పిండాలు పెట్టాడని స్థల పురాణం. అయితే శ్రీరాముడు ఈ ఆలయంలోని కొలనులో స్నానం చేసి తన తండ్రికి పితృ తర్పణాలు మొదలుపెట్టిన స్థలం ఇదే కనుక ఈ ఊరిని తిలతర్పణపురి అంటారు. తిలలు అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం. అంటే రాముడు తిలలు వదిలిన ప్రదేశం కనుక దీనిని తిలతర్పణపురి అని పిలవటం జరుగుతుంది. అయితే శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాలరూపంలో ఇక్కడ మారటం జరిగిందని చెబుతారు.
భారతదేశంలోనే 7 స్థలాలుగా చెప్పబడే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం, తిరువెంకాడు, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందింది. అందువలన ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక ఎన్నో బాధలతో ఇబ్బంది పడుతూవుంటారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పెద్దలకు తర్పణాలు వదలటం ద్వారా ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని ప్రతీతి.
ఇంకా ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో మరొక విశేషం ఉంది. ఇక్కడ వెలసిన వినాయకుడు తొండం లేకుండా మానవ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఈవిధంగా వెలసిన గణపతిని నరముఖ గణపతి లేదా ఆది వినాయకర్ గణపతి అని చాలా ప్రసిద్ధి చెందినది.
ఇలా శ్రీరాముడు తన తండ్రికి పిండాలు పెట్టి మోక్షం పొందిన ఈ ఆలయానికి ఎవరైతే పెద్దలకు కార్యక్రమాలు నిర్వహించలేక బాధపడుతున్నారో వారు ఈ ఆలయాన్ని దర్శించి పిండాలు పెట్టి దోషాలను నివృతం చేసుకుంటున్నారు.