Home Unknown facts కేవలం సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే అనుమతి ఉండే జాతర

కేవలం సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే అనుమతి ఉండే జాతర

0

జమ్మూ – కాశ్మీర్ లో అమరనాథ్ యాత్రకి వేసవిలో కొన్ని రోజులు మాత్రమే అనుమతి అనేది ఉంటుంది. అదేవిధంగా శ్రీశైలం అడవుల్లో ఉన్న సలేశ్వరం జాతరకి కూడా కేవలం సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే అనుమతి అనేది ఉంటుంది. అందుకే దీనిని తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని అంటారు. మరి దట్టమైన అరణ్యంలో ఉన్న సలేశ్వరం జాతర గురించి మరిన్ని ఆశ్చర్యకర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Waterfall

తెలంగాణ రాష్ర్టం, మహబూబునగర్ జిల్లా, హైదరాబాద్ – శ్రీశైలం ప్రధాన రహదారిపై ఫరహాబాద్ చౌరస్తా నుండి వెళ్లే దట్టమైన అడవి ప్రాంతంలో సలేశ్వర క్షేత్రం ఉంది. ఎత్తయిన కొండల పైనుంచి జాలువారి యేరుగా ప్రవహిస్తూ సరస్సుగా ఏర్పడి పుష్కర తీర్థం అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. సలేశ్వరం గుట్టని చేరిన తరువాత సలేశ్వరం గుడిని చేరడానికి దట్టమైన అడవుల్లో సుమారు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ చాలా కష్టమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే ఆలయ సమీపంలో మోకాళ్ళ పర్వతం అనే గుట్ట వస్తుంది. ఈ గుట్టని ఎక్కడం అనేది చాలా కష్టతరం అయినా భక్తులు శివనామస్మరణం చేసుకుంటూ వెళతారు.

శివుడు లింగమయ్యగా ఈ ఆలయంలో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఆలయం నల్లమల చెంచుల ఆధ్వర్యంలో ఉంది. వారే ఇక్కడ ప్రతి సంవత్సరం పూజలు నిర్వహిస్తుంటారు. ఎందుకంటే స్వామివారు ముందుగా ఈ అడవిలో చెంచులకే దర్శనం ఇచ్చారట. అందుకే వారే ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ ఆలయం ఎదురుగా గంగమ్మ ఉంది. ప్రకృతి అందాల నడుమ, ఒక పెద్ద గుట్టపై నుండి నీరు కిందకు పడుతుంటుంది. ఈ జలపాతం దగ్గర భక్తులు స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకా ఇక్కడ చెట్ల వేర్ల నుండు నీరు రాగ వాటినే భక్తులు తాగుతుంటారు.

ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, దట్టమైన అడవిలో ఉండే ఈ జలపాతం దగ్గర మండు వేసవిలో కూడా నీరు చల్లగా ఉండటం అనేది దైవలీలగా భక్తులు చెబుతారు. అయితే ఉగాది పండుగ తరువాత తొలి పౌర్ణమికి సలేశ్వరం జాతర అనేది మొదలవుతుంది. దట్టమైన అడవిలో ఈ పుణ్యస్థలం ఉండటం వలన సంవత్సరంలో కేవలం వేసవిలో జరిగే జాతర సమయంలో నాలుగు రోజులు మాత్రమే సలేశ్వర ఆలయ దర్శనం అనేది భక్తులకి లభిస్తుంది.

ఈ ప్రాంతంలో సర్వేశ్వరా తీర్థం, పుష్కర తీర్థం అనే రెండు తీర్దాలున్నాయి. 35 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు, 20 అడుగుల ఎత్తు ఉన్న కొండగుహలో చెంచుల ఆరాధ్య దైవమైన లింగమయ్య స్వామి వారు కొలువై ఉన్నారు. ఇక ఈ సంవత్సరం లింగమయ్య స్వామి ఉత్సవాలు ఏప్రిల్ 18 వ తేదీన మొదలవ్వగా ఏప్రిల్ 21 వరకు ఈ జాతర జరుగనుంది.

ఇంతటి అద్భుతమైన సలేశ్వరం జాతరకి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పవిత్ర జలపాతంలో స్నానమాచరించి లింగమయ్య స్వామిని దర్శించుకుంటారు.

Exit mobile version