ఈ హనుమాన్ ఆలయానికి శిఖరమే నిర్మించలేదు ఎందుకో తెలుసా ?

ఎక్కడా లేని విధంగా చెట్టునే ఆలయ శిఖరంగా చేసుకుని ఆ చెట్టు పేరు మీదే మద్ది ఆంజనేయస్వామిగా వెలిసి దేశంలోనే ప్రముఖ హనుమాన్ క్షేత్రంగా పేరుగాంచిన ఆలయం శ్రీమద్ది ఆంజనేయస్వామి దేవస్థానం. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలో పచ్చని పొలాల మధ్య ఎర్రకాలువను ఆనుకుని మద్దిచెట్టు తొర్రలో వెలిసిన స్వయంభూ క్షేత్రం మద్ది ఆంజనేయస్వామి ఆలయం. 50 సంవత్సరాల క్రితం చిన్న చెట్టు తొర్రలో ఉన్న ఈ దేవాలయం ప్రస్తుతం ప్రముఖ దేవాలయాల జాబితాలో స్థానం సంపాదించుకుంది.
Sri Maddi Anjaneya Swamy Temple
ఇక్కడ స్వామి చాలా మహిమ కలవాడుగా కొనియాడబడతాడు. వివాహం కానివారుగానీ, కుటుంబ సమస్యలు, ఆర్ధిక సమస్యలతో బాధపడేవారు, ఏ పని చేసినా కలసిరానివారు, ఇక్కడ ఏడు మంగళవారాలు స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తే వారి సమస్యలు తొలగిపోతాయి.  చాలాకాలం క్రితమే ఇక్కడ హనుమత్ దీక్షలు కూడా ప్రవేశపెట్టారు.  ప్రతి సంవత్సరం హనుమత్ వ్రతం, పూర్ణాహుతి జరుపబడుతున్నాయి.
Sri Maddi Anjaneya Swamy Temple
ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే త్రేతా యుగంలో ప్రారంభమవుతుంది. లంకలో ఉన్నవాళ్లందరు రాక్షసులు కాదు. రావణుడి చర్యలను వ్యతిరేకించిన విభీషుణుడి గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ రావణుడి సేనలోని మధ్వాసురుడనే రాక్షసుడు మాత్రం తాను కత్తి పట్టను, జీవ హింస చేయననేవాడు. దీంతో రావణుడు అతడిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసేవాడు. వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటే శివుడి చెంతకు చేరుకుంటామని ప్రతి ఒక్కరికీ హితబోధ చేసేవాడు.
Sri Maddi Anjaneya Swamy Temple
సీత జాడ వెతుక్కుంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడి విధేయతను మెచ్చిన మధ్వాసురుడు అతడికి వీరభక్తుడిగా మారిపోయాడు. ప్రహ్లాదుడు శ్రీహరిని స్మరించినట్లు ఇతడు కూడా నిరంతరం హనుమాన్ నామాన్ని జపించేవాడు. రామరావణ యుద్ధం ఖాయమవడంతో అందులో పాల్గోవాలని మధ్వాసురుడుకి పిలుపొచ్చింది. దీంతో ఏంచేయాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి, హనుమంతుడి నామాన్ని ఉచ్చిరిస్తూ ఆత్మత్యాగం చేశాడు.
Sri Maddi Anjaneya Swamy Templeత్రేతా యుగం అంతమైన తరువాత ద్వాపర యుగంలోనూ మళ్లీ మధ్వికుడిగా జన్మించిన మధ్వాసురుడు దుర‌దృష్టవశాత్తు కౌరవుల తరఫున పోరాడాల్సి వచ్చింది. కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూసి గత జన్మ గుర్తుకొచ్చి ప్రాణత్యాగం చేశాడు. కలియుగంలో మద్యుడనే మహర్షి రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుడి కోసం తపస్సు చేశాడు. ఒకరోజు పక్కన ఉన్న కాల్వలో స్నానం చేసి వస్తూ దారిలో సొమ్మసిల్లి పడిపోతే ఓ వానరం అతడిని లేపి సేవలు చేసి, తినడానికి మామిడి పండు ఇచ్చింది. అప్పటి నుంచి రోజూ ఆ వానరం వచ్చి సపర్యలు చేయడం, పండు ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి.నీవు ఎవరో నాకు తెలియదు, నాపై ఎందుకింత ప్రేమని మద్యుడు అడిగాడు. దీంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు ధర్శనం ఇచ్చాడు. దీనికి పులకించిన మద్యుడు స్వామీ నిన్ను ఒకే ఒక్కటి కోరతాను.దీన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు కోరుమన్నాడు. మద్యుడు స్వామి నిన్ను విడిచి ఉండలేను, నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడు. దీనికి సరేనన్న హనుమంతుడు నీవు మద్ది చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు.
Sri Maddi Anjaneya Swamy Temple
అలా వెలసిన దేవాలయమే మద్ది ఆంజనేయస్వామి ఆలయం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపాన ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఈ ఆలయంలోని ఆంజనేయుడు ఓ చేతిలో పండు, మరో చేతిలో గదతో స్వయంభువుగా వెలిశాడు. మధ్వ మహర్షి భక్తికి మెచ్చిన ఆంజనేయస్వామి మధ్వకా, నీవు మద్ది చెట్టుగా జన్మిస్తావు. నేను నీ సమీపంలో శిలా రూపంలో ఎక్కడా లేని విధంగా ఒక చేతిలో గదతో, ఇంకొక చేతిలో పండుతో వెలుస్తాను.  భక్తులు నన్ను నీ పేరుతో కలిపి మద్ది ఆంజనేయస్వామిగా కొలుస్తారు అని అభయమీయగా మధ్వ మహర్షి సంతోషించాడు.
Sri Maddi Anjaneya Swamy Temple
తర్వాత కాలంలో స్వామికి ఆలయం నిర్మించారు.   అయితే ఆలయానికి కప్పు, విమానం నిర్మించటానికి వీలు కాలేదు.  ఆ రోజులలో జంగారెడ్డి గూడెం ఫారెస్టురేంజ్ ఆఫీసరుగా పనిచేసిన మంతెన వరహాలరాజుగారి మాతృమూర్తి శ్రీమతి భానుమతిగారు స్వామి చెంతకు తరచూ వస్తూవుండేవారు.  ఒకసారి ఆవిడ ఒంటిమీదకు స్వామివారు వచ్చి కట్టిన ఆలయాన్ని అలాగే వుంచి, మద్ది చెట్టు శిఖరముగా వుండేటట్లు, వేరే శిఖరం లేకుండా గర్భాలయ నిర్మాణం చేయమని ఆజ్ఞ ఇచ్చారు.  స్వామి ఆజ్ఞ పాటించి శిఖరం లేని గర్భాలయాన్ని నిర్మించారు. శిఖరం లేని గర్భాలయాలు చాలా అరుదు.  ఇది ఇక్కడి విశేషం. ఈ ఆలయానికి పశ్చిమ ముఖంగా పురాతన వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇది ఆంజనేయస్వామి ఆలయం ప్రసిధ్ధి చెందకముందునుంచే ఉంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR