Shivudu Mariyu Subramanyeshwarudu Velisina Ekaika Shaiva Kshetram

0
4515

శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగులచవితి రోజున ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడి పుట్టకు విశేష పూజలు నిర్వహిస్తారు. మరి ఇక్కడ ఆ స్వామి స్వయంభువుగా ఎలా వెలిసాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. sarpa roopamకృష్ణాజిల్లాలో దివి సీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దీనికి మోహిణిపురమని, సర్పక్షేత్రమని పేరు అయితే కాలక్రమేణా అది మోపిదేవిగా మారింది. ఈ ఆలయంలో సుబ్రమణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి సుమారు అయిదు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలశాడని పురాణాలు చెబుతున్నాయి. రాహు, కేతు, సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు.sarpa roopamతూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరేడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. దీన్నే పానపట్టం అని కూడా అంటారు. అయితే స్వామివారి పానపట్టం వద్ద ఉన్న ఒక కన్నంలో నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటికి వచ్చి భక్తులకి దర్శనం ఇస్తుందని ఇది ఒక విశేషముగా చెబుతారు. ఇంకా ఆలయ ప్రదక్షిణమార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుడిని అభిషేకిస్తారు. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు. sarpa roopamఇక ఆలయ పురాణానికి వస్తే, ఇంద్రాది దేవతల ప్రార్థనలను మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలోని మోహినీపురంలో సేదతీరుతుండగా జాతివైరాన్ని మరచి పాము, ముంగిస, నెమలీ ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కనే దివ్యతేజస్సును విరజిమ్ముతూ ఉన్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి చూడగా కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దివ్యదృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటుచేసి ఆరాధించాడు. ఇది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు. sarpa roopamపుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి, తాను పుట్టలో ఉన్నాననీ, తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమనీ ఆజ్ఞాపించాడట. స్వప్నవృత్తాంతాన్ని పెద్దలకు తెలియజేసిన పర్వతాలు స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి, షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. స్వామి మహిమలను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులూ, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులూ ఆలయ అభివృద్ధికి విశేష కృషిచేశారు. sarpa roopamనాగుల చవితి రోజున పుట్టదగ్గరకు వెళ్లి ఆయన్ను పూజిస్తే సంతానం లేనివారికి పిల్లలు పుడతారని ఇక్కడివారి నమ్మకం. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి సంకేతం. అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ఆరాధించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.sarpa roopam
ఈవిధంగా స్వయంభువుగా పుట్టలో వెలసిన సుబ్రమణ్యేశ్వర స్వామిని నాగులచవితి రోజున భక్తులు లక్షల సంఖ్యల్లో ఇక్కడికి తరలి వచ్చి పుట్టలో పాలు పోసి స్వామి లింగాన్ని దర్శనం చేసుకుంటారు.

SHARE