మన దేశంలో ఉన్న అతి పెద్ద నంది విగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

0
9892

శివుడి యొక్క వాహనం నందీశ్వరుడు. ప్రతి శివాలయంలో అడుగు పెట్టగానే మనం ముందుగా నందిని దర్శనం చేసుకుంటాం. కొందరు నంది కొమ్ములో నుండి శివుడిని దర్శనం చేసుకుంటే, కొందరు నంది చెవిలో వారి వారి కోరికలను విన్నవించుకుంటారు. మరి మన దేశంలో ఉన్న అతి పెద్ద నంది విగ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయం విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1.లేపాక్షి:

Famous Nandi Statues in India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా హిందూపూర్‌కు 14 కి.మీ దూరంలో లేపాక్షి ఉంది. పురాణం ప్రకారం, రావణుడు, సీతాదేవిని అపహరించుకొని వెళుతుండగా ఆకాశంలో ఉన్న జటాయువు రావణుడి అడ్డుకొనగా దాని రెక్కలు కండించడం వలన ఆ జటాయువు క్రింద పడిపోతుంది. ఇక హనుమంతుడి సహాయంతో అటుగా వచ్చిన శ్రీరాముడు చలన స్థితిలో లేని ఆ జటాయువును లే పక్ష్మి అని పిలవడం వలన మోక్షాన్ని పొంది చివరకు లేపాక్షి గా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇంకా ఇక్కడ హనుమంతుడికి సంబంధించిన పాదముద్రలు ఇప్పటికి దర్శనం ఇస్తాయి. ఇంకా లేపాక్షిలో గుడికి 250 మీటర్ల దూరంలో దేశంలోకెల్లా అతిపెద్ద నంది విగ్రహం దర్శనమిస్తుంది. 8.23 మీటర్ల పొడవూ, 4.5 మీటర్ల ఎత్తులో మలిచిన ఏకశిలా రూపమిది. అయితే ఈశాన్యమూలలో ఉన్న అంతరిక్ష స్తంభం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. నేలను తాకకుండా సుమారు 8 అడుగుల స్తంభం పై కప్పు నుంచి వేలాడుతూ ఉంది.

2.బృహదీశ్వరాలయం – తంజావూరు

Famous Nandi Statues in India

భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ బృహదీశ్వరాలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు లో ఉంది. ఈ ఆలయ నిర్మాణాన్ని చోళ రాజు అయినా రాజరాజ చోళుడు అత్యంత అధ్బుతంగా నిర్మించాడు. ఈ బృహదీశ్వరాలయం ఒక పెద్ద కోటలో ఉంది. ఆలయానికి ముందుభాగములో నల్ల రాతితో చెక్కిన బ్రహాండమైన నంది విగ్రహం ఉంది. ఈ నంది విగ్రహం సుమారు 19 అడుగుల పొడవు,8 అడుగుల వెడల్పు,12 అడుగుల ఎత్తు,25 టన్నుల బరువు ఉంటుంది. అందుకే భారతదేశములోని అతిపెద్ద నంది విగ్రహాలలో మొదటిది లేపాక్షి లోని నంది అయితే రెండవ అతి పెద్ద నంది ఇదే అని చెప్పుతారు. గర్భాలయంలో ఉన్న శివలింగం అమితంగా ఆకట్టుకుంటూ పూర్తిగా నల్ల రాయితో చేయబడిన పదహారడుగుల ఎత్తు 21 అడుగుల కైవారం కలిగి చూడటానికి ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది.

3.యాగంటి:

Famous Nandi Statues in India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలుజిల్లా, జిల్లా కేంద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లి మండలం, బనగానపల్లి నుండి 15 కీ.మీ. దూరంలో ఎర్రమల కొండల్లో వెలసిన యాగంటిలో శ్రీ ఉపమహేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయంలో ఉమామహేశ్వరులు స్వయంభువుగా వెలిశారు. ఈ ఆలయం నందు ఆది దంపతులైన శివపార్వతులు ఒకే శిలలో దర్శనమిస్తారు. యాగంటి లోని నంది విగ్రహానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎందుకంటే ఈ నది విగ్రహం దిన దినానికి ఆ రాయి యొక్క పరిమాణం పెరుగుతుంది. ఇక్కడి 15 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, 8 అడుగుల పొడవు గల నందీశ్వరుడు కూడా స్వయంభు అని తెలియుచున్నది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు తన కాలజ్ఞాన తత్వాలలో ‘యాగంటి బసవన్న అంతకు అంతకు పెరిగి కలియుగాంతమున రంకె వేసేనయా’ అని చెప్పారు. నిజంగానే ఈ నంది పరిమాణం రోజు రోజుకి పెరుగుతుంది. భారత పురావస్తు శాఖ కుడి ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

4.చాముండేశ్వరిదేవి ఆలయం:

Famous Nandi Statues in India

కర్నాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలోని మైసూరు ప్యాలెస్ కి కొంత దూరములో సముద్రమట్టానికి 3490 అడుగుల ఎత్తులో చాముండేశ్వరిదేవి ఆలయం ఉన్నది. ఈ దేవాలయం ఉన్న కొండ మీదకి ఎక్కడానికి సుమారుగా 1000 మెట్లు ఉన్నాయి. మైసూరు మహారాజులు ఈ దేవతని కులదేవతగా ఆరాధించేవారు. చాముండేశ్వరిదేవిని భక్తులు పార్వతి, శక్తి, దుర్గామాత అని అనేక రకాలుగా కొలుస్తుంటారు. ఇక్కడ అమ్మవారు దుష్టులకి భయాన్ని కలిగించే భయంకరమైన రూపంతో, భక్తులని రక్షించుటకు చల్లని తల్లిగా దర్శనమిస్తుంటారు. ఇక్కడ కొండపైకి ఎక్కే మార్గములో 16 అడుగుల ఎత్తు, 25 అడుగుల పొడవుగల ఒకే రాతితో నిర్మించిన అధ్బుతమైన నంది విగ్రహం ఉన్నది.

5. మహానంది :

Famous Nandi Statues in India

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాలకు 14 కి.మీ. దూరంలో మహానంది మండలం, మహానంది వద్ద శ్రీ మహానందీశ్వరస్వామి వారి దేవస్థానం ఉంది. ఇది పురాణ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఈ గ్రామానికి అనుకోని 15 కి.మీ. దూరంలో నవనందులు ఉన్నాయి. వీటి అన్నిటిలోకి ఇక్కడ ఉన్న ఆలయం ప్రధానమైనది కావడంతో ఈ క్షేత్రానికి మహానంది అనే పేరు వచ్చింది. ఇది ప్రముఖ శివ క్షేత్రం. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇచ్చట జలమే ఒక విశేషం. శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది క్షేత్రానికి మాత్రమె సొంతం. లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి సదా నీరు ఊరుతూనే వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఇచట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము అణగి వుంటుంది.