మన దేశంలో ఎన్నో ఆచారాలు, ఎన్నో నమ్మకాలూ అనేవి ఎప్పటి నుండో ఉండగా ఇప్పటికి వాటి పైన భక్తుల్లో నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకాలలో ఒకటే ఇక్కడ విగ్రహం. ఈ ప్రాంతం వారు సరైన సమయంలో వర్షం పడకపోతే ఈ విగ్రహాన్ని పూజిస్తే సరైన సమయంలో వర్షం పడుతుందనే నమ్మకం ఎప్పటి నుండో వస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, పెద అమిరం అనే గ్రామంలో పదమూడవ జైన తీర్ధంకరుడు విమల నాధుని ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం దాదాపుగా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు. ఇక్కడి విమల నాధుడి విగ్రహం పద్మాసనంలో నాలుగు అడుగుల ఎత్తు ఉండి నల్లరాతితో తయారుచేయబడినది.
ఇక సుమారు వంద సంవత్సరాల క్రితం పంటపొలాల పక్కన ఒక గోతిలో ఈ విగ్రహం ఉండగా, ఆ ఊరి చాకలి వాళ్ళు దీనిపైనే బట్టలు ఉతికేవారు. ఒక సమయంలో ఆ ఊరిలో కరువు ఏర్పడి అంటువ్యాధులు రాగ అప్పుడు ఆ ఊరిలోని ఒక స్త్రీ కలలో అది రాయి కాదని దేవుడి విగ్రహం అని ఆ విగ్రహాన్ని తీసి ప్రతిష్టించండి అంటూ రాగ, అప్పుడు ఊరిలోని వారందరు కలసి ఆ విగ్రహాన్ని బయటికి తీసి ప్రతిష్టించారు. ఇలా వారు ప్రతిష్టించిన 60 సంవత్సరాల తరువాత అది జైన విగ్రహం అనే విషయం తెలిసింది.
ఇది తెలిసిన వేరే గ్రామంలో ఉండే కొందరు జైనులు ఆ విగ్రహాన్ని తమకి ఇవ్వమని అడుగగా వారు దానికి అంగీకరించకుండా, శ్రీ నందన్ విజయాజ్ మహా రాజ్ ఆధ్వర్యం లో ఊరిలో వారందరి సహకారంతో 1965 జైన దేవాలయాన్ని నిర్మించి అందులో విమల నాధుడిని ప్రతిష్టించారు. ఇక ఇక్కడ ముందు నుండి కూడా ఉన్న ఒక నమ్మకం ఏంటంటే, సకాలంలో వర్షం పడకపోతే 108 కుండలతో, 108 కొబ్బరియాలతో విగ్రహానికి అభిషేకం చేస్తే వర్షం తప్పకుండ కురుస్తుందని నమ్మకం.