Home Unknown facts భక్తులు ఎక్కువగా తరలివచ్చే ఆంజనేయస్వామి మహిమగల ఆలయాలు

భక్తులు ఎక్కువగా తరలివచ్చే ఆంజనేయస్వామి మహిమగల ఆలయాలు

0

ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. ఇక ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు. మరి ఆంజనేయస్వామి వెలసిన కొన్ని అద్భుత ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంజనేయస్వామి జన్మ స్థలం:

Famous Hanuman Temples

హనుమంతుడు జన్మించిన స్థలం పైన అనేక భిన్నాభిప్రాయాలు ఉండగా, మహారాష్ట్రలోని నాసిక్ అనే ప్రదేశంలోని అంజనేరి అనే కొండ ఉన్న ప్రదేశంలో హనుమంతుడు జన్మించినట్లుగా చెబుతారు. ఈ ఆంజనేరి పర్వతం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర ఆలయం వెళ్లే మార్గంలో ఉంటుంది. ఇక్కడి అంజనేరి పర్వతం కింద హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో అంజనాదేవి ఒడిలో పసిబాలుడి రూపంలో ఉన్న హనుమంతుడు భక్తులకి దర్శనం ఇస్తాడు. ఈ పవిత్ర పుణ్యస్థలంలో ఉన్న ఈ కొండ హనుమంతుడి ముఖాన్ని పోలి ఉండటం ఒక విశేషం. అయితే ఇక్కడ ఒక వింత వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడి వాటర్ ఫాల్స్ లోని నీరు కింద నుండి పైకి పడుతుంటాయి. అందుకే ఈ వాటర్ ఫాల్ ని రివర్స్ వాటర్ ఫాల్ అని అంటారు.

కొండగట్టు అంజన్న స్వామి:

తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా నుండి 35 కి.మీ. దూరంలో చొప్పదండికి కి దగ్గరలో మల్యాల మండలం లో కొండగట్టు పై ఆంజనేయస్వామి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామి రెండు ముఖాలతో వెలసిలి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత . ఇలా ద్విముఖ ఆంజనేయ మూర్తి ఇక్కడ మాత్రమే దర్శనం ఇస్తాడు. అంతేకాకుండా స్వామి సాక్షాత్తు విష్ణు స్వరూపం కనుక శంఖము , చక్రము , వక్షస్థలం లో శ్రీ రాముడు , సీతా సాధ్విలను కలిగి ఉండటం ఈ ఆలయంలో మరొక విశేషం. ఇలా ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ప్రకృతి సౌందర్యమైన కొండపైన సువిశాలమైన ప్రదేశంలో కొండగట్టు పైన ఆంజనేయస్వామీ వెలిసాడు కనుక ఈ స్వామిని భక్తులు కొండగట్టు అంజన్నస్వామి అని పిలుస్తుంటారు.

హనుమాన్ జంక్షన్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పచ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల సరిహద్దు లో హనుమాన్ జంక్షన్ ఉంది. ఇక్కడ హనుమంతుడు ఒక కోతి రూపంలో దర్శనం ఇచ్చాడని చెబుతారు. అయితే అరణ్యవాసంలో ఉన్న శ్రీరామునికి అరటిపండు ఇచ్చి ఆకలి బాధను పోగొట్టగా, ఇక్కడ అంజనేయస్వామి వారు రామా ఇవిగో అరటిపండ్లు అన్నట్టుగా విగ్రహం ఉండటం ఒక విశేషం అయితే, ఆలయంలో సీతాదేవి శ్రీరాముడికి కుడివైపున నిలబడి ఉండటం మరో విశేషం.

మర్కట హనుమాన్:

ఢిల్లీలోని యమునా నదిపై మర్కట హనుమాన్ ఆలయం ఉంది. అయితే హనుమాన్ సేతు వంతెన దాటగానే నిగమ బోధ ఘాట్ తీరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గర్భ గుడిలో దర్శనం ఇచ్చే హనుమంతుడి విగ్రహం నాలుగు అడుగుల ఎత్తులో గంధ సింధూరపు పూతతో కనిపిస్తుంది. అయితే హనుమంతుడి కుడిచేతిలో సంజీవ పర్వతం ఉండగా, ఎడమచేయి భూమిని ఆని ఉంటుంది. ఇక్కడ హనుమాన్ విగ్రహం చుట్టూ ఎప్పుడు నీరు నిండే ఉంటుంది. అంటే స్వామివారు యమునానదిలో నిలబడి ఉన్నట్లుగా చెబుతారు. అందుకే దీనిని కొంతమందు భక్తులు యమునాబజార్ హనుమాన్ మందిరం, మర్కట్ హనుమాన్ ఆలయం అనీ పిలుస్తుంటారు.

నెట్టికంటి ఆంజనేయస్వామి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, గుంతకల్ మండలంలో కసాపురం అనే గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడవెలసిన ఆంజనేయుడు ఒక కంటితో భక్తులకు దర్శనం ఇస్తుంటాడు. అందుకే ఈ స్వామిని నెట్టికంటి స్వామి అని పిలుస్తుంటారు. ఆ స్వామిని దర్శిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం.

బీచుపల్లి రాయుడు:

తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, ఇటిక్యాల మండలంలో, బీచుపల్లి అనే గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామివారు ఆలయం ఉంది. ఇది అతి పురాతన ఆలయముగా విరాజిల్లుతుంది. ఇక్కడ కొలువైన ఆంజనేయస్వామి వారిని బీచుపల్లి రాయుడు అని కొందరు భక్తులు పిలుస్తుంటారు. ఆంజనేయుడిని మొదటగా పూజించి అర్చకుడు అయినా ఒక బోయవాడైన బాలుని పేరే ఈ గ్రామానికి బీచుపల్లి అని పెట్టారని చెబుతారు.

నవావతార ఆంజనేయస్వామి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రకాశం జిల్లా, ఒంగోలులోని ముంగమూరు రోడ్డులో శ్రీ పంచముఖ ఆంజనేయ దేవస్థానం ఉంది. ఈ ఆలయంలో నవావతార ఆంజనేయ విగ్రహాలను తీర్చిదిద్దారు. మన దేశంలో ఆంజనేయస్వామిని తొమ్మిది అవతారలతో ప్రతిష్టించిన క్షేత్రం ఇది ఒక్కేటేనని చెబుతారు. ఈ ఆలయ ముందు భాగంలో భారీ ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. గర్భాలయంలో నల్లరాతితో మలచిన 10 అడుగుల పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం సర్వాలంకారభూషితంగా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా హనుమంతుడు పంచముఖ ఆంజనేయస్వామిగా, నవావతార ఆంజనేయుడిగా వెలసిన ఈ ఆలయానికి ప్రతినిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

శ్వేతవర్ణ ఆంజనేయుడు:

తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాద్ కి 5 కి.మీ. దూరంలో ఎల్లారెడ్డి గూడలో శ్రీ ఆంజనేయస్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా విరాజిల్లుతుంది. ఆంజనేయస్వామి ఇక్కడ శ్వేతవర్ణ రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నాడు. ఈ స్వామిని పూజిస్తే భూత, ప్రేత, పిశాచాలు, అకాలమరణాలు, ఈతిబాధలు తొలిగిపోయి మానసిక ప్రశాంతత కలగడమే గాక శనిపీడ వలన వచ్చే వ్యాధులు తగ్గుముఖం పడతాయని భక్తుల నమ్మకం.

ఈవిధంగా ఈ కొన్ని ఆలయాలే కాకుండా మరెన్నో అద్భుత ఆంజనేయస్వామి వారి ఆలయాలు ఉన్నవి.

Exit mobile version