Home Unknown facts శ్రీశైలంలో ప్రతిఒక్కరు తప్పకుండ చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఏంటో తెలుసా?

శ్రీశైలంలో ప్రతిఒక్కరు తప్పకుండ చూడవలసిన కొన్ని ప్రదేశాలు ఏంటో తెలుసా?

0

శివుడు తన ఆత్మ శక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో 12 చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఇక సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు శక్తి పీఠాలుగా వెలిశాయని చెబుతారు. వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అని అంటారు. అయితే ఒకే దగ్గర శివుడి యొక్క జ్యోతిర్లింగం, అమ్మవారి శక్తిపీఠం ఉన్న ఏకైక అద్భుత పుణ్యక్షేత్రం శ్రీశైలం. మరి శ్రీశైలం లో చూడవలసిన ప్రదేశాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

srisailam templesఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, కర్నూలుకు తూర్పుదిశలో సుమారు 70 కి.మీ. దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో ఎత్తైన కొండపైన వెలసిన అతి పురాతన శైవక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ వెలసిన శివుడి పేరు మల్లికార్జునుడు, అమ్మవారి పేరు భ్రమరాంబిక దేవి. శివుడు నందీశ్వరుడిని తన వాహనంగా చేసుకొని, శ్రీపర్వతం అనే పేరుతో పర్వతుణ్ణి రూపొందించి దానిపైన శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకున్నాడు. ఆ పర్వతం శ్రీ పర్వతమని, శ్రీ గిరి అని, అదియే శ్రీశైలం గా రూపాంతరం చెందింది అని స్థల పురాణం.

భ్రమరాంబిక శక్తిపీఠం:

అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు ఎందుకు వచ్చినదని అంటే, పూర్వం పరమేశ్వరుడి సౌమ్యతకు, మనోహర రూపానికి పరవశించి పోయి వివాహమాడాలనుకున్నది భ్రమరాంబిక దేవి. అయితే అక్కడే భ్రమిస్తున్న తేన టీగను చూపి అది విశ్రమించే వరకు దానిని అనుసరిస్తే వివాహమాడతాను అని శివుడు చెప్పడంతో దానివెనుక ఆ దేవి పరిగెత్తింది. ఇలా ఆమె కొన్ని సంవత్సరాల పాటు పరిగెత్తాల్సి వచ్చింది. ఇక చివరకు ఆ భ్రమరం ఇక్కడ విశ్రాంతి తీసుకుంది. అప్పుడు శివుడు ఒక వృధ్దినిగా వచ్చి, చాలాకాలం గడిచినందున వృధ్దిడిని అయ్యాను నేను వివాహానికి తగను అని చెప్పగా, వ్యక్తి ఆత్మ సౌందర్యాన్ని ఆదరించే ఆమె అభ్యంతరం లేదని వివాహానికి అంగీకరించింది. ఇలా భ్రమరాన్ని అనుసరించడం వల్ల ఆమెకు భ్రమరాంబిక అని పేరు స్థారకమైంది. ఇప్పటికి కూడా భ్రమర ఝంకారం భ్రమరాంబిక దేవి కొలువై ఉన్న గుడి వెనుక మనం వినవచ్చును అని భక్తుల నమ్మకం.

మనోహర గుండం:

ఈ మనోహర గుండంలో నీరు చాలా స్వచ్ఛమైనదిగా ఉంటుంది. శ్రీశైలం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉండగా అంత ఎత్తులో కూడా ఈ రాళ్ళలో స్వచ్ఛమైన నీరు ఉండటం విశేషం. అయితే ఈ చిన్న గుండంలోని నీటిలో రూపాయి నాణెం వేస్తె స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ వెలసిన మల్లికార్జునస్వామిని పంచపాండవులు, నాగప్రతిమలు దర్శనం చేసుకొని వారి పేరుమీద ఐదు దేవాలయాలను ప్రధాన దేవాలయం వెనుక భాగాన నిర్మించారని వాటినే పాండవుల దేవాలయాలని పిలుస్తారని పురాణం.

వృద్ధ మల్లికార్జున లింగం: 

ఇక్కడ ముడతలు పడిన ముఖంలా శివలింగం ఉంటుంది.  పురాణం ప్రకారం శివుడు భ్రమరాంబిక దేవి దగ్గరికి ఒక వృద్ధిని రూపంలో వచ్చి నేను ఇప్పుడు వివాహానికి తగను అని చెప్పగా దానికి ఆ దేవి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని వివాహానికి అంగీకరిస్తుంది. అందుకే ఈ శివలింగానికి వృద్ధ మల్లికార్జున లింగం అనే పేరు వచ్చినదని ఒక కథనం.

సాక్షి గణపతి:

ఇక శ్రీశైలంలోని ప్రధాన ఆలయానికి దగ్గరలో సాక్షి గణపతి అనే ఆలయం ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే గణపతి విగ్రహం ఏదో వ్రాస్తున్న భంగిమలో కూర్చొని ఉన్న విధంగా భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. ఇక సాక్షి గణపతి ప్రత్యేకత ఏంటంటే, శ్రీశైల మల్లికార్జునస్వామిని దర్శించిన భక్తులను స్వామి తన చిట్టాలో వ్రాసుకొని కైలాసంలో ఉన్న పరమశివుడికి నివేదించి సాక్షముగా ఉంటాడని ప్రతీతి. అంటే శ్రీశైలానికి వచ్చి శివుడిని దర్శనం చేసుకున్న భక్తులకి కైలాసా ప్రవేశానికి అనుమతి లభిస్తుందని అప్పుడు శ్రీశైలానికి వచ్చిన భక్తులకి గణపతి సాక్షిగా ఉంటాడని చెబుతారు. ఇలా భక్తులు శ్రీశైలానికి వచ్చారని గణపతి సాక్ష్యంగా ఉంటాడు కనుక ఈ స్వామికి సాక్షి గణపతి అనే పేరు వచ్చినదని అంటారు.

హఠకేశ్వరాలయం:

శ్రీశైలం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో హఠకేశ్వరాలయం ఉంది. ఇక్కడి హఠకేశ్వరుడు నిరంతరం మనల్ని మనలోని హఠాన్ని తొలగించుకోమని అప్పుడే మనకి శివసాయుజ్యం లభించగలదని హెచ్చరిస్తుంటాడని చెబుతారు.

ఘంఠ మఠం : 

ఇప్పటివరకు మనలో చాలామందికి శ్రీశైలం లో మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక దేవాలయాలకు వాయువ్య భాగాన ఘంఠమఠం అనే ఆలయం ఉందని తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే ఘంఠ మఠం అనే ఒక పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయం గురించి, ఇక్కడి మహత్యం గురించి తెలిసినవారు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఇక్కడ ఆణువణువూ ఒక అద్భుతమే అని చెప్పాలి. దాదాపుగా రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఈ ఆలయం ఉందని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఘంఠ మఠం గురించి తెలిసిన సమాచారం ప్రకారం, పూర్వం ఘంటా కర్ణుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత దేవతలు విజయానికి చిహ్నంగా ఈ ప్రదేశంలో ఒక పెద్ద గంటను మ్రోగించారని పురాణాలు చెబుతున్నాయి. అలా ఆ తరువాత ఎందరో మహారాజులు కూడా ఇక్కడ కొత్తగా ఘంటలని ప్రతిష్టించారు. ఇప్పుడు మనకి దర్శనం ఇచ్చే ఘంట కూడా 600 సంవత్సరాల క్రితం నాటిదిగా చెబుతున్నారు. ఇక్కడ ఒక గుంట ఉండగా అందులో నిత్యం నీరు ఎప్పుడు ఉంటుంది.

పాలధార – పంచధారలు:

శ్రీశైలంలోని ప్రధానాలయానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒక లోయప్రాంతంలో పాలధార – పంచధారలు ఉన్నవి. ఇక్కడి శిలపైనే శంకరుని పాదముద్రలు ఉన్నవి. ఇక్కడ పక్కపక్కనే ఒక చోట జలధార, మరొకచోట ఐదు జలధారలు ఎప్పుడు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. శివుని పాలభాగం నుండి ఉద్బవించిన ధార పాలధారగా, శివుడి పంచముఖాల నుండి ఉద్బవించిన ధార పంచధారలు అని చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ జలధారలు ఆరడుగులు మాత్రమే ముందుకు ప్రవహించి అక్కడే ఇంకి పోతాయి.

శిఖర దర్శనం:

శ్రీశైలం వెళ్ళే యాత్రికులకు చిట్టచివరి మజిలీ శిఖరదర్శనం. శైలం మొత్తంలో ప్రత్యేకమైనది, శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటూ ఇటూ వీలుగా త్రిప్పుకొనుచూ సుదూరంగా ఉన్న శ్రీమల్లిఖార్జుని ఆలయపు విమానంపై నున్న శిఖరాన్ని చూడుటకు ప్రయత్నించాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.

శ్రీశైల పర్వతాన్ని భూమి మొత్తానికి నాభి అని అంటారు. అయితే కృతయుగంలో హిరణ్యకశిపుడి పూజామందిరం ఈ క్షేత్రం, తేత్రాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి ఇక్కడ సహస్ర లింగాన్ని ప్రతిష్టించి పూజించారు. ద్వారపాయుగంలో పాండవులు, ద్రౌపతి ఈ క్షేత్రంలో శివలింగాలను ప్రతిష్టించి పూజించారు. వీరు ప్రతిష్టించిన శివలింగాలు ఇప్పటికి దర్శనమిస్తున్నాయి. ఇక కలియుగంలో మానవుల కోర్కెలు తీర్చేందుకు మహాశివుడు ఇక్కడే కొలువై ఉండగా ఇలా నాలుగు యుగాల చరిత్ర కలిగిన ఏకైక అద్భుత పుణ్యక్షేత్రం శ్రీశైలం.

Exit mobile version