దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోలు దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు. వెలుగు ఉంది అంటే చీకటి ఉంటుంది. అలాగే దైవశక్తి ఉంది అంటే దుష్టశక్తి ఉంటుంది. దైవశక్తి అడుగడుగునా సాయపడుతూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపిస్తుంది.
దుష్టశక్తులు అన్ని ఆటంకాలు కల్పిస్తూ నానా చీకాకులు పెడుతుంటాయని చెబుతారు పెద్దలు. ఇంట్లో పవిత్రమైన వాతావరణం లేనపుడు దుష్ట శక్తుల ప్రవేశం జరుగుతుందనీ, అవి ఆ ఇంటి సభ్యుల ఆరోగ్యాలపై తమ ప్రభావాన్ని చూపుతాయని అంటారు. అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి.
వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదు. దీంతో అదృష్టం కలసి వస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అలా దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే, ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధారణంగా పండుగ రోజుల్లోనే గుమ్మానికి మామిడి తోరణాలు కడుతుంటారు. ఆ తరువాత అవి ఎండిపోయి ఆ గుమ్మానికి అలాగే ఉంటాయి. అలా కాకుండా ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వలన, ఆ ఇల్లు పవిత్రమై దుష్ట శక్తులు లోపలి అడుగుపెట్టే అవకాశం లేకుండా చేస్తాయట.
తులసి ఆకుల నుంచి రసం తీసి దాన్ని శుభ్రమైన మంచి నీటిలో కలపాలి. ఆ తరువాత దైవాన్ని ప్రార్థించి ఆ ద్రవాన్ని ఇంట్లో చల్లాలి. దీంతో దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది.
అలాగే కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఇంట్లో పండితులచే యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్ట శక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అది ధనాన్ని ఆకర్షిస్తుంది.
కొద్దిగా జీలకర్ర, ఉప్పులను తీసుకుని ఆ మిశ్రమాన్ని ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. తరువాత మిగిలిన తలుపులు, కిటికీల వద్ద కూడా ఆ మిశ్రమాన్ని చల్లితే ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దాంతో పాటు స్నానం చేసిన తర్వాత రోజూ ఇంట్లో ఉదయం, సాయంత్రం వేళల్లో దీపం పెడితే దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.